
వచ్చే ఏడాది జపాన్‌లో జరుగనున్న 20వ ఆసియా క్రీడల్లో క్రికెట్ చేరికకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్గనైజింగ్ కమిటీతో భేటి అనంతరం ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఈ విషయాన్ని వెల్లడించింది. తదుపరి ఆసియా క్రీడల్లో క్రికెట్‌తో పాటు మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడకు కూడా అప్రూవల్ లభించింది. క్రితం ఆసియా క్రీడల్లో (2022 హాంగ్‌ఝౌ గేమ్స్, చైనా) లాగానే ఈసారి కూడా పురుషులు, మహిళల విభాగాల్లో క్రికెట్ పోటీలు జరుగుతాయి. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. 14 పురుష జట్లు, 9 మహిళల టీమ్స్ పాల్గొంటాయి.
గత ఆసియా క్రీడల్లో టీమిండియా పురుషులు, మహిళల విభాగాల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తొలిసారి 2010లో పరిచయం చేశారు. ఆతర్వాత కేవలం రెండు సార్లు (2014, 2022) మాత్రమే ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు అనుమతి లభించింది. 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడంతో తదుపరి ఆసియా క్రీడల్లో కూడా క్రికెట్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది.
1900 (పారిస్ ఒలింపిక్స్) తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇదే మొదటిసారి. కేవలం రెండు క్రికెట్ జట్లు పాల్గొన్న ఆ ఒలింపిక్స్‌లో ఫ్రాన్స్‌పై గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో విజయం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకుంది.
2026 ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. పురుషులు, మహిళల విభాగాల్లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. గత ఆసియా క్రీడల్లో రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని భారత పురుషుల టీమ్ అత్యధిక సీడింగ్ (పాయింట్లు) ఆధారంగా గోల్డ్ మెడల్ గెల్చుకోగా.. హర్మన్ నేతృత్వంలోని భారత మహిళల టీమ్ ఫైనల్లో శ్రీలంకపై 19 పరుగుల తేడాతో విజయం సాధించి పసిడి పతకం కైవసం చేసుకుంది.