INDW VS BANW 3rd ODI: Match Tied, Series Ends In Draw - Sakshi
Sakshi News home page

ఉ‍త్కంఠ సమరంలో భారత్‌ను నిలువరించిన బంగ్లాదేశ్‌.. మ్యాచ్‌ టై, సిరీస్‌ డ్రా

Published Sat, Jul 22 2023 5:58 PM | Last Updated on Sat, Jul 22 2023 6:01 PM

INDW VS BANW 3rd ODI: Match Tied, Series Ends In Draw - Sakshi

బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించలేక 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో అతికష్టం మీద కైవసం చేసుకున్న భారత్‌.. ఇవాళ (జులై 22) జరిగిన వన్డే సిరీస్‌ డిసైడర్‌ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి, ఆఖరి నిమిషంలో చతికిలపడింది.

బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి 6 వికెట్లు 34 పరుగుల వ్యవధిలో కోల్పోయిన భారత్‌.. స్కోర్లు సమం అయ్యాక ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో మ్యాచ్‌ 'టై'గా ముగిసింది. సూపర్‌ ఓవర్‌ నిబంధన లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 'టై'గా సిరీస్‌ను 'డ్రా'గా ప్రకటించారు. వన్డే ట్రోఫీని బంగ్లా టీమ్‌.. టీమిండియాతో సంయుక్తంగా పంచుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. ఫర్జానా హాక్‌ (107) సూపర్‌ శతకంతో, షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో​కి దిగిన భారత్‌.. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ స్మృతి మంధన (59), హర్లీన్‌ డియోల్‌ (77) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ దశలో భారత్‌ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో భారత్‌ 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలిచే అవకాశాలను చేజార్చుకుంది.

ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్‌ (33 నాటౌట్‌) టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆఖరి ఓవర్‌లో భారత్‌ విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం కాగా.. మరూఫా బౌలింగ్‌లో మేఘన సింగ్‌ ఔటై, భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్‌ 3, మరూఫా అక్తర్‌ 2, సుల్తానా ఖాతూన్‌, రబేయా ఖాన్‌, ఫహీమ ఖాతూన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement