Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్‌.. ఆసీస్‌ టార్గెట్‌? | Aus A vs Ind A 1st Test Day 3: Sai Sudarshan Century Helps India Set 225 Target | Sakshi
Sakshi News home page

Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్‌.. రాణించిన పడిక్కల్‌.. ఆసీస్‌ టార్గెట్‌?

Published Sat, Nov 2 2024 10:46 AM | Last Updated on Sat, Nov 2 2024 11:34 AM

Aus A vs Ind A 1st Test Day 3: Sai Sudarshan Century Helps India Set 225 Target

శతక ధీరుడు సాయి సుదర్శన్‌ (PC: cricket.com.au)

Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్‌- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్‌కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్‌ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.

సాయి సుదర్శన్‌ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా..  దేవ్‌దత్‌ పడిక్కల్‌ సూపర్‌ హాఫ్‌ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.

ఆసీస్‌ టార్గెట్‌?
ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్‌-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. 

ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్‌ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్‌ తీరుతో జూనియర్‌ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్‌ స్యామ్‌ కొన్‌స్టాస్‌(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్‌ హ్యారిస్‌ 29, కామెరాన్‌ బాన్‌క్రాఫ్ట్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలం
కాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (36; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా, ఆసీస్‌ ‘ఎ’ బౌలర్‌ బ్రెండన్‌ డగెట్‌ 6 వికెట్లు తీశాడు.

అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్‌ కుమార్‌ (6/46), ప్రసిధ్‌ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్‌ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. 

శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (5), అభిమన్యు ఈశ్వరన్‌ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్‌ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. 

తుదిజట్లు
భారత్‌- ఎ
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్‌ కుమార్‌ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్‌ కృష్ణ, ముకేశ్‌ కుమార్.

ఆస్ట్రేలియా-ఎ
స్యామ్‌ కన్‌స్టాస్‌, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌, నాథన్ మెక్స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్‌, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్హామ్.

చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్‌ చేతిలో తప్పని ఓటమి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement