Equal Pay
-
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై
West Indies Commit To...: వెస్టిండీస్ క్రికెట్ బోర్డు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లింగ వివక్షకు తావు లేకుండా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా ఫీజులు చెల్లించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు క్రికెట్ వెస్టిండీస్(సీడబ్ల్యూఐ), వెస్టిండీస్ ప్లేయర్స్ అసోసియేషన్(డబ్ల్యూఐపీఏ) మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఎంఓయూ అక్టోబరు 1, 2023 నుంచి సెప్టెంబరు 30, 2027 వరకు అమల్లో ఉంటుందని విండీస్ బోర్డు తెలిపింది. ఎంఓయూ ముఖ్య ఉద్దేశం అదే ‘‘అంతర్జాతీయ, ప్రాంతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్ ఫీజులలో వ్యత్యాసం లేకుండా చూడటమే ఈ ఎంఓయూ ముఖ్య ఉద్దేశం. అంతర్జాతీయ జట్టు కెప్టెన్ల అలవెన్సులు, అంతర్జాతీయ జట్టు ప్రైజ్‌మనీ, ప్రాంతీయ స్థాయిలో వ్యక్తిగతంగా చెల్లించే ప్రైజ్‌మనీ అందరు వెస్టిండీస్ క్రికెటర్లకు సమాన స్థాయిలో అక్టోబరు 1, 2027 నాటికి అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో తెలిపింది. బీసీసీఐ సైతం.. కాగా ఇప్పటికే న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర దేశాల క్రికెట్ బోర్డులు లింగ వివక్షకు తావులేకుండా మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. తాజాగా వెస్టిండీస్ కూడా అదే బాటలో నడవడానికి సమాయత్తమైంది. ఐసీసీ హర్షం ఈ విషయంపై స్పందించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది తాము ఐసీసీ టోర్నమెంట్లలో పురుష, మహిళా జట్లకు సమాన స్థాయిలో ప్రైజ్ మనీ అందజేస్తామని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. చదవండి: AUS Vs WI 2nd Test: వారెవ్వా.. క్రికెట్ చరిత్రలోనే అద్బుతమైన క్యాచ్! వీడియో వైరల్ -
జీతం పెరిగింది.. ఎవరికి ఎంత?
స్త్రీ పురుష ఉద్యోగుల జీతాలు, వేతనాల్లో అసమానతలను తొలగించాలని ఇ.యు. తన పరిధిలోని దేశాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఫలిస్తే.. తక్కిన దేశాలూ ఆచరిస్తే.. స్త్రీ పురుషులు ఇక ఈక్వల్ ఈక్వల్. సమాన పనికి సమాన వేతనం. లిస్ట్ ఇవ్వండి జెండర్ ‘పే గ్యాప్’ను తొలగించే చర్యలలో భాగంగా.. 27 సభ్య దేశాల్లోని కంపెనీలు తమ సిబ్బందిలో ఎవరికి ఎంత జీతం ఇస్తున్నాయో తక్షణం బహిర్గత పరచాలని ‘ఐరోపా సమాఖ్య’ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వాన్ డెర్లెయన్ అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. సంస్థలు తమ సిబ్బందికి గోప్యంగా, విడివిడిగా జీతాలు పెంచుకుంటూపోతున్న కారణంగానే సమానమైన పనికి కూడా స్త్రీలకు తక్కువ ప్రతిఫలం లభిస్తోందని ఆమె గుర్తించడం.. ఈ ఏడాది ‘ఉమెన్స్ డే’ కి తమకు లభించిన బోనస్ అని ఆ దేశాలలోని మహిళా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పని. ఒకే విధమైన పని గంటలు. కానీ వేతనం ఒకటే