
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భారత్ రేపు కీలక మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సూచించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన హర్షిత్ రాణాను (Harshit Rana) పక్కన పెట్టాలని సలహా ఇచ్చాడు. రాణా స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి (Varun Chakravarthy) అవకాశం ఇవ్వాలని కోరాడు.
బంగ్లాతో మ్యాచ్‌లో పేసర్లే అధికంగా వికెట్లు తీసినప్పటికీ.. స్పిన్నర్లు టీమిండియా గెలుపులో ప్రధాన పాత్ర పోషించారని అన్నాడు. బంగ్లాదేశ్ మ్యాచ్‌లో పేసర్ల కంటే స్పిన్నర్లే పొదుపుగా బౌలింగ్ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. అందుకే భారత్ కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌లో నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. షమీకి జతగా హార్దిక్ పాండ్యాను రెండో పేసర్‌గా వినియోగించుకోవాలని సలహా ఇచ్చాడు. స్పోర్ట్స్ టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ ఈ విషయాలను వెల్లడించాడు.
కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లతో పాటు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. భారత బౌలర్లు చెలరేగడంతో ఆదిలో కష్టాల్లో ఎదుర్కొంది. 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను తౌహిద్ హృదయ్ (100) వీరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి జాకిర్ అలీ (68) సహకరించడంతో బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ (228) చేయగలిగింది.
ఐసీసీ ఈవెంట్లలో చెలరేగిపోయే మహ్మద్ షమీ ఈ మ్యాచ్‌లోనూ జూలు విదిల్చి ఐదు వికెట్లు తీశాడు. మరో పేసర్ హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. రోహిత్ తప్పిదం వల్ల ఈ మ్యాచ్‌లో అక్షర్ హ్యాట్రిక్ తీసే సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. మిగతా స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ సైతం పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ కూడా ఇబ్బంది పడింది. రోహిత్ (41) తన సహజ శైలిలో బ్యాట్‌ను ఝులిపించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమై సెంచరీతో చివరి వరకు క్రీజ్‌లో ఉండి భారత విజయాన్ని ఖరారు చేశాడు. అతనికి కేఎల్ రాహుల్ సహకరించాడు. ఇన్నింగ్స్ మధ్యలో భారత్ స్వల్ప వ్యవధిలో విరాట్ కోహ్లి(22), శ్రేయస్ అయ్యర్ (15), అక్షర్ పటేల్ (8) వికెట్లు కోల్పోయి తడబడింది.
అయితే గిల్, రాహుల్ జాగ్రత్తగా ఆడి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ ఛేదించేందుకు భారత్ కాస్త ఇబ్బందిపడింది. బంగ్లా బౌలర్లు.. ముఖ్యంగా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. రిషద్ హొసేన్ పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా రెండు వికెట్లు తీశాడు. మెహిది హసన్ మిరాజ్ భారత బ్యాటర్ల సహనాన్ని పరీక్షించాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్యం కాస్త పెద్దదై ఉంటే టీమిండియా ఇబ్బంది పడాల్సి వచ్చేది.
Comments
Please login to add a commentAdd a comment