Kohli- Gambhir: మ్యాచ్‌ గెలిచినంత సంబరం.. రోహిత్‌ సైతం.. | Gambhir Kohli Celebrate After Bumrah Akash Help India Avoid Follow On Video | Sakshi
Sakshi News home page

Kohli- Gambhir: వారికి మ్యాచ్‌ గెలిచినంత సంబరం.. రోహిత్‌ మాత్రం అలా.. వీడియో

Published Tue, Dec 17 2024 5:05 PM | Last Updated on Tue, Dec 17 2024 6:24 PM

Gambhir Kohli Celebrate After Bumrah Akash Help India Avoid Follow On Video

కోహ్లి- గంభీర్‌- రోహిత్‌ (PC: X)

గబ్బా టెస్టులో నాలుగో రోజు టీమిండియాకు అనుకూలించింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 51/4తో మంగళవారం నాటి ఆట మొదలుపెట్టిన భారత్‌ను ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తన ఆటతో ఆదుకున్నాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(10) విఫలమైనా.. వికెట్‌ పడకుండా జాగ్రత్త పడిన ఈ కర్ణాటక బ్యాటర్‌.. విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు. మొత్తంగా 139 బంతులు ఎదుర్కొని 84 పరుగులతో రాణించాడు.

రాహుల్‌, జడేజా విలువైన అర్ధ శతకాలు
ఇక కేఎల్‌ రాహుల్‌తో పాటు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా అదరగొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన జడ్డూ 123 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. వీరిద్దరు హాఫ్‌ సెంచరీలు చేసినప్పటికీ టీమిండియాకు కష్టాలు తప్పలేదు. 

ఫాలో ఆన్‌ గండం నుంచి తప్పించుకోవాలంటే.. జడ్డూ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగే సమయానికి భారత్‌ ఇంకా ముప్పై మూడు పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ ఆకాశ్‌ దీప్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు.

గట్టెక్కించిన పేసర్లు
మరో పేస్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాతో కలిసి వికెట్‌ పడకుండా జాగ్రత్త పడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా టీమిండియా ఫాలో ఆన్‌ ముప్పు నుంచి తప్పించుకుంది. దీంతో భారత శిబిరంలో ఒక్కసారిగా సంబరాలు మొదలయ్యాయి.

మ్యాచ్‌ గెలిచినంత సంబరం
హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి సంతోషం పట్టలేకపోయారు. గంభీర్‌ అయితే ఒక్కసారిగా తన సీట్లో నుంచి లేచి కోహ్లికి హై ఫైవ్‌ ఇచ్చాడు. ఇక కోహ్లి కూడా మ్యాచ్‌ గెలిచామన్నంత రీతిలో ఆనందంతో పొంగిపోయాడు. రోహిత్‌ను చీర్‌ చేస్తూ గట్టిగా అరుస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. రోహిత్‌ కూడా చిరునవ్వులు చిందించాడు. 

అవును మరి.. టెస్టుల్లో ఇలాంటి మూమెంట్లే సిరీస్‌ ఫలితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. గబ్బా టెస్టును కనీసం డ్రాగా ముగించిన భారత్‌కు సానుకూలాంశమే. 

ఇదిలా ఉంటే.. నాలుగో రోజు ఆట ముగిసే సరికి బుమ్రా 10(27 బంతుల్లో ఒక సిక్స్‌), ఆకాశ్‌ దీప్‌27 (31 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌)తో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు చెరో సిక్సర్‌ బాదడం ఆఖర్లో హైలైట్‌గా నిలిచింది.

గబ్బాలో కనీసం డ్రా కోసం
కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ ఆడేందుకు భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా.. అడిలైడ్‌ పింక్‌ బాల్‌ టెస్టులో ఆసీస్‌ గెలిచాయి. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది.

ఈ క్రమంలో బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో శనివారం మూడో టెస్టు మొదలైంది. ఇందులో టాస్‌ గెలిచిన రోహిత్‌ సేన తొలుత బౌలింగ్‌ చేయగా.. ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్‌ అయింది. 

ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి తొమ్మిది వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇక గబ్బా టెస్టుకు ఆరంభం నుంచే వర్షం అంతరాయం కలిగించడం టీమిండియాకు కాస్త అనుకూలించిందని చెప్పవచ్చు.

చదవండి: శెభాష్‌.. గండం నుంచి గట్టెక్కించారు! మీరే నయం

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement