బేస్ బాల్ నుంచి క్రికెట్ వైపు!
బేస్ బాల్ నుంచి క్రికెట్ వైపు!
Published Tue, Aug 2 2016 4:47 PM | Last Updated on Mon, Sep 4 2017 7:30 AM
టోక్యో: బేస్ బాల్ గేమ్ అంటేనే మనకు గుర్తొచ్చే దేశం జపాన్. ఈ దేశాన్ని బేస్ బాల్ కింగ్ అని కూడా పిలుస్తారు. అయితే ఆ దేశం బేస్ బాల్ నుంచి క్రికెట్ వైపు అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా క్రికెట్కు విశేషమైన ఆదరణ పెరగడం జపాన్ ను సైతం ఆకర్షించింది. ఆ క్రీడలో దూసుకుపోవాలని జపాన్ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే వరల్డ్ కప్ నాటికి క్వాలిఫయింగ్ రౌండ్లోకి ప్రవేశించడానికి యత్నాలు చేస్తున్నట్లు ఆ దేశ క్రికెట్ కెప్టెన్ మాసోమీ కొబాయాషి తెలిపాడు. ఇప్పటికే జపాన్లో 200 జట్లు ఉండగా, దాదాపు 3,000 మంది క్రికెట్ ను ఆడేందుకు సిద్ధమయ్యారన్నాడు. ఇటీవల కాలంలో తమ దేశంలో క్రికెట్ కు బాగా ఆదరణ పెరిగిందన్నాడు.
గత నవంబర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సానో క్రికెట్ స్టేడియం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ త్వరలో చైనా, సౌత్ కొరియా, హాంకాంగ్ జట్లతో ఈస్ట్ ఆసియా కప్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. జపాన్ క్రికెట్ అసోసియేషన్కు అలెక్స్ మియాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తున్నారు.
Advertisement