
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 31) వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ ఓటమితో కేకేఆర్ పలు చెత్త రికార్డులు మూటగట్టుకుంది. ఐపీఎల్‌లో ఓ జట్టు (ముంబై ఇండియన్స్) చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా తమ పేరిటే ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది.
తాజా ఓటమితో ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ పరాజయాల సంఖ్య 24కు చేరింది. ఐపీఎల్‌లో ఏ జట్టూ ఓ జట్టు చేతిలో ఇన్ని మ్యాచ్‌లు ఓడిపోలేదు. కేకేఆర్ తర్వాత ఈ చెత్త రికార్డు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ పేరిట ఉంది. ఆర్సీబీ సీఎస్‌కే చేతిలో.. పంజాబ్ కేకేఆర్ చేతిలో తలో 21 మ్యాచ్‌లు ఓడిపోయాయి.
ఐపీఎల్‌లో ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..
కేకేఆర్- 24 ముంబై ఇండియన్స్ చేతిలో
ఆర్సీబీ- 21 సీఎస్‌కే చేతిలో
పంజాబ్- 21 కేకేఆర్ చేతిలో
సీఎస్‌కే- 20 ముంబై ఇండియన్స్ చేతిలో
ఆర్సీబీ- 20 కేకేఆర్ చేతిలో
నిన్నటి ఓటమితో కేకేఆర్ మరో చెత్త రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా నిలిచింది. కేకేఆర్ వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో అత్యధికంగా 10 పరాజయాలు ఎదుర్కొంది. ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్ల జాబితాలో పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ కేకేఆర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఓ వేదికపై ఓ జట్టు చేతిలో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్లు..
కేకేఆర్- 10 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో
పంజాబ్-9 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలో
ఆర్సీబీ- 8 వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో
ఆర్సీబీ- 8 చిన్నస్వామి స్టేడియంలో ముంబై ఇండియన్స్ చేతిలో
ఆర్సీబీ- 8 చెపాక్ స్టేడియంలో సీఎస్‌కే చేతిలో
ఢిల్లీ- 8 ఈడెన్ గార్డెన్స్‌లో కేకేఆర్ చేతిలో
మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ చేతిలో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం ఎదుర్కొంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. అరంగేట్రం పేసర్ అశ్వనీ కుమార్ (3-0-24-4) చెలరేగడంతో కేకేఆర్‌ను 116 పరుగులకే కుప్పకూల్చింది. కేకేఆర్‌ను మట్టికరిపించడంలో ముంబై బౌలర్లు దీపక్ చాహర్ (2-0-19-2), బౌల్ట్ (4-0-23-1), హార్దిక్ పాండ్యా (2-0-10-1), విజ్ఞేశ్ పుతుర్ (2-0-21-1), సాంట్నర్ (3.2-0-17-1) తలో చేయి వేశారు.
కేకేఆర్ ఇన్నింగ్స్‌లో రఘువంశీ (26) టాప్ స్కోరర్ కాగా.. రమణ్‌దీప్ (22), మనీశ్ పాండే (19), రింకూ సింగ్ (17), రహానే (11) రెండంకెల స్కోర్లు చేశారు. డికాక్ (1), సునీల్ నరైన్ (0), వెంకటేశ్ అయ్యర్ (3), రసెల్ (5) దారుణంగా విఫలమయ్యారు.
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ (9 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తా చాటడంతో 12.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కేకేఆర్ బౌలర్లలో ఆండ్రీ రసెల్‌కు 2 వికెట్లు దక్కాయి.
ఈ సీజన్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత ముంబై ఇండియన్స్‌కు లభించిన తొలి విజయం ఇది. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ జట్టుకు ఈ సీజన్‌లో ఇది రెండో పరాజయం. తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడిన ఈ జట్టు.. ఆతర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించి, తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో ఓడింది.