బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా టీమిండియా బౌలింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ ప్రయాణం మొదలుకానుంది. మూడేళ్లపాటు అతడు ఈ పదవిలో కొనసాగనున్నాడు. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకోగా... మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అతడి స్థానాన్ని భర్తీ చేసిన విషయం తెలిసిందే.
శ్రీలంక పర్యటన సందర్భంగా ప్రధాన శిక్షకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన గౌతీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ తరఫున తనతో కలిసి పనిచేసిన అభిషేక్ నాయర్, టెన్ డస్కటేను తన సహాయక బృందంలో చేర్చుకున్నాడు. ఆ టూర్‌లో భారత మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.
టీమిండియా మాజీలను కాదని
ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ నియమితుడైనట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా బుధవారం వెల్లడించారు. ఇక 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ వరకు మోర్కెల్ కాంట్రాక్ట్ కొనసాగనుందని తెలిపారు. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్ రేసులో వినయ్ కుమార్, లక్ష్మీపతి బాలాజీ వంటి భారత మాజీ పేసర్ల పేర్లు కూడా వినిపించిన విషయం తెలిసిందే.
బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఎంపికకు కారణం ఇదే!
అయితే, గంభీర్ కోరిక మేరకే మోర్నీ మోర్కెల్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు స్పందిస్తూ.. ‘‘హెడ్‌కోచ్ పదవి విషయంలో మాత్రమే క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించడం తప్పనిసరి. సహాయక బృందం విషయంలో ప్రధాన కోచ్ సిఫారసును పరిగణనలోకి తీసుకుంటారు. గంభీర్ గతంలో మోర్నీతో పని చేశాడు.
అతడి నైపుణ్యాల గురించి గంభీర్‌కు పూర్తి అవగాహన ఉంది. అందుకే అతడిని తన టీమ్‌లో చేర్చుకున్నాడు. ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాతో టీమిండియా ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఆడబోతోంది. ఇలాంటి సమయంలో... భారత బౌలింగ్ కోచ్‌గా... ఆసీస్ గడ్డపై విజయవంతమైన బౌలర్‌గా పేరు తెచ్చుకున్న సౌతాఫ్రికన్ కంటే అత్యుత్తమ ఎంపిక మరొకటి ఉండదు.
వచ్చే ఏడాది ఇంగ్లండ్‌తోనూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ చేరాలంటే విదేశీ గడ్డపై గొప్ప అనుభవం ఉన్న బౌలర్ కోచ్‌గా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. అందుకే గంభీర్ తన ప్రణాళికలకు అనుగుణంగానే ఏరికోరి మోర్నీని తన బృందంలో చేర్చుకున్నాడు’’ అని పేర్కొన్నాయి.
మూడు దేశాలకు కోచ్‌గా...
మోర్కెల్‌కు గంభీర్‌కు మధ్య మంచి సమన్వయం ఉంది. ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున గంభీర్ సారథ్యంలో ఆడిన మోర్నీ అనంతరం లక్నో సూపర్ జెయింట్స్‌కు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఆ సమయంలో లక్నో ఫ్రాంచైజీకి గంభీర్ మెంటార్‌గా వ్యవహరించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టు తరఫున 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టి20లు ఆడిన మోర్నీ మోర్కెల్ ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 544 వికెట్లు పడగొట్టాడు.
కెరీర్‌కు వీడ్కోలు పలికిన అనంతరం మోర్కెల్ పలు జట్లకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా పాకిస్తాన్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన మోర్కెల్... మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు శిక్షకుడిగా వ్యవహరించాడు.
వారిని మెరిల్లా తీర్చిదిద్దడంలో పాత్ర
ఇక ఈ ఏడాది జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో నమీబియా జట్టుకూ మోర్కెల్ శిక్షణ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ మెరుగైన ప్రదర్శన వెనక కూడా మోర్కెల్ కృషి ఉంది.
ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ మొదలుకానుంది. కాగా గంభీర్ బృందంలో అభిషేక్ నాయర్, టెన్ డస్కటే, ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన టి.దిలీప్ కొనసాగుతున్నాడు. తాజాగా మోర్నీ మోర్కెల్ నియామకంతో ఇక కోచింగ్ స్టాఫ్ ఎంపిక ముగిసినట్లయింది.
Comments
Please login to add a commentAdd a comment