వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది.
కాగా, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి.
ఇదిలా ఉంటే, కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది.
సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment