Vikram Rathore
-
రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం.. బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్
ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను రాయల్స్ యాజమాన్యం నియమించింది. వచ్చే ఏడాది సీజన్లో రాహుల్ ద్రవిడ్‌తో కలిసి విక్రమ్ పనిచేయనున్నాడు. ఇటీవలే రాజస్తాన్ తమ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ను నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాథోర్‌ను కూడా తమ ఫ్రాంచైజీలో భాగం చేసింది. కాగా ద్రవిడ్-రాథోర్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ టీ20 వరల్డ్‌కప్-2024 గెలిచిన భారత జట్టు కోచింగ్ స్టాప్‌లో భాగంగా ఉన్నారు. టీమిండియా హెడ్‌కోచ్‌గా ద్రవిడ్ సేవలు అందించగా.. అతడి ఆధ్వర్యంలో బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేశాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ ఐపీఎల్లో అదే కాంబినేషన్‌ను రిపీట్ చేయనున్నారు. రాయల్స్ స్పోర్ట్స్ గ్రూప్ యాజమాన్యంకు చెందిన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమించిందని రాజస్థాన్ రాయల్స్ ఓ ప్రకటలో పేర్కొంది.ద్రవిడ్ కూడా రాథోర్ నియామకాన్ని స్వాగతించాడు. విక్రమ్‌కు అద్బుతమైన బ్యాటింగ్ టెక్నిక్ స్కిల్స్ ఉన్నాయని, అతడి అనుభవం రాయల్స్‌ను విజయం పథంలో నడిపించగలడు అని ద్రవిడ్ పేర్కొన్నాడు.చదవండి: మహిళా క్రికెటర్‌తో ‘బంధం’.. శ్రీలంక మాజీ ప్లేయర్‌కు భారీ షాక్! -
న్యూజిలాండ్ కోచ్‌గా భారత మాజీ ఓపెనర్.. ఎవరంటే?
ఆఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 నుంచి గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే నోయిడాకు చేరుకుని తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేశాయి.అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ టెస్టుతో పాటు భారత్‌తో టెస్టు సిరీస్‌లకు తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. అదేవిధంగా అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. హెరత్, విక్రమ్ తమ టెస్ట్ గ్రూప్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని స్టెడ్ తెలిపాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 గెలుచుకున్న భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేసిన సంగతి తెలిసిందే. భారత్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో రాథోర్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ పునరుద్దరించలేదు. మరోవైపు హెరత్ గతంలో చాలా జట్లకు బౌలింగ్ కన్సెల్టెంట్‌గా పనిచేశాడు. -
రూ. 5 కోట్లు వద్దు!.. వాళ్లూ, నేనూ సమానమే!
ఆటలోనే కాదు.. వ్యక్తిత్వంలోనూ ‘జెంటిల్‌మేన్’నే అని మరోసారి నిరూపించుకున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన క్యాష్ రివార్డులో తనకు దక్కాల్సిన మొత్తాన్ని సగానికి తగ్గించుకుని గొప్పతనాన్ని చాటుకున్నాడు.సహాయక సిబ్బందితో పాటే తానూ అంటూ హుందాగా వ్యవహరించాడు. కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ భారత పురుషుల జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడైన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ‘వాల్’ మార్గదర్శనంలో టీమిండియా టీ20 వరల్డ్‌కప్-2022లో సెమీస్, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2021-23లో ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023లో ఫైనల్ చేరింది. కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది.అయితే, తాజా పొట్టి ప్రపంచకప్ ఎడిషన్ ద్వారా ద్రవిడ్ కల నెరవేరింది. అతడి గైడెన్స్‌లో రోహిత్ సేన వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ టైటిల్ చేరింది.దాదాపు పదకొండేళ్ల తర్వాత టీమిండియా ఇలా మేజర్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడంతో బీసీసీఐ ఏకంగా రూ. 125 కోట్ల నజరానా ప్రకటించింది. ఇందులో.. కప్ గెలిచిన ప్రధాన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లతో పాటు హెడ్ కోచ్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్ల మేర కానుకగా ఇవ్వాలని భావించింది.అదే విధంగా... బ్యాటింగ్ కోచ్ విక్రం రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు ఒక్కొక్కరికి రూ. 2.5 కోట్ల మేర ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ద్రవిడ్ మాత్రం తనకు దక్కిన మొత్తాన్ని సగానికి తగ్గించమని బోర్డును కోరినట్లు తెలుస్తోంది.సహాయక కోచ్‌ల మాదిరే తనకు కూడా రెండున్నర కోట్ల రూపాయలు చాలంటూ.. మిగిలిన సగాన్ని తిరిగి తీసుకోమని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి.‘‘మిగతా సహాయక సిబ్బంది మాదిరే రాహుల్ కూడా తనకు బోనస్‌గా కేవలం రెండున్నర కోట్లు చాలని చెప్పాడు. మేము అతడి సెంటిమెంట్‌ను గౌరవిస్తాం’’ అని పేర్కొన్నాయి.దటీజ్ ద్రవిడ్.. అప్పుడు కూడా ఇలాగే..రాహుల్ ద్రవిడ్ గతంలో అండర్-19 జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. 2018లో అతడి మార్గదర్శనంలో యువ భారత్ ప్రపంచకప్ గెలిచింది.ఈ నేపథ్యంలో నాడు బీసీసీఐ ద్రవిడ్‌కు రూ. 50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 20 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు రూ. 30 లక్షలు ఇచ్చింది.ఈ క్రమంలో ద్రవిడ్ తనకు ఎక్కువ మొత్తం వద్దని.. కోచింగ్ స్టాఫ్ అందరికీ సమానంగా రివార్డును పంచాలని కోరాడు. ఫలితంగా బోర్డు ద్రవిడ్‌తో పాటు మిగతా సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున అందజేశారు.చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే! -
గిల్‌పై క్రమశిక్షణ చర్యలు.. క్లారిటీ ఇచ్చిన భారత బ్యాటింగ్ కోచ్
టీ20 వరల్డ్‌కప్-2024లో లీగ్ స్టేజిని టీమిండియా ఘనంగా ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం కెనడా-భారత్ మధ్య జరగాల్సిన గ్రూపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. దీంతో గ్రూపు-ఎ నుంచి టీమిండియా 7 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. అయితే కెనడాతో మ్యాచ్ కంటే ముందే భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూపు స్టేజిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయభేరి మ్రోగించింది. ఇక సూపర్-8లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్‌లో బార్బోడస్ వేదికగా అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ వరల్డ్‌కప్ సంబంధించిన మొత్తం నాకౌట్ మ్యాచ్‌లన్నీ కరేబియన్ దీవుల వేదికగానే జరగనున్నాయి. ఈ క్రమంలో విండీస్ దీవులకు వెళ్లేముందు టీ20 వరల్డ్‌కప్ కోసం ట్రావెలింగ్ రిజర్వ్‌గా వెళ్లిన శుభ్‌మన్ గిల్, అవేశ్‌ఖాన్‌లను తిరిగి స్వదేశానికి పంపాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకుంది. అయితే టోర్నీ పూర్తికాకముందే టీమిండియా మెనెజ్‌మెంట్ ఎందుకు వారిద్దరి వెనక్కి పంపాలని నిర్ణయం తీసుకుందో ఆర్ధం కాక ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ముఖ్యంగా శుబ్‌మన్ గిల్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకొన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాకుండా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గిల్ సోషల్ మీడియాలో ఆన్ ఫాలో కూడా చేశాడని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. గిల్ గురుంచి వినిపిస్తున్న వార్తలన్నీ అవాస్తమని విక్రమ్ రాథోడ్ కొట్టిపారేశాడు. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే గిల్, అవేష్‌ను స్వదేశానికి పంపినట్లు రాథోడ్ తెలిపాడు."ఇది మా ముందుస్తు ప్రణాళికే. అమెరికాలో గ్రూపు స్టేజి మ్యాచ్‌లు ఆడే సమయంలో నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ఆటగాళ్లు ఉండాలనుకొన్నాం. అమెరికా మైదానాలపై ఆడే సమయంలో ఆటగాళ్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధంగా ఉంచాం. ఆ తర్వాత కరేబియన్ లెగ్‌కు వెళ్లేముందు ఇద్దరు రిజర్వు ఆటగాళ్లను మాత్రమే ఉంచాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు అర్హత సాధించింది. ఈ క్రమంలోనే గిల్, అవేష్‌ను రిలీజ్ చేశాము"అని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాథోడ్ పేర్కొన్నాడు. -
ఏమో నాకైతే తెలియదు.. అతడికి మరో ఛాన్స్: భారత బ్యాటింగ్ కోచ్
రాంఛీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టుకు సర్వం సిద్దమైంది. శుక్రవారం ఉదయం 9:30 గంటల నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 3-1తో సొంతం చేసుకోవాలని భారత్ ప్రణాళికలను రచిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ సైతం ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం కారణంగా దూరమయ్యాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో గాయపడిన రాహుల్.. వైజాగ్, రాజ్‌కోట్ టెస్టులకు దూరమయ్యాడు. కానీ రాంఛీ టెస్టుకు ముందు అతడు పూర్తి ఫిట్నెస్ సాధించాడని, తిరిగి జట్టుతో చేరుతాడని వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ మాత్రం రాహుల్ ఇంకా ఫిట్నెస్ సాధించలేదని, నాలుగో టెస్టుకు కూడా దూరమయ్యాడనిఓ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇదే విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "కెఎల్ రాహుల్ ఎంత శాతం ఫిట్నెస్ సాధించాడో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంతవరకు మ్యాచ్ ఆడే ఫిట్నెస్ అయితే అతడు సాధించలేదు అనుకుంటున్నాను. అతడి పరిస్థితిని బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తున్నదని రాథోర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నాడు. ఇక రాహుల్ గైర్హాజరు నేపథ్యంలో మిడిలార్డర్ బ్యాటర్ రజిత్ పాటిదార్‌ను తుది జట్టులో కొనసాగించే ఛాన్స్ ఉంది. ఇదే విషయంపై విక్రమ్ రాథోర్ మాట్లాడుతూ.. "పాటిదార్ అద్బుతమైన ఆటగాడు. అతడి బ్యాటింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది. ప్రస్తుతం అతడితో మేము చర్చలు జరుపుతున్నాం. అతడు తన ప్రతిభను నిరూపించుకుంటాడని భావిస్తున్నాము. అతడికి జట్టు మెనెజ్‌మెంట్ మొత్తం సపోర్ట్‌గా ఉందని చెప్పుకొచ్చాడు. కాగా వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. -
‘విక్రమ్ రాథోడ్’గా వస్తున్న విజయ్ ఆంటోనీ
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు విజయ్ ఆంటోని. రీసెంట్‌గానే బిచ్చగాడు 2 సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. అదే జోష్ లో ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. విజయ్ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా(తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్ రాథోడ్’. అపోలో ప్రొడక్షన్స్, ఎస్ఎన్ఎస్ మూవీస్ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్.కౌశల్యా రాణి నిర్మించిన ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులో ఒ.బాబూరావు, జీపీఎస్ రెడ్డి విడుదల చేస్తున్నారు. సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. -
‘ఆ రికార్డు’ కూడా కోహ్లికి సాధ్యమే.. మరో 10 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేస్తాడు..!
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్‌లాంటి బ్యాటర్‌కు ఏదీ అసాధ్యం కాదు. శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్‌గా నిలబెడుతోంది’ అని అన్నారు. జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్‌లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు. అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి. -
కోహ్లి ఆట గురించి ఆందోళన లేదు!
కోల్‌కతా: భారత బ్యాటింగ్ స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి సుదీర్ఘ కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను సెంచరీ సాధించి రెండేళ్లు దాటగా ... ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ అతను పూర్తిగా విఫలమయ్యాడు. అయితే కోహ్లి విషయంలో తమకు ఎలాంటి ఆందోళన లేదని, త్వరలోనే అతను చెలరేగుతాడని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చదవండి: Washington Sundar: సుందర్‌ది దురదృష్టమే.. కాకపోతే చెప్పండి ‘కోహ్లి ఫామ్‌లో లేడనే మాటను నేను అంగీకరించను. విండీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలమైనా అది పెద్ద విషయం కాదు. నెట్స్‌లో అతను ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని సన్నద్ధత కూడా బాగుంది. త్వరలోనే ఒక గొప్ప ఇన్నింగ్స్‌తో తనేంటో కోహ్లి చూపిస్తాడు’ అని రాథోడ్ అభిప్రాయ పడ్డాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఏడాది చివర్లో జరిగే టి20 ప్రపంచకప్ కోసం తమ సన్నాహాలు మొదలైనట్లు అతను వెల్లడించాడు. విండీస్‌లో సిరీస్ గెలిచిన తర్వాతే ప్రయోగాలు, కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే విషయం గురించి ఆలోచిస్తామని విక్రమ్ రాథోడ్ స్పష్టం చేశాడు. చదవండి: Viral Video: వేలం సందర్భంగా సంగక్కర తొండాట.. అమాంతం పెరిగిపోయిన ఆర్చర్ ధర..! -
ద్రవిడ్ జట్టును ఖరారు చేసిన బీసీసీఐ..!
Vikram Rathour, Paras Mhambrey, T Dilip Set To Be Team India Support Staff: టీమిండియా కోచింగ్ సిబ్బంది నియామకాలు దాదాపుగా ఖరారైనట్టేనని తెలుస్తోంది. ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పేరును అధికారికంగా వెల్లడించిన బీసీసీఐ.. మరి కొద్ది గంటల్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల పేర్లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్నే కొనసాగించాలని నిర్ణయించిన భారత క్రికెట్ బోర్డు.. బౌలింగ్ కోచ్‌గా ద్రవిడ్ సన్నిహితుడు, టీమిండియా మాజీ బౌలర్ పరాస్ మాంబ్రేను, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ముగ్గురు పేర్లు ఖరారైతే.. వీరంతా ద్రవిడ్ కోచింగ్ టీంలో సహాయక సిబ్బందిగా పని చేస్తారు. ఈ నియామకాలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. చదవండి: T20 WC 2021 PAK VS AUS: పాక్‌ను ఓడించడం అసాధ్యం.. రమీజ్ రజా -
ఆ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్న టీమిండియా మాజీ ఓపెనర్
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి కోసం భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోడ్ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 3 చివరి తేదీ కావడంతో హుటాహుటిన తన దరఖాస్తును బీసీసీఐకి సమర్పించాడు. బ్యాటింగ్ కోచ్‌గా అతని ఎంపిక లాంఛనమే అయినప్పటికీ.. ఫార్మాలిటీ కోసం ఈ ప్రక్రియను పూర్తి చేశాడు. రాథోడ్ 2019 దక్షిణాఫ్రికా సిరీస్(భారత్‌లో జరిగినది) ద్వారా టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా అరంగేట్రం చేశాడు. సంజయ్ బాంగర్ నుంచి అతను పగ్గాలు చేపట్టాడు. రాథోడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగుస్తుంది. ఇదిలా ఉంటే, విక్రమ్ రాథోడ్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్.. బౌలింగ్ కోచ్ పదవికి పరాస్ మాంబ్రే.. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం అజయ్ రాత్రాలు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోచింగ్ టీం ఎంపిక దాదాపుగా ఖరారైనట్లేనని బీసీసీఐ వర్గాల సమాచారం. కాగా, టీమిండియా హెడ్ కోచ్ సహా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ స్థానాలతో పాటు నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ హెడ్ పదవులకు బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలసిందే. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ కెప్టెన్.. -
కరోనా అని తెలియగానే ఆటగాళ్లు ఒక్కసారిగా షాక్!
లండన్: భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రికు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో టీమిండియా ఆటగాళ్లు అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ చెప్పారు. నాలుగోరోజు ఆట ముగిసిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ''రవిశాస్త్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆదివారం బీసీసీఐ ప్రకటించంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రవిశాస్త్రితో సన్నిహితంగా మెలిగిన భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, ఫిజియో నితిన్ పటేల్‌లను ఐసోలేషన్‌కు తరలించారు. వాస్తవానికి మేము వీరి సేవలను భారీగా కోల్పోతున్నాముని'' తెలిపారు. గత 5-6 సంవత్సరాలలో భారత జట్టు బాగా రాణించడంలో వారు ముగ్గురు ప్రధాన పాత్ర పోషించారు అని ఆయన వెల్లడించారు. ''కానీ నిజం ఏంటింటే వారు ఈ సమయంలో ఇక్కడ లేరు. అందుకే ఆటగాళ్లు కలత చెందారు. తర్వాత మాలో మేము మాట్లడుకుని నాల్గవ రోజు ఆటపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. దానికే తగ్గట్టే కుర్రాళ్లు కూడా బాగా ఆడారు. శనివారం రాత్రి రవిశాస్త్రి కొంత అసౌకర్యానికి గురయ్యారు. దీంతో వైద్య బృందం రవిశాస్త్రికి కోవిడ్ పరీక్ష నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది'' అని విక్రమ్ రాథోర్ పేర్కొన్నారు. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు కాగా భారత్ ఖాతాలో మరో విజయం చేకూరాలంటే నాలుగో టెస్టులో చివరి రోజు బౌలర్లు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది.ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), హసీబ్ (43 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 50; 4 ఫోర్లు) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు. చదవండి: Shardul Thakur: ఎనిమిదో నెంబర్ ఆటగాడిగా శార్దూల్ కొత్త చరిత్ర -
250కి పైగా పరుగులు చేస్తే టీమిండియాదే పై చేయి..
సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో 250 పైగా పరుగులు చేస్తే మ్యాచ్‌పై పట్టు బిగించవచ్చని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో 250 మెరుగైన స్కోరేనని అభిప్రాయపడ్డాడు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ చక్కని భాగస్వామ్యంతో ఆకట్టుకున్నారని ఆదివారం ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ అన్నాడు. టీమిండియా ఇంకా వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని చెప్పుకొచ్చారు. కొత్త బంతిని ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ చక్కగా ఎదుర్కొన్నారని రాథోడ్ పేర్కొన్నాడు. అయితే, ఓపెనర్లు క్రీజు బయట స్టాన్స్ తీసుకుంది స్వింగ్‌ను ఎదుర్కోవడానికా? దూకుడుగా ఆడటానికా? అని ప్రశ్నించగా.. 'బ్యాటింగ్ అంటేనే పరుగులు చేయడం. రోహిత్, గిల్ పట్టుదలగా ఆడారు. వీలైనప్పుడల్లా పరుగులు చేసేందుకు ప్రయత్నించారు. వారిని కచ్చితంగా అభినందించాల్సిందే. విరాట్, రహానె బ్యాటింగ్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్' అని రాథోడ్ అన్నాడు. చదవండి:WTC Final Day 3: మరో బిగ్ వికెట్.. కెప్టెన్ కోహ్లి ఔట్ -
విరాట్ సలహా మేరకే పంత్‌కు ప్రమోషన్
న్యూఢిల్లీ: ఆసీస్ పర్యటనలో ఆఖరి రెండు టెస్టుల్లో రిషబ్ పంత్‌ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుగా పంపడంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ స్పందించాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి సలహా మేరకే పంత్‌కు బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. సిడ్నీ టెస్టులో బ్యాటింగ్ టాప్ ఆర్డర్ మొత్తం రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు కావడంతో ప్రత్యర్ధి బౌలింగ్‌పై ఎదురుదాడి చేసేందుకు రైట్, లెఫ్ హ్యాండ్ కాంబినేషన్ అయితే బాగుంటుందన్న విరాట్ సలహా మేరకే పంత్‌ను ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపామని ఆయన చెప్పుకొచ్చాడు. సాధారణంగా పంత్ ఆరు లేదా ఏడో స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చేది. అయితే, ఆసీస్‌తో జరిగిన ఆఖరి టెస్టుల్లో పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి కీలక ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు చారిత్రక సిరీస్ విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు. సిడ్నీ టెస్టులో భారత్ భారీ లక్ష్యాన్ని(407 పరుగులు) ఛేదించాల్సి ఉండగా.. పంత్ ఐదో స్థానంలో బరిలోకి దిగి కీలకమైన 97 పరుగులు చేయడమే కాకుండా మ్యాచ్‌ను డ్రాగా ముగించడంలో కీలక భూమిక పోషించాడు. ఇక ఆఖరిదైన బ్రిస్బేన్ టెస్టులో పంత్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి(89 నాటౌట్) భారత్‌కు చారిత్రక సిరీస్ విజయాన్నందించడంలో కీలకంగా వ్యవహరించాడు. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. అసలు ఏ అంచనాలు లేకుండా అనూహ్యంగా తుది జట్టులోకి వచ్చిన పంత్.. సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు(3 టెస్టుల్లో 68.50 సగటుతో 274 పరుగులు) సాధించిన ఆటగాడిగా నిలిచాడు. -
తన ఛాలెంజ్‌ను అధిగమిస్తే, సగం మీసంతో బరిలోకి దిగుతా..
చెన్నై: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, తన సహచర ఆటగాడు 'నయా వాల్' ఛతేశ్వర్ పుజారాకు ఓ ఛాలెంజ్ విసిరాడు. త్వరలో జరుగబోయే ఇంగ్లండ్ సిరీస్‌లో పుజారా గనక ప్రత్యర్ధి స్పిన్ బౌలింగ్‌లో క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను ఆ మ్యాచ్‌లో సగం మీసంతో బరిలోకి దిగుతానని ఛాలెంజ్ విసిరాడు. తన యూట్యూబ్ ఛానల్లో టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌తో జరిగిన సంభాషణ సందర్భంగా అశ్విన్ ఈ ప్రతిపాదన తెచ్చాడు. ఒక ఆఫ్ స్పిన్నర్‌పై పుజారా ఎదురుదాడి చేయడాన్ని మనమెప్పుడైనా చూడగలమా అని అశ్విన్ అడిగిన ప్రశ్నకు, రాథోడ్ బదులిస్తూ.. ఈ విషయంలో నేను పుజారాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నానని, అతని పైపు నుంచి స్పందన మాత్రం లేదని చమత్కరించాడు. వెంటనే అశ్విన్ స్పందిస్తూ.. రాబోయే ఇంగ్లండ్ పర్యటనలో మొయిన్ అలీ లేదా వేరెవరైనా స్పిన్నర్ బౌలింగ్‌లో పుజారా క్రీజ్ వదిలి బయటకు వచ్చి సిక్స్ బాదితే తాను సగం మీసంతో బరిలోకి దిగుతానని నవ్వుతూ ఛాలెంజ్ విసిరాడు. ఇందుకు రాథోడ్ స్పందిస్తూ..ఈ విషయాన్ని పుజారా అంత సీరియస్‌గా తీసుకుంటాడని నేనుకోను అంటూ నవ్వుతూ బదులిచ్చాడు. -
సెలక్టర్లకు సంజయ్ బంగర్ బెదిరింపు!
