ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులోనూ భారత బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన రుతురాజ్ సేన ఓటమి దిశగా పయనిస్తోంది. కాగా ఆస్ట్రేలియాతో టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు భారత్-‘ఎ’- ఆసీస్- ‘ఎ’ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది.
రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని ఈ జట్టులో.. బీజీటీకి ఎంపికైన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిద్ కృష్ణ తదితరులు ముందుగానే భారత్-‘ఎ’ జట్టుతో చేరగా.. రెండో టెస్టు కోసం కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ కూడా టీమిండియా కంటే ముందే ఆసీస్‌కు వచ్చారు.
తొలిరోజు ఇలా
ఈ క్రమంలో మెల్‌బోర్న్ వేదికగా గురువారం రెండో టెస్టు మొదలుకాగా.. భారత్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (4), అభిమన్యు ఈశ్వరన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (16) అందివచ్చిన చక్కని అవకాశాన్ని అందుకోలేక మరోసారి చేతులెత్తేశాడు. ఒకే ఒక్కడు ధ్రువ్ జురేల్ (186 బంతుల్లో 80; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ ‘ఎ’ జట్టును ఆదుకున్నాడు.
ఇన్నింగ్స్ ఓపెన్ చేసిన అభిమన్యుతో పాటు వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (0)లను జట్టు ఖాతా తెరవకముందే నెసర్ తొలి ఓవర్ వరుస బంతుల్లోనే అవుట్ చేశాడు. రెండో ఓవర్లో రాహుల్, మూడో ఓవర్లో కెప్టెన్ రుతురాజ్ (4) నిష్క్రమించడంతో 11 పరుగులకే టాప్–4 బ్యాటర్లను కోల్పోయింది.
ఈ దశలో దేవ్‌దత్ పడిక్కల్ (26; 3 ఫోర్లు)కు జతయిన జురేల్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలకుండా ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 53 పరుగులు జోడించాక పడిక్కల్‌ను నెసర్ అవుట్ చేశాడు. జురెల్ ఈసారి నితీశ్‌తో కలిసి జట్టు స్కోరును 100 దాటించాడు. భాగస్వామ్యం బలపడుతున్న సమయంలో వెబ్‌స్టర్ ఒకే ఓవర్లో నితీశ్, తనుశ్ (0), ఖలీల్ అహ్మద్ (1)లను అవుట్ చేసి భారత్‌ను ఆలౌట్‌కు సిద్ధం చేశాడు.
ప్రసిద్ కృష్ణ (14) సహకారంతో జురేల్ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో భారత్ 150 పైచిలుకు స్కోరు చేయగలిగింది. ఆసీస్ బౌలర్లలో నెసర్ (4/27), వెబ్‌స్టర్ (3/19) భారత్‌ను దెబ్బ కొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా ‘ఎ’ ఆట ముగిసే సమయానికి 17.1 ఓవర్లలో 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.
ఆసీస్ 223 ఆలౌట్
ఈ క్రమంలో 53/2 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట మొదలుపెట్టిన ఆసీస్‌ను భారత బౌలర్లు 223 పరుగులకు ఆలౌట్ చేశారు. పేసర్లు ప్రసిద్ కృష్ణ నాలుగు వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ మూడు వికెట్లు కూల్చాడు. మరో ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లతో రాణించాడు.
మరోసారి విఫలమైన భారత బ్యాటర్లు
ఈ నేపథ్యంలో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేసింది. ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(17), కేఎల్ రాహుల్(10) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 3 పరుగులకే నిష్క్రమించాడు.
ఇక కెప్టెన్ రుతురాజ్(11) మరోసారి దారుణంగా విఫలం కాగా.. దేవ్‌దత్ పడిక్కల్ ఒక్క పరుగే చేయగలిగాడు. ధ్రువ్ జురెల్ మరోసారి పోరాటం చేస్తుండగా.. నితీశ్ రెడ్డి అతడికి తోడుగా నిలిచాడు.
రెండో రోజు ఆట ముగిసే సరికి భారత్-‘ఎ’ 31 ఓవర్లు ఆడి ఐదు వికెట్ల నష్టానికి కేవలం 73 పరుగులు చేసింది. ఆట పూర్తయ్యేసరికి జురెల్ 19, నితీశ్ రెడ్డి 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ మెక్ ఆండ్రూ, బ్యూ వెబ్‌స్టర రెండేసి వికెట్లు తీయగా.. కోరే రొచిసియోలి ఒక వికెట్ పడగొట్టాడు.
చదవండి: అతడికి ఎందుకు ఛాన్స్ ఇవ్వడం లేదు?.. కుండబద్దలు కొట్టిన సూర్య
Comments
Please login to add a commentAdd a comment