దూకుడుకు మారుపేరు.. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఆటగాడు.. ప్రత్యర్థి ఎత్తులకు పైఎత్తులు వేయగల వ్యూహకర్త.. ఇలాంటి వ్యక్తి హెడ్‌కోచ్‌గా వస్తే జట్టు విజయపథంలో నడవడం ఖాయం.. గౌతం గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా నియమితుడు కాగానే అతడి అభిమానులతో పాటు విశ్లేషకులూ వ్యక్తపరిచిన అభిప్రాయాలు ఇవి.
అందుకు తగ్గట్టుగానే శ్రీలంక పర్యటనలో భాగంగా కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో.. యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు టీ20 సిరీస్‌ను.. 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో హెడ్‌కోచ్‌గా గంభీర్‌కు శుభారంభం లభించింది.
కానీ.. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సీనియర్ ఆటగాళ్లు జట్టుతో ఉన్నా వన్డే సిరీస్‌లో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత లంక చేతిలో వన్డే సిరీస్‌లో భారత్ ఓటమిని చవిచూసింది.
సొంతగడ్డపై ఘోర అవమానం
ఆ తర్వాత స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌ను 2-0తో, టీ20 సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. కానీ.. న్యూజిలాండ్ రూపంలో ఎదురైన కఠిన సవాలును గౌతీ అధిగమించలేకపోయాడు. సీనియర్ ఆటగాళ్ల వైఫల్యం, బ్యాటర్ల పేలవ ప్రదర్శన కారణంగా సొంతగడ్డపై టీమిండియా కివీస్‌తో టెస్టుల్లో 0-3తో వైట్‌వాష్‌కు గురైంది.
ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!
న్యూజిలాండ్‌తో బెంగళూరు టెస్టులో పిచ్‌ను తప్పుగా అంచనావేసి తొలుత బ్యాటింగ్ చేయడం, పుణెలో స్పిన్ పిచ్ రూపొందించి బొక్కబోర్లా పడటం.. ముంబై టెస్టులోనూ గెలిచే మ్యాచ్‌ను చేజార్చుకోవడం..కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గంభీర్‌పై విమర్శల కారణమైంది. ఇక కివీస్ చేతిలో ఈ ఘోర ఓటమి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ అవకాశాలనూ దెబ్బతీసింది.
గంభీర్ చేసిన తప్పులు ఇవే
ఒకవేళ ఆస్ట్రేలియా పర్యటనలో గనుక జట్టు ప్రదర్శన ఇలాగే సాగితే కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు గౌతమ్ గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి పెరగడం ఖాయం. న్యూజిలాండ్ చేతిలో సిరీస్ పరాజయానికి తనదే పూర్తి బాధ్యత అని రోహిత్ ఎంత చెబుతున్నా... మేనేజ్‌మెంట్ వ్యూహాల లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ప్రధాన ప్లేయర్లే తడబడుతున్న సమయంలో సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపిన మేనేజ్‌మెంట్... మిడిలార్డర్‌లో అనుభవమున్న ‘లోకల్ బాయ్’ సర్ఫరాజ్ ఖాన్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దింపింది.
ఆ విషయంలో ద్రవిడ్ పర్ఫెక్ట్
ఇవే కాకుండా గతంలో ద్రవిడ్ ప్రాక్టీస్ విషయంలో చాలా పకడ్బందీగా ఉండేవాడని పలువురు ప్లేయర్లు అభిప్రాయపడగా... గంభీర్‌లో ఆ తీవ్రత లోపించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రాబోయే ఆస్ట్రేలియా పర్యటన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు హెడ్ కోచ్ గంభీర్‌లకు అగ్ని పరీక్షగా నిలువనుంది.
రెక్కలు కత్తిరించేందుకు సిద్ధం!
ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. గంభీర్ ‘ అధికారాల రెక్కలు’ కత్తిరించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సిద్ధమైనట్లు సమాచారం. ఇకపై అతడిని సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘రవిశాస్త్రి, రాహుల్ ద్రవిడ్‌లకు లేని వెసలుబాటును బీసీసీఐ గౌతం గంభీర్‌కు కల్పించింది.
నిజానికి బీసీసీఐ నిబంధనల ప్రకారం.. కోచ్‌లను సెలక్షన్ కమిటీ సమావేశాలకు అనుమతించరు. కానీ.. ఆస్ట్రేలియా పర్యటనకు పంపే జట్టు విషయంలో ఈ రూల్‌ను మినహాయించారు. హెడ్‌కోచ్‌ను మీటింగ్‌కు అనుమతించారు’’ అని పేర్కొన్నాయి. అయితే, స్వదేశంలోనే గంభీర్ అంచనాలు తప్పి.. ఘోర అవమానం ఎదురైంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ.. అతడిని ఇకపై సెలక్షన్ కమిటీ సమావేశాలకు దూరం పెట్టనున్నట్లు సమాచారం.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సచిన్ సీరియస్.. అసలు తప్పు ఎక్కడ జరిగింది?
Comments
Please login to add a commentAdd a comment