
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.
ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది.
ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే
‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్‌మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్‌మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది.
బీసీసీఐ సైతం..
కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది.
ఐసీసీ హర్షం
ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది.
చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment