మహిళల క్రికెట్ విజేత రైల్వేస్ జట్టు
మహిళల క్రికెట్ విజేత రైల్వేస్ జట్టు
Published Tue, Oct 18 2016 10:28 PM | Last Updated on Mon, Sep 4 2017 5:36 PM
రన్నరప్ మహారాష్ట్ర జట్టు
గుంటూరు స్పోర్ట్స్: సీనియర్ ఉమెన్ వన్‌డే క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతగా రైల్వేస్ జట్టు నిలిచింది. మహారాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమి, పేరేచర్లలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లలో రైల్వేస్ జట్టు 12 పాయింట్‌లు సాధించి విజేతగా నిలిచింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ జట్లు చెరో నాలుగు పాయింట్‌లు సాధించాయి. అయితే రన్‌రేట్ ఆధారంగా మహారాష్ట్ర జట్టును రన్నరప్‌గా ప్రకటించారు.
మంగళవారం జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమిలో జరిగిన వన్‌డే మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 139 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 43.2 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది. పేరేచర్లలో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ జట్టు 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేత రైల్వేస్, రన్నరప్ మహారాష్ట్ర జట్లకు ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement