ఆఫ్గానిస్తాన్-న్యూజిలాండ్ మధ్య చారిత్రత్మక టెస్టు మ్యాచ్‌కు భారత్ ఆతిథ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9 నుంచి గ్రేటర్ నోయిడా వేదికగా ఈ ఏకైక టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే నోయిడాకు చేరుకుని తమ ప్రాక్టీస్‌ను కూడా మొదలెట్టేశాయి.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ క్రికెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్ టెస్టుతో పాటు భారత్‌తో టెస్టు సిరీస్‌లకు తమ జట్టు బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక మాజీ స్పిన్నర్ రంగనా హెరాత్‌ను న్యూజిలాండ్ క్రికెట్ నియమించింది. అదేవిధంగా అఫ్గాన్‌తో ఏకైక టెస్టుకు భారత మాజీ ఓపెనర్ విక్రమ్ రాథోర్‌ను తమ బ్యాటింగ్ కోచ్‌గా కివీస్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది.
ఈ విషయాన్ని కివీస్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు. హెరత్, విక్రమ్ తమ టెస్ట్ గ్రూప్‌లోకి రావడం చాలా సంతోషంగా ఉందని స్టెడ్ తెలిపాడు. కాగా టీ20 వరల్డ్‌కప్-2024 గెలుచుకున్న భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా రాథోర్ పనిచేసిన సంగతి తెలిసిందే.
భారత్ హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగియడంతో రాథోర్ కాంట్రాక్ట్‌ను కూడా బీసీసీఐ పునరుద్దరించలేదు. మరోవైపు హెరత్ గతంలో చాలా జట్లకు బౌలింగ్ కన్సెల్టెంట్‌గా పనిచేశాడు.
Comments
Please login to add a commentAdd a comment