గౌహతి వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించాడు. కేవలం 48 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం బాదాడు. ఫలితంగా ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది.
రుతురాజ్ మెరుపు శతకం..
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రుతురాజ్ అజేయమైన మెరుపు శతకంతో (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (6), ఇషాన్ కిషన్ (0) నిరాశపర్చగా.. సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్ వర్మ (24 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కేన్ రిచర్డ్‌సన్, బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ పడగొట్టారు.
మ్యాక్సీ ఊచకోత..
223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. మ్యాక్స్‌వెల్ సునామీ శతకంతో చెలరేగడంతో అద్భుత విజయం సాధించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఆరోన్ హార్డీ (16), జోష్ ఇంగ్లిస్ (10), మార్కస్ స్టోయినిస్ (17) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ట్రవిస్ హెడ్ (35) పర్వాలేదనిపించాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్.. మాథ్యూ వేడ్ (16 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకారంతో ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.
భారత బౌలర్లలో రవి భిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రసిద్ద్ కృష్ణ (4-0-68-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఆఖరి బంతికి గెలిచిన ఆసీస్..
ఆసీస్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో 43 పరుగులు అవసరం కావడంతో భారత గెలుపు లాంఛనమే అని అంతా అనుకున్నారు. అయితే మ్యాక్సీ ఒక్కసారిగా మెరుపుదాడికి దిగి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్‌లో 22 పరుగులు, ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో 23 పరుగులు పిండుకున్న మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఫోర్ బాది ఆసీస్‌ను గెలిపించాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సమం చేసిన మ్యాక్సీ..
ప్రస్తుత భారత పర్యటనలో భీకర ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ వరల్డ్‌కప్ 2023లో రెండు మెరుపు శతకాలు బాదడంతో పాటు నిన్న (నవంబర్ 28) జరిగిన మూడో టీ20లోనూ సుడిగాలి శతకంతో విరుచుకుపడ్డాడు. నిన్నటి మ్యాచ్‌లో 47 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. ఆస్ట్రేలియా తరఫున పొట్టి క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును సమం చేశాడు. మ్యాక్సీకి ముందు ఆరోన్ ఫించ్, జోష్ ఇంగ్లిస్ కూడా 47 బంతుల్లోనే శతకాలు బాదారు. ఆసీస్ తరఫున టీ20ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ శతకాల్లో మ్యాక్స్‌వెల్‌వే మూడు ఉండటం విశేషం. దీనికి ముందు మ్యాక్సీ ఓసారి 49 బంతుల్లో, ఓసారి 50 బంతుల్లో టీ20 సెంచరీలు బాదాడు.
Comments
Please login to add a commentAdd a comment