విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో మెరిశాడు. విషయంలోకి వెళితే.. శనివారం రైల్వేస్, మహారాష్ట్ర మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మహారాష్ట్ర ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 219 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 38.2 ఓవర్లలో టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రుతురాజ్ శతకంతో జట్టును గెలిపించాడు.
123 బంతుల్లో 124 పరుగులు చేసిన రుతురాజ్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. అతనికి తోడుగా మరో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి(80 బంతుల్లో 75 పరుగులు, 10 ఫోర్లు, ఒక సిక్స్) రాణించాడు. ఈ ఇద్దరి మధ్య తొలి వికెట్‌కు 165 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన రైల్వేస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. శివమ్ చౌదరీ 46 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కర్ణ్ శర్మ 40 పరుగులు చేశాడు. మహారాష్ట్ర బౌలర్లలో కాజీ రెండు వికెట్లు తీయగా.. ముఖేశ్ చౌదరీ, మనో ఇంగాలే, ఎస్‌ఎస్ బచావ్, అజిమ్ కాజీలు తలా ఒక వికెట్ తీశారు.
Comments
Please login to add a commentAdd a comment