ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు వరుసగా నాలుగో మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. నిన్న (మే 6) జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 56 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో) ఆతిథ్య జట్టును చిత్తు చేసింది.
వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (39), స్మృతి మంధన (22), హేమలత (22), రిచా ఘోష్ (24) రాణించడంతో 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది.
భారత ఇన్నింగ్స్ అనంతరం మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో బంగ్లా లక్ష్యాన్ని 14 ఓవర్లలో 125 పరుగులుగా నిర్దారించారు. ఛేదనలో ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా వరుసగా నాలుగో మ్యాచ్‌లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
భారత బౌలర్లు దీప్తి శర్మ (3-0-13-2), ఆశా శోభన (3-0-18-2), రాధా యాదవ్ (3-1-12-1), పూజా వస్త్రాకర్ (3-0-15-1) బంగ్లా బ్యాటర్లను వణికించారు. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో దిలారా అక్తెర్ (21) టాప్ స్కోరర్‌గా నిలిచింది.
నామమాత్రమైన ఆఖరి మ్యాచ్ మే 9న జరుగనుంది. ఈ మ్యాచ్‌లో కూడా భారత్ గెలిస్తే సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్లవుతుంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు ఈ సిరీస్ విజయం మాంచి బూస్టప్ ఇచ్చింది. టీ20 ప్రపంచకప్ బంగ్లాదేశ్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది.
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా విభజించబడి పోటీపడతాయి. శ్రీలంక.. భారత్, పాక్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లతో కలిసి గ్రూప్-ఏలో.. స్కాట్లాండ్.. సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో కలిసి గ్రూప్-బిలో అమీతుమీ తేల్చుకుంటాయి.
గ్రూప్ దశలో ప్రతి జట్టు సొంత గ్రూప్‌లోని జట్టుతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యాక టాప్ రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో జరిగే సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ ప్రపంచకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ అక్టోబర్ 6న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment