పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్‌ | Why Would They: Gavaskar Blunt Take As Pant, Varun, Arshdeep Remain On Bench | Sakshi
Sakshi News home page

Ind vs Pak: పాక్‌తో మ్యాచ్‌లో అతడిని ఆడించాల్సింది.. కానీ: గావస్కర్‌

Published Sun, Feb 23 2025 5:01 PM | Last Updated on Sun, Feb 23 2025 5:20 PM

Why Would They: Gavaskar Blunt Take As Pant, Varun, Arshdeep Remain On Bench

బంగ్లాదేశ్‌పై గెలుపొంది చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025)ని విజయంతో ఆరంభించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో రోహిత్‌ సేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌(India vs Pakistan)ను ఢీకొట్టింది. దుబాయ్‌ వేదికగా  ఆదివారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ భారత జట్టును తొలుత ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది.

ఆ నలుగురు మళ్లీ బెంచ్‌ మీదే
ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది. బంగ్లాదేశ్‌తో ఆడిన తుదిజట్టునే పాక్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించింది. స్టార్‌ ప్లేయర్లు రిషభ్‌ పంత్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్ష్‌దీప్‌ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌కు మరోసారి మొండిచేయి చూపింది. 

ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ టాస్‌ సమయంలో స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ మయాంతి లాంగర్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ప్లేయింగ్‌ ఎలెవన్‌ విషయంలో మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించాడు.

ఒ‍క్క మార్పు చేసి ఉంటే బాగుండేది..
‘‘అయినా.. వాళ్లెందుకు తుదిజట్టులో మార్పులు చేయాలి? ఇది స్లో వికెట్‌. అంతేగాక ప్రస్తుత ప్లేయింగ్‌ ఎలెవన్‌తోనే వారు గత మ్యాచ్‌ గెలిచారు. అయితే, ఒ‍క్క మార్పు చేసి ఉంటే బాగుండేది. వరుణ్‌ చక్రవర్తిని పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆడించి ఉండాల్సింది. కానీ గత మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన మహ్మద్‌ షమీని ఎలా పక్కనపెట్టగలరు?

అంతేగాక.. మరో పేసర్‌ హర్షిత్‌ రాణా కూడా గత మ్యాచ్‌లో ఎలాంటి తప్పిదాలు చేయలేదు. అందుకే టీమిండియాపాక్‌తో పోరులోనూ  అదే జట్టుతో బరిలోకి దిగింది’’ అని సునిల్‌ గావస్కర్‌ నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. 

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ మాత్రం ఒక మార్పుతో మైదానంలో దిగింది. ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడిన సమయంలో ఫఖర్‌ జమాన్‌ గాయపడగా.. భారత్‌తో మ్యాచ్‌లో సౌద్‌ షకీల్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది.

2017లో చివరిసారిగా
కాగా చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలో భారత్‌- పాకిస్తాన్‌ 2017లో చివరిసారిగా తలపడ్డాయి. నాడు లీగ్‌ దశలో టీమిండియా గెలుపొందగా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్‌ భారత జట్టును ఓడించిన టైటిల్‌ ఎగురేసుకపోయింది. ఈ క్రమంలో దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి చాంపియన్స్‌ ట్రోఫీ జరుగుతుండగా. ఆతిథ్య జట్టు హోదాలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా పాక్‌ బరిలోకి దిగింది.

అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడుతోంది. ఇక ఈ మెగా టోర్నీలో గ్రూప్‌-ఎ నుంచి భారత్‌, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌.. గ్రూప్‌-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌, ఇంగ్లండ్‌ ట్రోఫీ కోసం తలపడుతున్నాయి. 

ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌పై భారత్‌, అఫ్గనిస్తాన్‌పై సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా గెలుపొందాయి. పాయింట్ల పట్టికలో గ్రూప్‌-ఎ నుంచి న్యూజిలాండ్‌.. గ్రూప్‌-బి నుంచి సౌతాఫ్రికా టాప్‌లో ఉన్నాయి.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో భారత తుదిజట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌.

పాకిస్తాన్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌
సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజం, ఇమామ్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహిన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌.

చదవండి: షమీ చెత్త రికార్డు.. చాంపియన్స్‌ ట్రోఫీ చరిత్రలోనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement