సూర్యకుమార్‌ మళ్లీ ఫెయిల్‌.. రుతురాజ్‌ సూపర్‌ సెంచరీ | Ranji Trophy 2024 MUM Vs MAH: Suryakumar Fails, Ruturaj Slams Century, Check More Details | Sakshi
Sakshi News home page

Ranji Trophy 2024: సూర్యకుమార్‌ మళ్లీ ఫెయిల్‌.. సెంచరీతో చెలరేగిన రుతురాజ్‌

Published Sun, Oct 20 2024 5:35 PM | Last Updated on Sun, Oct 20 2024 8:30 PM

Ranji Trophy 2024 Mum Vs Mah: Suryakumar Fails Ruturaj Slams Century

రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో టీమిండియా క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మెరుగ్గా రాణిస్తున్నాడు. తొలుత జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో 86 పరుగులతో రాణించిన ఈ మహారాష్ట్ర కెప్టెన్‌.. ముంబైతో మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. తద్వారా తన ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ కెరీర్‌లో ఏడో సెంచరీని నమోదు చేశాడు.

కాగా రంజీ టోర్నీలో భాగంగా ముంబై- మహారాష్ట్ర మధ్య శుక్రవారం మ్యాచ్‌ మొదలైంది. ముంబైలోని శరద్‌ పవార్‌ క్రికెట్‌ అకాడమీ బీకేసీలో వేదికగా టాస్‌ గెలిచిన మహారాష్ట్ర తొలుత బ్యాటింగ్‌ చేసింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ రుతురాజ్‌ సహా మరో ముగ్గురు ఆటగాళ్లు డకౌట్‌ కావడం ప్రభావం చూపింది.

సూర్యకుమార్‌ మళ్లీ ఫెయిల్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే ఓపెనర్‌ పృథీ​ షా(1) వికెట్‌ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే సూపర్‌ సెంచరీ(176)తో రాణించాడు. మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌(142) కూడా శతక్కొట్టాడు. అయితే, టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం మరోసారి రెడ్‌బాల్‌ క్రికెట్‌లో విఫలమయ్యాడు. పద్నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.

రుతురాజ్‌ సూపర్‌ సెంచరీ
అయితే, ఆయుశ్‌, శ్రేయస్‌ల భారీ సెంచరీల వల్ల ముంబై తమ తొలి ఇన్నింగ్స్‌లో 441 పరుగులు చేసింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఓపెనర్‌ సచిన్‌ దాస్‌(98) శుభారంభం అందించగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. మొత్తంగా 171 బంతులు ఎదుర్కొన్న అతడు 16 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 145 రన్స్‌ సాధించాడు.

మూడో రోజు ఆటలో భాగంగా ఆదివారం రుతుతో పాటు అంకిత్‌ బావ్నే తన సూపర్‌ హాఫ్‌ సెంచరీని శతకం దిశగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో మహారాష్ట్ర ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 102 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 377 రన్స్‌ స్కోరు చేసింది. 

కాగా ఇటీవల ఆస్ట్రేలియా టూర్‌కు ప్రకటించిన భారత్‌-‘ఎ’ జట్టుకు రుతురాజ్‌ గైక్వాడ్‌ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సూర్యకుమార్‌ యాదవ్‌ ఇటీవల దులిప్‌ ట్రోఫీ-2024 బరిలో దిగి కేవలం ఐదు పరుగులే చేసి పెవిలియన్‌ చేరాడు.

మహారాష్ట్ర వర్సెస్‌ ముంబై తుదిజట్లు
మహారాష్ట్ర
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్‌ కీపర్‌), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్‌ఎస్‌ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.

ముంబై
పృథ్వీ షా, ఆయుశ్‌ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్‌), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్‌.

చదవండి: సర్ఫరాజ్‌ కాదు!.. మిడిలార్డర్‌లో అతడిని ఆడించాలి: మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement