‘ఏక్తా’ ధాటికి ఇంగ్లండ్‌ ప్యాకప్‌ | Sakshi
Sakshi News home page

టీమిండియా ఘనవిజయం

Published Fri, Feb 22 2019 4:25 PM

India Women won by 66 runs Against England In 1st ODI - Sakshi

ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళల జట్టు జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్‌ షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ తొలి మ్యాచ్‌లో మిథాలీ సేన 66 పరుగుల తేడాతో  ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పర్యాటక జట్టు స్పిన్‌ ఉచ్చులో చిక్కుకుపోయింది. టీమిండియా బౌలర్లు ఏక్తా బిస్త్‌(4/25), దీప్తి శర్మ(2/33), శిఖా పాండే(2/21), గోస్వామి(1/19)ల దెబ్బకు ఇంగ్లండ్‌ జట్టు 41 ఓవర్లలో 136 పరుగులకే కుప్పకూలింది.  ఇంగ్లండ్‌ సారథి హెదర్‌ నైట్‌(39 నాటౌట్‌), ఆల్‌రౌండర్ సీవర్‌(44)లు మాత్రమే రాణించారు. ఏ దశలోనూ పర్యాటక జట్టను కోలుకోనీయకుండా ఆ జట్టు పతనాన్ని శాసించిన ఏక్తాబిస్త్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు లభించింది.

రాణించిన మిథాలీ, రోడ్రిగ్స్‌
అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. స్మృతి మంధాన (24), రోడ్రిగ్స్‌ (48)లు తొలి వికెట్‌కు 69 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడిని ఎల్విస్‌ విడదీసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ(7) వెంటనే వేనుదిరగగా.. రోడ్రిగ్‌తో కలిసి మిథాలీ(44) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేసింది. అనంతరం ఇరువురు ఔటైన తర్వాత మిడిలార్డర్‌ చేతులెత్తేయడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.  గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన హర్మన్‌ ప్రీత్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన హర్లీన్‌ డియోల్‌(2) పూర్తిగా నిరాశపరిచింది. చివర్లో తాన్యా భాటియా(25), గోస్వామి(30)లు రాణించడంతో టీమిండియా 202 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌ చేసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో ఎల్విస్‌, సీవిర్‌, సోఫీ ఎలెక్‌స్టోన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ష్రబ్‌షోల్‌ ఒక్క వికె​ట్‌ దక్కించుకున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement