Railways team
-
రికార్డు ఛేజింగ్..90 ఏళ్ల టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి
రంజీ ట్రోఫీలో రైల్వేస్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రైల్వేస్ రికార్డులెక్కింది. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో భాగంగా త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రైల్వేస్ జట్టు.. ఈ అరుదైన ఘనతను తమ ఖాతాలో వేసుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు సౌరాష్ట్ర పేరిట ఉండేది. 2019-20 సీజన్లో ఉత్తరప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 372 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఛేజ్ చేసింది. తాజా మ్యాచ్‌తో సౌరాష్ట్ర ఆల్‌టైమ్ రికార్డును రైల్వేస్ బ్రేక్ చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 378 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రైల్వేస్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రైల్వేస్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రిథమ్ సింగ్(169 నాటౌట్),మహ్మద్ సైఫ్(106) అద్బుత సెంచరీలతో చెలరేగారు. అంతకుముందు త్రిపురా రెండో ఇన్నింగ్స్‌లో 330 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి రైల్వేస్ ముందు 378 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కాగా తొలి తొలి ఇన్నింగ్స్‌లో త్రిపురా 149 పరుగులకు ఆలౌట్ కాగా.. రైల్వేస్ సైతం 105 పరుగులకే కుప్పకూలింది. కానీ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్న రైల్వేస్ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. -
సెంచరీతో జట్టును గెలిపించిన రుతురాజ్ గైక్వాడ్
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో మెరిశాడు. విషయంలోకి వెళితే.. శనివారం రైల్వేస్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 38.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ శతకంతో జట్టును గెలిపించాడు. 123 బంతుల్లో 124 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 బంతుల్లో 75 పరుగులు, 10 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివమ్ చౌదరీ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కర్ణ్ శర్మ 40 పరుగులు చేశాడు. మహారాష్ట్ర బౌలర్లలో కాజీ రెండు వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరీ, మనో ఇంగాలే, ఎస్ఎస్ బచావ్, అజిమ్ కాజీలు తలా ఒక వికెట్ తీశారు. -
ఉద్యోగులే ఆటగాళ్లుగా ఉండాలి
న్యూఢిల్లీ: బీసీసీఐ సాంకేతిక కమిటీ ఇటీవల తీసుకున్న నిర్ణయం దేశంలో క్రీడాకారులను ఉద్యోగులుగా నియమించేకునే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్వేస్‌ను సంకటంలో పడేయనుంది. దేశవాళీ అండర్–19 టోర్నీ అయిన కూచ్ బెహార్ ట్రోఫీలో రైల్వేస్ జట్టు తరఫున ఉద్యోగులు కాకుండా వారి పిల్లలు ఆడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులను కోల్‌కతాలో కొద్ది రోజుల క్రితం నిర్వహించిన సమావేశంలో సాంకేతిక కమిటీ చర్చించింది. ఇకపై దీనికి అనుమతించకూడదని నిర్ణయించింది. అనుబంధ సంఘాలకు సంబంధించి బీసీసీఐ అన్ని స్థాయిల టోర్నీల్లో ఈ విషయమై కఠినంగా ఉండాలని భావిస్తోంది. మరోవైపు కూచ్ బెహార్లో తమ ఉద్యోగుల పిల్లల ప్రాతినిధ్యం వాస్తమేనని రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్పీబీ) కార్యదర్శి రేఖా యాదవ్ అంగీకరించారు. ఏటా 15–20 మంది అండర్–19 క్రీడాకారులతో జట్టును రూపొందించి టోర్నీకి పంపడం తమకు సాధ్యం కానందునే ఇలా చేస్తున్నట్లు ఆమె వివరణ ఇచ్చారు. చాలామంది కుర్రాళ్లు ముంబై, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల జట్లకు ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో తమ సొంత ఎంపిక ప్రక్రియలో కూడా సరిపడినంత మంది దొరకడం లేదని వివరించారు. -
మహిళల క్రికెట్ విజేత రైల్వేస్ జట్టు
రన్నరప్ మహారాష్ట్ర జట్టు గుంటూరు స్పోర్ట్స్: సీనియర్ ఉమెన్ వన్డే క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతగా రైల్వేస్ జట్టు నిలిచింది. మహారాష్ట్ర జట్టు రన్నరప్‌గా నిలిచింది. జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమి, పేరేచర్లలోని ఏసీఏ, జాగర్లమూడి నరేంద్రనాథ్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లలో రైల్వేస్ జట్టు 12 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ జట్లు చెరో నాలుగు పాయింట్లు సాధించాయి. అయితే రన్‌రేట్ ఆధారంగా మహారాష్ట్ర జట్టును రన్నరప్‌గా ప్రకటించారు. మంగళవారం జేకేసీ కళాశాలలోని ఏసీఏ ఉమెన్స్ అకాడమిలో జరిగిన వన్డే మ్యాచ్‌లో రైల్వేస్ జట్టు 139 పరుగుల తేడాతో ఢిల్లీ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన రైల్వేస్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 102 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 43.2 ఓవర్లలో 126 పరుగులు చేసి ఆలౌట్ అయ్యి పరాజయం పాలైంది. పేరేచర్లలో జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు 2 వికెట్ల తేడాతో మహారాష్ట్ర జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన మహారాష్ట్ర జట్టు 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మధ్యప్రదేశ్ జట్టు 49.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. విజేత రైల్వేస్, రన్నరప్ మహారాష్ట్ర జట్లకు ట్రోఫీలు అందించారు. కార్యక్రమంలో మెన్ అండ్ ఉమెన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జాగర్లమూడి మురళీమోహన్, సీఆర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.