అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు.
విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్‌లాంటి బ్యాటర్‌కు ఏదీ అసాధ్యం కాదు.
శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్‌లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్‌లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్‌నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్‌గా నిలబెడుతోంది’ అని అన్నారు.
జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్
భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్‌లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు.
అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు.
ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment