శ్రేయస్ అయ్యర్ శతక్కొట్టాడు. మూడేళ్ల తర్వాత ఈ ముంబై బ్యాటర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తొలి సెంచరీ సాధించాడు. రంజీ ట్రోఫీ 2024-25 ఎడిషన్‌లో భాగంగా మహారాష్ట్రతో మ్యాచ్ సందర్భంగా వంద పరుగుల మార్కును దాటాడు.
టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు ముందు ఈ మేర అద్భుత శతకం బాదిన శ్రేయస్ అయ్యర్.. రేసులో తానూ ఉన్నానంటూ సెలక్టర్లకు సందేశం పంపాడు. డిఫెండింగ్ చాంపియన్ ముంబై రంజీ తాజా ఎడిషన్‌లో తొలుత బరోడాతో తలపడి ఓడిపోయింది.
ఈ క్రమంలో రహానే సేన అక్టోబరు 18న మహారాష్ట్రతో తమ రెండో మ్యాచ్ మొదలుపెట్టింది. సొంతమైదానంలో టాస్ ఓడిన ముంబై తొలుత బౌలింగ్ చేసింది. మహారాష్ట్రను తొలి ఇన్నింగ్స్‌లో 126 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబై బౌలర్లలో మోహిత్ అవస్థి, షామ్స్ ములానీ మూడేసి వికెట్లతో చెలరేగగా.. శార్దూల్ ఠాకూర్, రాయ్‌స్టన్ డైస్ చెరో రెండు వికెట్లు కూల్చారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా కేవలం ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. అయితే, మరో ఓపెనర్ ఆయుశ్ మాత్రే సూపర్ సెంచరీ(232 బంతుల్లో 176) పరుగులు చేయగా.. శ్రేయస్ అయ్యర్ అతడికి సహకారం అందించాడు. మొత్తంగా 190 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 142 పరుగులు సాధించాడు. శ్రేయస్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి.
ఆయుశ్ మాత్రే, శ్రేయస్ అయ్యర్ శతక ఇన్నింగ్స్ కారణంగా ముంబై తమ మొదటి ఇన్నింగ్స్‌లో 441 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక శనివారం నాటి రెండో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 31 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది. ముంబై కంటే 173 పరుగులు వెనుకబడి ఉంది.
ముంబై వర్సెస్ మహారాష్ట్ర తుదిజట్లు
ముంబై
పృథ్వీ షా, ఆయుశ్ మాత్రే, హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, అజింక్య రహానే (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, షామ్స్ ములానీ, శార్దూల్ ఠాకూర్, తనుష్ కోటియన్, మోహిత్ అవస్థి, రాయిస్టన్ డైస్.
మహారాష్ట్ర
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అర్షిన్ కులకర్ణి, అంకిత్ బావ్నే, నిఖిల్ నాయక్ (వికెట్ కీపర్), సచిన్ దాస్, అజీమ్ కాజీ, సత్యజీత్ బచావ్, సిద్ధేష్ వీర్, ఆర్‌ఎస్ హంగర్గేకర్, ప్రదీప్ దధే, హితేష్ వాలుంజ్.
Comments
Please login to add a commentAdd a comment