కాదు. పురుషులకు ఎక్కువ, స్త్రీలకు తక్కువ! ప్రపంచమంతటా ఇంతే. ఏళ్లుగా ఇంతే. సమాజంలో స్త్రీ పురుష సమానత్వం రావడానికి ఎన్ని శతాబ్దాలు పడుతుందో చెప్పలేం. స్త్రీ పురుషుల వేతనాల్లో హెచ్చు తగ్గుల్ని లేకుండా చేయడానికైతే శతాబ్దాలు అక్కర్లేదు. దశాబ్దాలూ అక్కర్లేదు. కొంత టైమ్ ఇచ్చి, ఆ టైమ్ లోపు ‘ఈక్వల్ పే’ ఉండాలని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేస్తే చాలు.. వేతనాల్లో, జీతాల్లో అసమానత్వాలు, అంతరాలు సమసిపోతాయి. మరి ప్రభుత్వాలు చెయ్యకనేనా నేటికీ మహిళా ఉద్యోగులు, మహిళా శ్రామికులు పురుషులకన్నా తక్కువ ప్రతిఫలాన్ని పొందుతున్నారు! శ్రమదోపిడికి గురవుతున్నారు! కాదు. కంపెనీలే స్త్రీ పురుష వివక్ష ను పాటిస్తున్నాయి. ‘మీరు చెప్పినట్లే ఈక్వల్ ఈక్వల్‌గా ఇస్తున్నాం’ అని పైపై లెక్కలు చూపిస్తున్నాయి. ఒక స్త్రీ, ఒక పురుషుడు ఒకే విధమైన పనిని, ఒకే పనిగంటల్లో చేస్తే వారిద్దరికీ ఒకే విధమైన జీతభత్యాలు ఇస్తున్నామని చెబుతున్నాయి. చెప్పడం వరకే. చేస్తున్నది వేరే. పురుషులకు ఎక్కువ. స్త్రీలకు తక్కువ! అలా ఎలా చేయగలుగుతున్నాయంటే.. గోప్యత. రహస్యం! నిజంగా ఎంతిస్తున్నదీ కంపెనీలు బయటపెట్టడం లేదు. ఇక ఇలాక్కాదని చెప్పి, ప్రతి ఉద్యోగికీ మీరెంత జీతం ఇస్తున్నదీ పేర్లతో సహా బహిర్గతం చేయండి అని ఐరోపా దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలన్నిటికీ ‘యూరోపియన్ యూనియన్’ (ఇ.యు) కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్లెయన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి కాస్త ముందు ఆమె ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం యాదృచ్ఛికమే అవొచ్చు కానీ ఇ.యు. పరిధిలోని 27 దేశాల మహిళా ఉద్యోగులు దీనినొక ఉమెన్స్ డే బోనస్‌గా భావిస్తున్నారు. ∙∙∙ నిజమే. వేతనాల్లో వివక్షతో కూడిన వ్యత్యాసం తగ్గాలంటే.. అసలు ఎవరికి ఎంత వేతనం ఇస్తున్నదీ ముందు తెలియాలి. అందుకే ఆ లిస్ట్‌ను బహిర్గతం చెయ్యమని వాన్ డెర్లియన్ ఆదేశించారు. ఇ.యు. దేశాలు స్త్రీల పట్ల సహానుభూతితో ఉంటాయనే పేరుంది. అయితే అక్కడ కూడా వేతనాలలో మిగతా దేశాలలో ఉన్నట్లే మహిళలపై వివక్ష ఉంది! ఇ.యు. 1957లో ఏర్పడింది. అప్పట్నుంచీ ‘పే గ్యాప్’ ను తొలగించడానికి ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. కావడం లేదు. జీతాలు, వేతనాలు, పని వేళలు, పెన్షన్లు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నిటా సంస్థల యాజమాన్యాలు ఈ గ్యాప్‌ను పాటిస్తూనే ఉన్నాయి. గత 30–40 ఏళ్లలో ఇ.యు. ఎంతగానో పాటు పాడితే తగ్గిన వేతన అంతరం 30 శాతం మాత్రమే. ఇది నూరు శాతం అవడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడతాయో! అయితే వాన్ డెర్లెయన్ అంతవరకు ఆగదలచుకోలేదు. ఏడాది క్రితం కమిషన్ అధ్యక్షురాలిగా వచ్చిన నాటి నుంచీ ఐరోపా వ్యాప్తంగా మహిళా ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సరిచేసేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. ఆ క్రమంలో బుధవారం జారీ చేసినవే.. ప్రతి కంపెనీ తమ పే లిస్ట్‌ను బయటపెట్టి తీరాలన్న ఆదేశాలు. అప్పుడు ఎవరికి ఎంతిస్తున్నదీ తెలుస్తుంది. స్త్రీలకు ఎంత వస్తున్నదీ బయటపడుతుంది. ఆ ప్రకారం కంపెనీలపై చట్టపరంగా చర్యలు తీసుకోడానికి వీలుంటుంది. చర్యల భయం ఉంటే కంపెనీలూ వాటికై అవి వేతన అంతరాలను తొలగించేందుకు ముందుకు వస్తాయి. ∙∙∙ ఆదేశాలతోపాటు కొన్ని ప్రతిపాదనలకు ఆదేశ రూపం ఇచ్చేందుకు కూడా కమిషన్ సభ్యులను సోమవారం సమావేశ పరచబోతున్నారు వాన్ డెర్లెయన్! కంపెనీలు ఇకపై ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానించే ముందు కానీ, అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసేటప్పుడు గానీ వారి పూర్వపు వేతనాన్ని (మునుపటి కంపెనీలో వాళ్లకు వస్తున్న వేతనం) అడగకూడదు. ఫలాన పోస్టుకు ఇంత జీతం అని ప్రకటించాక ఆ తర్వాత పురుషుడు అని పెంచడం గానీ, స్త్రీ అని తగ్గించడం కానీ చేయకూడదు. ఉద్యోగానికే జీతం తప్ప ఉద్యోగం చేస్తున్న వ్యక్తి జీతం కాదు అన్నట్లు ఉండాలి. మహిళలైతే తాము చేరబోయే సంస్థలో స్త్రీ పురుషుల జీతాలలో వ్యత్యాసం ఏ మేరకైనా ఉందా అని ముందే ఆ సంస్థ యాజమాన్యాన్ని అడిగే హక్కు కలిగి ఉండాలి. కనీసం 250 మంది ఉద్యోగులు ఉన్న ప్రతి కంపెనీ తమ జీతాల్లోన్ని జెండర్ వ్యత్యాసం గురించి విధిగా తమ మహిళా అభ్యర్థులకు తెలియపరచాలి. ఇప్పటికే పని చేస్తున్న మహిళా ఉద్యోగులు తాము ఎంతకాలంగా తక్కువ జీతాన్ని పొందుతున్నారో, ఆ తగ్గిన మొత్తాన్ని అడగవచ్చు. ఆ కారణంగా వారిని ఉద్యోగం నుంచి యాజమాన్యాలు తొలగించకూడదు. ఇవీ.. ఆ ప్రతిపాదనలు. కంపెనీలతోపాటు, కోవిడ్ కూడా మహిళల శ్రమకు తగిన ప్రతిఫలం, గుర్తింపు, ఆఖరికి ఉపాధిని కూడా లేకుండా చేసింది. ఆ పరిహారాన్ని కూడా కంపెనీలు తమ మహిళా ఉద్యోగులకు చెల్లించేలా చర్యలు తీసుకునేందుకు వాన్ డెర్లెయన్ మరొక ఆదేశ పత్రం ముసాయిదాను రూపొందించే పనిలో ఉన్నారు. చదవండి: చిన్న వయసులోనే పెద్ద కష్టం.. నిమ్మరసం అమ్ముతూ.. -
ద్రవిడ్ మాట మన్నించారు
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం, విజయవంతమైన జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ద్రవిడ్‌తో పాటు బృంద సభ్యులందరికీ రూ. 25 లక్షల చొప్పున నజరానా అందిస్తామని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ (బెంగళూరు)లో జట్టు సన్నాహాల్లో పాల్గొన్న సహాయ సిబ్బందికి కూడా నజరానా అందనుంది. మొదటి నజరానా జాబితాలో ఉన్న పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), అభయ్ శర్మ (ఫీల్డింగ్ కోచ్), యోగేశ్ పార్మర్ (ఫిజియోథెరపిస్ట్), ఆనంద్ దతే (ట్రెయినర్), మంగేశ్ గైక్వాడ్ (మసాజ్), దేవ్‌రాజ్ రౌత్ (వీడియో అనలిస్ట్)లతో పాటు స్వదేశంలోని సన్నాహాల్లో పాలుపంచుకున్న మరో ఐదుగురు డబ్ల్యూవీ రామన్ (కోచ్), మనుజ్ శర్మ, సుమిత్ మలహపుర్కర్ (లాజిస్టిక్స్ మేనేజర్స్), అమోఘ్ పండిట్ (ట్రెయినర్), రాజేశ్ సావంత్ (దివంగత