రాహుల్ ద్రవిడ్
ముంబై: భారత బ్యాటింగ్ దిగ్గజం, విజయవంతమైన జూనియర్ జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మన్నించింది. అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచేందుకు తోడ్పడిన శిక్షణ సిబ్బందికి సమాన ప్రోత్సాహాకాన్ని ఇవ్వనున్నట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ద్రవిడ్‌తో పాటు బృంద సభ్యులందరికీ రూ. 25 లక్షల చొప్పున నజరానా అందిస్తామని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది.
కప్ గెలవగానే బోర్డు... ఆటగాళ్లకు రూ 30 లక్షలు, హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయ సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున ప్రోత్సాహకాల్ని ప్రకటించింది. దీనిపై ద్రవిడ్ అసంతృప్తి వెలిబుచ్చాడు. జట్టు కోసం తన సిబ్బంది అంతా సమష్టిగా శ్రమించారని, ఈ ఫలితంలో పేరొచ్చినా... ప్రోత్సాహకం వచ్చినా సమానంగా దక్కాల్సిందేనని డిమాండ్ చేశాడు. దిగ్గజ ఆటగాడి మాటకు విలువిచ్చిన బీసీసీఐ... ఏడాదికి పైగా యువ జట్టుకు సేవలందించిన కోచింగ్ సిబ్బందికి సమాన నజరానాలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది.
దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ (బెంగళూరు)లో జట్టు సన్నాహాల్లో పాల్గొన్న సహాయ సిబ్బందికి కూడా నజరానా అందనుంది. మొదటి నజరానా జాబితాలో ఉన్న పారస్ మాంబ్రే (బౌలింగ్ కోచ్), అభయ్ శర్మ (ఫీల్డింగ్ కోచ్), యోగేశ్ పార్మర్ (ఫిజియోథెరపిస్ట్), ఆనంద్ దతే (ట్రెయినర్), మంగేశ్ గైక్వాడ్ (మసాజ్), దేవ్‌రాజ్ రౌత్ (వీడియో అనలిస్ట్)లతో పాటు స్వదేశంలోని సన్నాహాల్లో పాలుపంచుకున్న మరో ఐదుగురు డబ్ల్యూవీ రామన్ (కోచ్), మనుజ్ శర్మ, సుమిత్ మలహపుర్కర్ (లాజిస్టిక్స్ మేనేజర్స్), అమోఘ్ పండిట్ (ట్రెయినర్), రాజేశ్ సావంత్ (దివంగత ట్రెయినర్)లకు బోర్డు బెనిఫిట్స్ దక్కనున్నాయి. ద్రవిడ్‌కు సగం నజరానా (రూ.25 లక్షలు) తగ్గినా అతను కోరుకున్న సమానత్వం మాత్రం దక్కింది.
ఔరా... ద్రవిడ్ ఔదార్యం
పృథ్వీ షా నేతృత్వంలోని కుర్రాళ్ల జట్టు ఒక్క మ్యాచ్ (ఫైనల్)తో అండర్–19 ప్రపంచకప్ గెలిచింది. కానీ ఆ ఒక్క విజయం కోసం ద్రవిడ్ సారథ్యంలోని కోచింగ్ బృందం ఓ ఏడాదికిపైగా విశేష కృషి చేసింది. ఈ బృంద సభ్యుల్లో కొందరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సేవలందిస్తే, ఇంకొందరు న్యూజిలాండ్ (ఆతిథ్య దేశం)కు జట్టుతో పాటు వెళ్లి చెమటోడ్చారు.
అయితే బీసీసీఐ మొదట కివీస్ వెళ్లిన కోచింగ్ బృందానికే నజరానా ప్రకటించగా... టీమ్ ట్రెయినర్ రాజేశ్ సావంత్ గతేడాది మరణించారు. రాజేశ్ కూడా యువ జట్టును తీర్చిదిద్దిన రాహుల్ అండ్ కో సభ్యుడు. దీంతో అతనికి ప్రోత్సాహకం అందాలని ద్రవిడ్ గట్టిగా కృషిచేశాడు. ఇప్పుడు బోర్డు అతని కుటుంబానికి రూ. 25 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడింది. అందినకాడికి వచ్చిన దాంతో తన ఇంటిని మాత్రమే చక్కబెట్టుకునే వాళ్లున్న ఈ రోజుల్లో అందరికి పేరు, ప్రోత్సాహం రావాలన్న ద్రవిడ్ నిజంగా గ్రేట్... గ్రేటెస్ట్ కదా!
Comments
Please login to add a commentAdd a comment