
Photo Courtesy: BCCI
ఐపీఎల్-2025లో ఇవాళ (ఏప్రిల్ 1) రెండు విధ్వంసకర జట్ల మధ్య పోటీ జరుగనుంది. హార్డ్ హిట్టర్లతో నిండిన లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టును అంచనా వేయడం చాలా కష్టం. ఇరు జట్లలో సమాంతరమైన మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. సొంత మైదానంలో ఆడటం ఎల్‌ఎస్‌జీకి కాస్త అడ్వాంటేజ్ అవుతుంది. అలాగని పంజాబ్‌ను తక్కువ అంచనా వేయలేము. ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లు చెలరేగితే ఎక్కడైనా, ఏ జట్టుపై అయినా విజయం సాధించగలరు.
ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఏకైక మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించింది. గుజరాత్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశమున్నా జట్టు ప్రయోజనాల కోసం వద్దనుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం కుర్రాడు ప్రియాంశ్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) కూడా సత్తా చాటారు.
మెరుపు వీరులు మ్యాక్స్‌వెల్ (0), స్టోయినిస్ (20) విఫలమైనా ఈ మ్యాచ్‌లో పంజాబ్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. లక్ష్యానికి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలించే అహ్మదాబాద్ పిచ్ కావడంతో ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బౌలర్లు తేలిపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ (4-0-36-2), స్పిన్నర్ విజయ్‌కుమార్ వైశాక్ (3-0-28-0) మాత్రమే పర్వాలేదనిపించారు. కీలక సమయంలో వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థికి మ్యాచ్‌ను దూరం చేశాడు. నేడు లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో తొలి మ్యాచ్‌లో సత్తా చాటిన ఆటగాళ్లతో పాటు మ్యాక్సీ, స్టోయినిస్ కూడా రాణిస్తే పంజాబ్‌ను ఆపడం కష్టమవుతుంది.
లక్నో విషయానికొస్తే.. ఈ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ దాంట్లో ఓడి, మరో మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో గెలవాల్సింది. అయితే ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఆటగాళ్లు అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి లక్నో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో లక్నో విధ్వంసకర బ్యాటర్లు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరిద్దరు మెరుపు అర్ద సెంచరీలు చేసి తమ జట్టు భారీ స్కోర్‌కు (209) దోహదపడ్డారు.
మరో డేంజర్ బ్యాటర్ కిల్లర్ మిల్లర్ కూడా ఓ మోస్తరు మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారీ అంచనాలు పెట్టుకున్న కొత్త కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మరో హార్డ్ హిట్టర్ మార్క్రమ్ కూడా సత్తా చాటలేకపోయాడు. మొహిసిన్ ఖాన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిగా ఎల్‌ఎస్‌జీలో చేరిన శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో పర్వాలేదనిపించాడు. దేశీయ బౌలర్లు మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ రతీ కూడా రాణించారు. సీనియర్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
ఈ సీజన్‌లో తమ రెండో మ్యాచ్‌లో లక్నో పిచ్చ కొట్టుడు కొట్టి సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత శార్దూల్ ఠాకూర్ (4-0-34-4) బంతితో చెలరేగిపోయాడు. ఆతర్వాత మార్ష్, పూరన్ విధ్వంసం సృష్టించారు. ఫలితంగా సన్‌రైజర్స్ సెట్ చేసిన 191 పరుగుల లక్ష్యాన్ని ఎల్‌ఎస్‌జీ 16.1 ఓవర్లలోనే ఊదేసింది.
పంజాబ్‌తో నేడు జరుగబోయే మ్యాచ్‌లో పూరన్, మార్ష్ మరోసారి విజృంభిస్తే లక్నో విజయం ఖాయం. పంజాబ్‌తో పోలిస్తే లక్నోలో భారీ హిట్టర్ల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది. మార్క్రమ్, పంత్, ఆయుశ్ బదోని కూడా టచ్‌లోకి వస్తే లక్నోకు తిరుగుండదు. గతేడాది సన్‌రైజర్స్ తరఫున విధ్వంసం సృష్టించిన అబ్దుల్ సమద్ ఈ సీజన్‌లో లక్నోతో ఉన్నాడు. శార్దూల్ కూడా లోయర్ ఆర్డర్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడగలదు.
పంజాబ్, లక్నో జట్లలో భారీ హిట్టర్లు ఉండటంతో నేటి మ్యాచ్‌లో పరుగుల వరద ఖాయమైపోయింది. ఎవరు పైచేయి సాధిస్తారనేది చూడాలి. చరిత్ర చూస్తే ఇరు జట్ల ఇప్పటివరకు నాలుగు సార్లు ఎదురెదురుపడగా.. లక్నో 3, పంజాబ్ ఒక మ్యాచ్‌లో గెలిచాయి. నేటి మ్యాచ్‌లో లక్నోకు అనుకూలంగా ఉండే ఆనవాయితీనే కొనసాగుతుందని చెప్పలేము. పంజాబ్‌లో కూడా మెరుపు వీరుల సంఖ్య తక్కువ లేదు.
తుది జట్లు (అంచనా)..
లక్నో: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దిగ్వేశ్ రతీ, ప్రిన్స్ యాదవ్
పంజాబ్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్‌కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్జ్, లాకీ ఫెర్గూసన్/అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్