‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్‌ గైక్వాడ్‌ | Shame To Even Appeal For A Catch: Ruturaj Gaikwad Fumes Over Bizarre Dismissal In Ranji Trophy, Video Goes Viral | Sakshi
Sakshi News home page

‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’.. మండిపడ్డ రుతురాజ్‌ గైక్వాడ్‌

Published Fri, Nov 8 2024 3:49 PM | Last Updated on Fri, Nov 8 2024 4:41 PM

Shame To Even Appeal: Ruturaj Gaikwad Fumes Bizarre Dismissal In Ranji Trophy

టీమిండియా క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సహనం కోల్పోయాడు. అంపైర్ల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యర్థి బ్యాటర్‌ను అవుట్‌ చేసేందుకు మరీ ఇంత దిగజారాలా అంటూ సర్వీసెస్‌ జట్టు తీరును విమర్శించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? రుతురాజ్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శన
భారత్‌-‘ఎ’ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. ఆస్ట్రేలియా-‘ఎ’తో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ ఆడుతున్నాడు. అక్కడ రుతు స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలబడ్డాడు. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా పేలవ ప్రదర్శనతో విమర్శల పాలయ్యాడు. ఆసీస్‌-‘ఎ’ జట్టుతో నాలుగు ఇన్నింగ్స్‌లో రుతురాజ్‌ చేసిన పరుగులు వరుసగా 0, 5, 4 ,11.

దేశవాళీ క్రికెట్‌లో మహారాష్ట్ర కెప్టెన్‌గా
ఇక రుతురాజ్‌ సారథ్యంలో భారత్‌-‘ఎ’ జట్టు ఇప్పటికే తొలి టెస్టులో ఓడి.. రెండో మ్యాచ్‌లోనూ పరాజయం దిశగా పయనిస్తోంది. ఇదిలా ఉంటే.. భారత్‌లో ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ నడుస్తోంది. 

ఇందులో భాగంగా మహారాష్ట్ర జట్టు తమ నాలుగో మ్యాచ్‌లో సర్వీసెస్‌తో తలపడుతోంది. పుణె వేదికగా బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సర్వీసెస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

185 పరుగులకే ఆలౌట్‌
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 185 పరుగులకే కుప్పకూలింది. నిజానికి మహారాష్ట్ర ఈ మేర కాస్త చెప్పుకోదగ్గ స్కోరు చేయడానికి కారణం ఆ జట్టు కెప్టెన్‌ అంకిత్‌ బావ్నే. రుతురాజ్‌ గైక్వాడ్‌ గైర్హాజరీలో మహారాష్ట్ర టీమ్‌ను ముందుకు నడిపిస్తున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌   అర్ధ శతకంతో మెరిశాడు.

సర్వీసెస్‌తో మ్యాచ్‌లో తమ మొదటి ఇన్నింగ్స్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అంకిత్‌.. 8 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 73 పరుగులు చేశాడు. అయితే, అతడు అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. 

వివాదాస్పద రీతిలో అంకిత్‌ అవుట్‌
క్రీజులో పాతుకుపోయిన అంకిత్‌ వికెట్‌ తీయాలన్న పట్టుదలతో ఉన్న సర్వీసెస్‌.. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న తమ పేసర్‌ అమిత్‌ శుక్లాను రంగంలోకి దించింది.

అతడి బౌలింగ్‌లో షాట్‌ ఆడబోయిన అంకిత్‌ విఫలమయ్యాడు. అంకిత్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ను తాకిన బంతి సెకండ్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న శుభం రోహిలా చేతిలో పడ్డట్లు కనిపించింది. 

దీంతో సర్వీసెస్‌ అప్పీలు చేయగా అంపైర్‌ అవుట్‌ ఇచ్చాడు. అయితే, రీప్లేలో మాత్రం.. ఫీల్డర్‌ చేతిలో పడే కంటే ముందే బాల్‌ నేలను తాకినట్లు స్పష్టంగా కనిపించింది.

అయినప్పటికీ అంకిత్‌ బావ్నేను అవుట్‌గా ప్రకటించడంతో మహారాష్ట్ర కీలక వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో అంకిత్‌ అవుటైన తీరుపై రుతురాజ్‌ ఘాటుగా స్పందించాడు. 

‘అప్పీలు చేయడానికైనా కాస్త సిగ్గుండాలి’
ఇందుకు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ.. ‘‘లైవ్‌ మ్యాచ్‌లో.. దీనిని ఎలా అవుట్‌గా ప్రకటిస్తారు? అసలు అది క్యాచ్‌ అవుట్‌ అని అప్పీలు చేయడం కూడా నిజంగా సిగ్గుచేటు’’ అని మహారాష్ట్ర రెగుల్యర్‌ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మండిపడ్డాడు.

ఇక రంజీ తాజా సీజన్‌లో ఎలైట్‌ గ్రూప్‌-ఎ మ్యాచ్‌లలో భాగంగా తొలుత కశ్మీర్‌తో మ్యాచ్‌ డ్రా చేసుకున్న మహారాష్ట్ర.. ఆ తర్వాత ముంబై చేతిలో 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం.. మేఘాలయపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించి గెలుపుబాట పట్టింది.

చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్‌ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement