సంజయ్ బంగర్, విక్రమ్ రాథోడ్
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన సహాయక సిబ్బందిలో ఇద్దరు కొనసాగనుండగా... మరొకరిపై వేటు పడింది. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని స్వయంగా విరాట్ కోహ్లి పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించినా సరే... బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు మాత్రం పొడిగింపు లభించలేదు. మెరుగైన రికార్డే ఉన్నా, వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో పంపడానికి కారణమయ్యాడంటూ విమర్శలపాలు కావడమే బంగర్ తన పదవిని కోల్పోయేలా చేసినట్లు సమాచారం. బంగర్ స్థానంలో మరో మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రాథోడ్ భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మూడేళ్ల క్రితం వరకు భారత సెలక్టర్‌గా కూడా పని చేసిన అతనికి పంజాబ్ రంజీ టీమ్, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. బ్యాటింగ్ శిక్షణలో కొత్తదనం తీసుకురావడం కోసమే ఈ మార్పు చేసినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
రోడ్స్‌కు దక్కని అవకాశం... : కోచ్ రవిశాస్త్రి అండదండలతో పాటు కొన్నేళ్లుగా భారత పేస్ బౌలింగ్ పదునెక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నారు. మరో వైపు జాంటీ రోడ్స్ స్థాయి వ్యక్తి పోటీపడినా... హైదరాబాదీ ఆర్.శ్రీధర్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమ్ అడ్మినిస్ట్రే్టటివ్ మేనేజర్‌గా కూడా హైదరాబాద్‌కే చెందిన గిరీశ్ డోంగ్రే ఎంపికయ్యారు. ఒక్కో పదవికి ప్రాధాన్యతా క్రమంలో మూడు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బీసీసీఐ అధికారిక ముద్ర వేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment