హ్యాట్రిక్‌తో మెరిసిన ఆస్ట్రేలియా బౌలర్‌ | UP Warriorz Grace Harris Joins Unique List With WPL Hat-Trick | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌తో మెరిసిన ఆస్ట్రేలియా బౌలర్‌

Published Sun, Feb 23 2025 11:06 AM | Last Updated on Sun, Feb 23 2025 11:16 AM

UP Warriorz Grace Harris Joins Unique List With WPL Hat-Trick

మహిళల ఐపీఎల్‌లో (WPL-2025) ఆస్ట్రేలియా బౌలర్‌, యూపీ వారియర్జ్‌ (UP Warriorz) ఆల్‌రౌండర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ (Grace Harris) హ్యాట్రిక్‌తో (Hat Trick) మెరిసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న (ఫిబ్రవరి 22) జరిగిన మ్యాచ్‌లో గ్రేస్‌ ఈ ఘనత సాధించింది. ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదిస్తుండగా చివరి ఓవర్‌లో (20) గ్రేస్‌ హ్యాట్రిక్‌ నమోదు చేసింది. ఈ ఓవర్‌లో గ్రేస్‌ తొలి మూడు బంతులకు మూడు వికెట్లు తీసింది. తొలుత నికీ ప్రసాద్‌, ఆతర్వాత వరుసగా అరుంధతి రెడ్డి, మిన్నూ మణిలను ఔట్‌ చేసింది. హ్యాట్రిక్‌తో కలిసి గ్రేస్‌ ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టింది.

డబ్ల్యూపీఎల్‌లో హ్యాట్రిక్‌ సాధించిన మూడో బౌలర్‌గా గ్రేస్‌ రికార్డు సృష్టించింది. డబ్ల్యూపీఎల్‌ తొలి హ్యాట్రిక్‌ను లీగ్‌ ఆరంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ ఇస్సీ వాంగ్‌ సాధించింది. యూపీ వారియర్జ్‌తో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఇస్సీ వాంగ్‌ ఈ ఘనత సాధించింది. అనంతరం 2024 ఎడిషన్‌లో రెండో హ్యాట్రిక్‌ నమోదైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్జ్‌ బౌలర్‌ దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. లీగ్‌లో నమోదైన మూడు హ్యాట్రిక్స్‌లో రెండు యూపీ బౌలర్లే సాధించడం విశేషం.

ఇదిలా ఉంటే, గ్రేస్‌తో (2.3-0-15-4) పాటు క్రాంతి గౌడ్‌ (4-0-25-4) కూడా చెలరేగడంతో ముంబైపై యూపీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యూపీ.. చిన్నెల్‌ హెన్రీ సుడిగాలి అర్ద శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. చిన్నెల్‌ 23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసి ఔటైంది. 

హాఫ్‌ సెంచరీ మార్కును 18 బంతుల్లో చేరుకున్న చిన్నెల్‌.. సోఫీ డంక్లీతో కలిసి లీగ్‌లో జాయింట్‌ ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ రికార్డును షేర్‌ చేసుకుంది. యూపీ ఇన్నింగ్స్‌లో చిన్నెల్‌ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. తహ్లియా మెక్‌గ్రాత్‌ 24, కిరణ్‌ నవ్‌గిరే 17, దీప్తి శర్మ 13, శ్వేత సెహ్రావత్‌ 11, సోఫీ ఎక్లెస్టోన్‌ 12 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్‌ 4 వికెట్లు పడగొట్టగా.. మారిజన్‌ కాప్‌, అరుంధతి రెడ్డి తలో రెండు, శిఖా పాండే ఓ వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 178 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ తడబడింది. జెమీమా రోడ్రిగెజ్‌ (56) అర్ద సెంచరీతో రాణించినప్పటికీ.. ఆమెకు మరో ఎండ్‌ నుంచి సహకారం లభించలేదు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు షఫాలీ వర్మ (24), నికీ ప్రసాద్‌ (18), శిఖా పాండే (15 నాటౌట్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుత ఎడిషన్‌లో యూపీకి ఇది తొలి విజయం. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. మూడు మ్యాచ్‌ల్లో తలో రెండు గెలిచిన ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌ టేబుల్‌ టాపర్లుగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement