ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్‌మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.
సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.
అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్‌లో రోహిత్ సేన వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.
దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.
అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.
సహాయక కోచ్‌ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.
‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్‌గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్‌ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.
దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..
రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.
ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.
ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్‌తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.
చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
Comments
Please login to add a commentAdd a comment