ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉండాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కార్యదర్శి జై షా అన్నాడు. టీమిండియాలోని ఆటగాళ్లలో ఎక్కువ మంది మూడు ఫార్మాట్లలో ఆడుతున్నారని.. అలాంటపుడు ఒకే కోచ్ ఉంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని పేర్కొన్నాడు. ఒక్కసారి ప్రధాన శిక్షకుడిగా ఓ వ్యక్తిని నియమించిన తర్వాత అతడి నిర్ణయానుసారమే అంతా జరుగుతుందని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్-2024 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిన విషయం తెలిసిందే. అతడి స్థానంలో మాజీ ఓపెనర్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. అయితే, ఇందుకు సంబంధించిన ప్రకటనకు ముందు.. టీమిండియాకు ముగ్గురు కోచ్‌లు ఉండబోతున్నారనే వార్తలు వచ్చాయి. టెస్టు, వన్డే, టీ20లకు వేర్వేరు వ్యక్తులు శిక్షణ ఇవ్వనున్నట్లు వదంతులు వ్యాపించాయి.
గంభీర్‌కు చెప్పడానికి నేనెవరిని?
ఈ విషయంపై జై షా తాజాగా స్పందించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ... ‘‘కోచ్‌ను నియమించుకున్న తర్వాత.. అతడి అభిప్రాయాన్ని మేము గౌరవించాల్సి ఉంటుంది. అతడు చెప్పిందే వినాలి కూడా!.. గౌతం గంభీర్‌ను హెడ్‌కోచ్‌గా సెలక్ట్ చేసుకున్న తర్వాత.. అతడి దగ్గరికి వెళ్లి.. ‘నువ్వు ఈ ఫార్మాట్‌కు సరిగ్గా కోచింగ్ ఇవ్వలేవు’ అని చెప్పడానికి నేనెవరిని?
ఒకవేళ తను మూడు ఫార్మాట్లకు కోచ్‌గా ఉండాలని భావిస్తే.. మేమెందుకు అడ్డుచెప్తాం? అయినా భారత జట్టులో 70 శాతం మంది ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలో ఆడుతూనే ఉన్నారు. కాబట్టి వేర్వేరు కోచ్‌లు అవసరం లేదనే భావిస్తున్నాం.
ఎన్‌సీఏ కోచ్‌లు ఉన్నారు కదా!
అంతేకాదు.. ఒకవేళ హెడ్‌కోచ్ విరామం తీసుకున్నా మాకు బ్యాకప్ కోచ్‌లు ఉండనే ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ కోచ్(ఎన్‌సీఏ)లు మాకు సేవలు అందిస్తారు. ఉదాహరణకు.. రాహుల్ ద్రవిడ్ బ్రేక్ తీసుకున్నపుడు వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించాడు కదా! ఇప్పుడు కూడా అంతే!’’ అని జై షా చెప్పుకొచ్చాడు.
కాగా శ్రీలంక పర్యటనతో టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన గౌతం గంభీర్.. టీ20 సిరీస్ 3-0తో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్నాడు. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం ఘోర పరాభవం ఎదురైంది. ఇరవై ఏడేళ్ల తర్వాత టీమిండియా లంకు వన్డే సిరీస్(0-2)ను కోల్పోయింది. తదుపరి రోహిత్ సేన బంగ్లాదేశ్ స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడనుంది.
చదవండి: ’టీ20 ఫార్మాట్ క్రికెట్‌ను నాశనం చేస్తోంది.. ఇండియా మాత్రం లక్కీ’
Comments
Please login to add a commentAdd a comment