63 బంతుల్లో 60 పరుగులు చేసి మేఘన
► 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన నార్త్‌జోన్ జట్టు
విజయనగరం మున్సిపాలిటీ : ఇంటర్ జోనల్ ఉమెన్ క్రికెట్ పోటీల్లో సెంట్రల్ జోన్ జట్టు సునాయాస విజయాన్ని నమోదు చేసింది. డెంకాడ మండలంలోని డాక్టర్ పీవీజీ రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో అతిథ్య నార్త్‌జోన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. టాస్ గెలిచిన నార్త్‌జోన్ జట్టు ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. జట్టులో వి.స్నేహదీప్తి (60 బంతుల్లో 39 పరుగులు) మినహా మిగిలిన వారెవరూ ఎక్కువ సమయం మైదానంలో నిలువలేకపోయారు. బౌలింగ్ విభాగంలో సెంట్రల్‌జోన్ క్రీడాకారిణులు సి.హెచ్.ఝాన్సీలక్ష్మి 3 వికెట్లు, కె.ధాత్రి 3 వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 143 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సెంట్రల్‌జోన్ క్రీడాకారులు కేవలం 32.3 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 144 పరుగులు చేసి విజయం సాధించారు. జట్టులో ఎస్.మేఘన 63 బంతుల్లో 60 పరుగులు చేయగా... టి.మల్లిక 79 బంతుల్లో 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సారథ్యంలో నార్త్‌జోన్ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా సోమవారం సౌత్‌జోన్–సెంట్రల్‌జోన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.