ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ (PC: BCCI)
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.
తొలి టెస్టులో ఓటమి
కాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.
అదొక్కటే సానుకూలాంశం
ఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది.
రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్
మెల్‌బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు.
పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.
ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్
ఈ క్రమంలో మిడిలార్డర్‌లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.
నితీశ్ రెడ్డి మరోసారి
మిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
చెలరేగిన నాసెర్
ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు.
చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో
Comments
Please login to add a commentAdd a comment