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపికతో పాటు సహాయక సిబ్బంది ఎంపిక కూడా జరిగిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తూ కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకోగా, సహాయక సిబ్బందిని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే బ్యాటింగ్ కోచ్‌గా తనను తప్పించడంపై సంజయ్ బంగర్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడానికి మొగ్గుచూపిన సమయంలో బంగర్ కాస్త అతి చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. తన మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారంటూ బంగర్ దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. సంజయ్ బంగర్‌కు మరోసారి అవకాశం ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి. -
సంజయ్ బంగర్‌పై వేటు
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన సహాయక సిబ్బందిలో ఇద్దరు కొనసాగనుండగా... మరొకరిపై వేటు పడింది. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని స్వయంగా విరాట్ కోహ్లి పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించినా సరే... బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు మాత్రం పొడిగింపు లభించలేదు. మెరుగైన రికార్డే ఉన్నా, వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో పంపడానికి కారణమయ్యాడంటూ విమర్శలపాలు కావడమే బంగర్ తన పదవిని కోల్పోయేలా చేసినట్లు సమాచారం. బంగర్ స్థానంలో మరో మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రాథోడ్ భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మూడేళ్ల క్రితం వరకు భారత సెలక్టర్‌గా కూడా పని చేసిన అతనికి పంజాబ్ రంజీ టీమ్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. బ్యాటింగ్ శిక్షణలో కొత్తదనం తీసుకురావడం కోసమే ఈ మార్పు చేసినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. రోడ్స్‌కు దక్కని అవకాశం... : కోచ్ రవిశాస్త్రి అండదండలతో పాటు కొన్నేళ్లుగా భారత పేస్ బౌలింగ్ పదునెక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నారు. మరో వైపు జాంటీ రోడ్స్ స్థాయి వ్యక్తి పోటీపడినా... హైదరాబాదీ ఆర్.శ్రీధర్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమ్ అడ్మినిస్ట్రే్టటివ్ మేనేజర్‌గా కూడా హైదరాబాద్‌కే చెందిన గిరీశ్ డోంగ్రే ఎంపికయ్యారు. ఒక్కో పదవికి ప్రాధాన్యతా క్రమంలో మూడు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బీసీసీఐ అధికారిక ముద్ర వేస్తుంది. -
ఆమ్రేకు పోటీగా రాథోడ్
న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, మాజీ సెలక్టర్ విక్రమ్ రాథోడ్ టీమిండియా బ్యాటింగ్ కోచ్ రేసులోకి వచ్చాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంగా భారత అండర్-19 జట్టు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) కోచింగ్ పదవికి రాథోడ్ చేసిన దరఖాస్తును గతంలో తిరస్కరించారు. అయినా పట్టువదలకుండా తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. రాథోడ్ దరఖాస్తు చేసుకోవడంతో ఇప్పటికే రేసులో ఉన్న ప్రవీణ్ ఆమ్రేకు గట్టి పోటీ ఎదురైంది. ప్రస్తుతం సంజయ్ బంగర్‌పై వ్యతిరేకత రావడంతో.. బ్యాటింగ్ కోచ్ పదవి ఆమ్రే, రాథోడ్ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. 'జూనియర్ సెలక్షన్ ప్యానెల్ల చీఫ్‌గా ఉన్న అశిష్ కపూర్‌తో సంబంధం ఉండటంతో పరస్పర విరుద్ధ ప్రయోజనాలతో అండర్-19, ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ పదవికి రాథోడ్ దూరమయ్యాడు. కాగా, భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్ పదవికి రాథోడ్ దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఒక బీసీసీఐ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం సీనియర్ బ్యాటింగ్ కోచ్ కోసం దరఖాస్తు చేసుకోవడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు రాదని సదరు అధికారి తెలిపారు. కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతు ఉన్నప్పటికీ.. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రిని తిరిగి ఎంపిక చేయడం అంత సులువేం కాదు. రవిశాస్త్రికి పోటీగా హేమాహేమీలు రంగంలోకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్‌పుత్, టామ్ మూడీ, మైఖేల్ హెస్సన్ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోగా.. గ్యారీ కిర్‌స్టన్ కూడా బరిలో ఉన్నట్టు సమాచారం. ఇక ఫీల్డింగ్ కోచ్ పదవికి జాంటీరోడ్స్ ఫేవరెట్‌గా ఉన్నాడు.