గంభీర్ (PC: BCCI/KKR)
టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టనున్నాడు. భారత జట్టు హెడ్ కోచ్‌గా సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. కాగా రెండుసార్లు ప్రపంచకప్(2007, 2011) గెలిచిన భారత జట్టులో భాగమైన గౌతీ రాజకీయాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్నాడు.
రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని
బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన ఈ ఢిల్లీ బ్యాటర్.. కామెంటేటర్‌గానూ కొనసాగాడు. అయితే, రెండు పడవల మీద ప్రయాణం చేయలేనని చెబుతూ రాజకీయాలకు స్వస్తి పలికిన గంభీర్.. పూర్తి స్థాయిలో క్రికెట్‌కే అంకితమయ్యాడు.
ఐపీఎల్ జట్లు లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వ్యవహరించి జట్లను విజయాల బాట పట్టించాడు. లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరడంలో గౌతీ కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది కేకేఆర్ చాంపియన్‌గా నిలవడంలోనూ ఈ మాజీ కెప్టెన్ సేవలు మరువలేనివి.
ఈ క్రమంలోనే గౌతం గంభీర్ భారత పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ నేపథ్యంలో గౌతీ జీతం ఎంత ఉంటుందన్న అంశం క్రికెట్ ప్రేమికుల్లో చర్చకు దారితీసింది.
టీ20 ప్రపంచకప్-2024 అందించి
కాగా 2021 నుంచి ఇప్పటి దాకా రాహుల్ ద్రవిడ్ టీమిండియా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. వెళ్తూ వెళ్తూ భారత్‌కు టీ20 ప్రపంచకప్-2024 అందించిన కోచ్‌గా ద్రవిడ్ పేరు సంపాదించాడు.
ఇక హెడ్ కోచ్‌గా అతడికి బీసీసీఐ ఏడాదికి రూ. 12 కోట్ల మేర వేతనం ఇచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే గంభీర్ మాత్రం ఇంతకు రెట్టింపు జీతం పొందనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు?
కాగా కేకేఆర్ మెంటార్‌గా గంభీర్‌కు రూ. 25 కోట్లు ఆ జట్టు యాజమాన్యం పారితోషికంగా అందించిందని అప్పట్లో వదంతులు పుట్టుకొచ్చాయి.
ఈ నేపథ్యంలో.. హెడ్ కోచ్‌గా వచ్చినందున ఆ పదవికి రాజీనామా చేయాలి కాబట్టి.. బోర్డు ఈ మొత్తం తనకు జీతంగా చెల్లించాలని గౌతీ కండిషన్ పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
జీతంతో పాటు అన్ని సదుపాయాలు
వార్తా సంస్థ IANS వివరాల ప్రకారం.. 2019 వరకు ప్రధాన కోచ్‌కు రోజూవారీ వేతనం కింద రూ. 21 వేలు(విదేశీ పర్యటనలో రూ. 42 వేలు), బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, హోటళ్లలో బస, అందుకు సంబంధించిన ప్రతీ ఖర్చు బీసీసీఐ చెల్లించేదని తెలుస్తోంది.
అయితే, హెడ్ కోచ్ వేతనం విషయంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే వార్తలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గంభీర్ నియామకానికి సంబంధించిన ప్రకటన కూడా ఆలస్యం జరిగిందని నెట్టింట ప్రచారం సాగింది.
ఎట్టకేలకు గంభీర్ ఆశించిన మొత్తానికి బీసీసీఐ సరేనన్న తర్వాతే అతడు పదవి చేపట్టేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. అయితే, ఇంత వరకు టీమిండియా హెడ్ కోచ్ జీతం గురించి ఎక్కడా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.
అదే నా లక్ష్యం: గంభీర్
‘‘నా చిరునామా భారతదేశం. దేశానికి సేవ చేయగలడం నా జీవితంలో కలిగిన అతి పెద్ద అదృష్టం. ఇప్పుడు మరో రూపంలో పునరాగమనం చేయడం గౌరవంగా భావిస్తున్నా. ఎప్పటిలాగే ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయడమే నా లక్ష్యం.
140 కోట్ల భారతీయుల ఆకాంక్షలను టీమిండియా మోస్తుంది. వారి కలలు నిజంచేసేందుకు నా స్థాయిలో ఏదైనా చేసేందుకు నేను సిద్ధం’’ అని భారత జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. కాగా గంభీర్ మూడున్నరేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నాడు.
చదవండి: దటీజ్ ద్రవిడ్.. రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లతో పాటే నేనూ!
Comments
Please login to add a commentAdd a comment