ట్రెయినర్)లకు బోర్డు బెనిఫిట్స్ దక్కనున్నాయి. ద్రవిడ్‌కు సగం నజరానా (రూ.25 లక్షలు) తగ్గినా అతను కోరుకున్న సమానత్వం మాత్రం దక్కింది. ఔరా... ద్రవిడ్ ఔదార్యం పృథ్వీ షా నేతృత్వంలోని కుర్రాళ్ల జట్టు ఒక్క మ్యాచ్ (ఫైనల్)తో అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ ఒక్క విజయం కోసం ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందం ఓ ఏడాదికిపైగా విశేష కృషి చేసింది. ఈ బృంద సభ్యుల్లో కొందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందిస్తే, ఇంకొందరు న్యూజిలాండ్ (ఆతిథ్య దేశం)కు జట్టుతో పాటు వెళ్లి చెమటోడ్చారు. అయితే బీసీసీఐ మొదట కివీస్ వెళ్లిన కోచింగ్ బృందానికే నజరానా ప్రకటించగా... టీమ్ ట్రెయినర్ రాజేశ్ సావంత్ గతేడాది మరణించారు. రాజేశ్ కూడా యువ జట్టును తీర్చిదిద్దిన రాహుల్ అండ్ కో సభ్యుడు. దీంతో అతనికి ప్రోత్సాహకం అందాలని ద్రవిడ్ గట్టిగా కృషిచేశాడు. ఇప్పుడు బోర్డు అతని కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడింది. అందినకాడికి వచ్చిన దాంతో తన ఇంటిని మాత్రమే చక్కబెట్టుకునే వాళ్లున్న ఈ రోజుల్లో అందరికి పేరు, ప్రోత్సాహం రావాలన్న ద్రవిడ్ నిజంగా గ్రేట్... గ్రేటెస్ట్ కదా! -
సుప్రీం సంచలన తీర్పు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. సమాన పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకుకూడా సమాన వేతనం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. రోజూ వారీ విధుల్లో భాగంగా ఒకే సేవలు అందించే ఉద్యోగులకు కూడా సమాన పని సమాన వేతనం సూత్రాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలా చెల్లించకపోవడం "బానిసలుగా దోచుకోవడం, అణచివేతకు, అక్రమం కిందకివస్తుందని వ్యాఖ్యానించింది. పంజాబ్ కు చెందిన టెంపరరీ ఉద్యోగుల దాఖలుచేసుకున్న పిటిషన్ సుప్రీం ఇలా స్పందించింది. పంజాబ్ హైకోర్టు వారికి సమానవేతనాలు చెల్లించడానికి నిరాకరించడంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వేతనాలు చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఒక పనిచేసే ఉద్యోగుల్లో ఒకరికి తక్కువ వేతనం చెల్లించడం సరికాదని ఇది మానవగౌరవాన్ని కించపరచడం కిందికి వస్తుందని జస్టిస్ ఖేహర్ , జస్టిస్ ఎస్ఏ బాబ్డేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది 1966లో భారతదేశం సంతకం చేసిన అంతర్జాతీయ లిఖిత సమ్మతి సామాజిక మరియు సాంస్కృతిక హక్కుల పత్రంలోని ఆర్టికల్ 7 ప్రకారం దీన్ని వర్తింపచేయాలన్నారు. ఏప్రిల్ 10, 1979లో ఆమోదించిన ఈ ఒప్పందానికి ఉఉదహరిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈవ్యాఖ్యలు చేసింది. ఈ బాధ్యత నుంచి తప్పించుకోవడానికి లేదని పేర్కంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 141 కింద 'సమాన పనికి సమాన వేతనం' అనే సిద్ధాంతాన్ని తాత్కాలికమా, రెగ్యులరా అనే భేదం లేకుండా ప్రతీవారికి అమలు చేయాలని తీర్పు చెప్పింది.