వన్డే వరల్డ్‌కప్-2003 టోర్నీలో టీమిండియా సభ్యుడు.. నాడు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో చేజారిన ట్రోఫీ.. ఆ మరుసటి ఎడిషన్ అంటే 2007 నాటికి అతడు కెప్టెన్ అయ్యాడు.
అయితే, ఈసారి మరీ ఘోరంగా భారత జట్టు తొలి రౌండ్‌లోనే ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఓ దిగ్గజ ఆటగాడికి తీవ్ర నిరాశే మిగిలింది.
అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో తొలిసారి ఐసీసీ ట్రోఫీని ముద్దాడే అవకాశం వచ్చింది. అయితే, ఈసారి ఆటగాడిగా కాకుండా కోచ్‌గా ఉన్నాడు ఆ వ్యక్తి.
ఇంకేముంది ఎప్పుడూ గంభీరంగా ఉండే అతడు కూడా చిన్నపిల్లాడిలా మారిపోయాడు. ఎన్నడూ లేని విధంగా ఈ ఆనంద సమయంలో తన భావోద్వేగాలను వ్యక్తపరిచాడు. ట్రోఫీని ముద్దాడుతూ మురిసిపోయాడు. అవును మీరు ఊహించిన పేరే.. రాహుల్ ద్రవిడ్.
రోహిత్ సేన వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన సమయంలో కనిపించిన ఈ దృశ్యాలు అభిమానులనే కాదు తమనూ ఆకట్టుకున్నాయంటున్నాడు టీమిండియా సొగసరి బ్యాటర్, ద్రవిడ్ సహచర ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్. ఈ మాజీ క్రికెటర్ ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
రోహిత్, విరాట్ వల్లే ద్రవిడ్ అలా..
ఈ నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ద్రవిడ్‌ను అలా ట్రోఫీతో చూడటం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. ‘‘రాహుల్‌తో చాలా ఏళ్లపాటు కలిసి క్రికెట్ ఆడాను.
మామూలుగా అతడు తన భావోద్వేగాలను వ్యక్తపరచడు. అయితే, ఈసారి ట్రోఫీ గెలిచినపుడు మాత్రం భిన్నంగా కనిపించాడు. రోహిత్, విరాట్ కోహ్లి ద్రవిడ్ చేతికి ట్రోఫీని ఇవ్వడం చూడముచ్చటగా అనిపించింది.
ఇక ద్రవిడ్ సెలబ్రేట్ చేసుకున్న విధానం చూస్తే.. ఈ విజయం మనకెంత ప్రత్యేకమో అందరికీ అర్థమయ్యే ఉంటుంది’’ అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో టీమిండియా సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. తద్వారా భారత్ ఖాతాలో ఐదో ఐసీసీ ట్రోఫీ చేరింది. ఇక ఈ టోర్నీ తర్వాత రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్‌గా తప్పుకోగా.. గౌతం గంభీర్‌తో అతడి స్థానాన్ని భర్తీ చేసింది బీసీసీఐ.
చదవండి: మిస్టరీ గర్ల్‌తో హార్దిక్ పాండ్యా.. ప్రేమ గురించి నటాషా పోస్ట్
Comments
Please login to add a commentAdd a comment