
మహిళల వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరఫున తొలి సెంచరీ నమోదైంది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియాతో ఇవాళ (జులై 22) జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో ఫర్జానా హాక్ (160 బంతుల్లో 107; 7 ఫోర్లు) ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు వన్డేల్లో బంగ్లాదేశ్ తరఫున అత్యధిక స్కోర్ రికార్డు సల్మా ఖాతూన్ పేరిట ఉండేది.
2013 ఏప్రిల్‌లో సల్మా భారత్‌పై 75 పరుగులు చేసింది. అదే నేటి వరకు వన్డేల్లో బంగ్లా తరఫున అత్యధిక స్కోర్‌గా ఉండింది. బంగ్లా తరఫున వన్డేల్లో తొలి సెంచరీ రికార్డుతో పాటు ఫర్జానా ఖాతాలో మరో 2 రికార్డులు కూడా ఉన్నాయి. బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు (56 మ్యాచ్‌ల్లో 25.83 సగటున 1240 పరుగులు), బంగ్లా తరఫున వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు (9) ఫర్జానా పేరిటే ఉన్నాయి.
భారత్‌తో మ్యాచ్‌లో 160 బంతులు ఎదుర్కొన్న ఫర్జానా.. మహిళల క్రికెట్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కింది. టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మతో కలిసి ఫర్జానా ఈ రికార్డును షేర్ చేసుకుంది. ఈ జాబితాలో ఐర్లాండ్ అన్నె ముర్రే (171) టాప్‌లో ఉంది.
ఇదిలా ఉంటే, ఫర్జానా రికార్డు సెంచరీతో కదంతొక్కడంతో భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఫర్జానాతో పాటు మరో ఓపెనర్ షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించింది. కెప్టెన్ నిగర్ సుల్తానా (24), ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. 37 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసి, విజయం దిశగా సాగుతుంది. స్మృతి మంధన (59) అర్ధశతకంతో మెరవగా.. హర్లీన్ డియోల్ (67 నాటౌట్) భారత్‌ను విజయతీరాలకు చేర్చే ప్రయత్నం చేస్తుంది. హర్లీన్‌కు జతగా జెమీమా రోడ్రిగెజ్ (6) క్రీజ్లో ఉంది. షెఫాలీ వర్మ (4), యస్తికా భాటియా (5), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (14) ఔటయ్యారు. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్, మరుఫా అక్తర్, నహిద అక్తర్, ఫామిమా ఖాతూన్ తలో వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment