‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్‌ ఫైర్‌ | Abbe Sar Main Kuch Hai: Rohit Sharma Loses Cool At Akash Deep Video Viral | Sakshi
Sakshi News home page

‘నీకసలు మెదడు ఉందా?’.. భారత పేసర్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం!

Published Mon, Dec 16 2024 1:55 PM | Last Updated on Mon, Dec 16 2024 3:29 PM

Abbe Sar Main Kuch Hai: Rohit Sharma Loses Cool At Akash Deep Video Viral

భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహనం కోల్పోయాడు. యువ పేసర్‌ ఆకాశ్‌ దీప్‌ బౌలింగ్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నీకసలు బుర్ర(మెదడు) ఉందా?’’ అంటూ ఆకాశ్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మూడో టెస్టులో పటిష్ట స్థితిలో ఆసీస్‌
బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై ఐదు టెస్టులు ఆడుతోంది. ఇందులో ఇరుజట్లు ఇప్పటికే చెరో విజయం సాధించి 1-1తో సమంగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్‌- ఆసీస్‌ మధ్య శనివారం మొదలైన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు పటిష్ట స్థితిలో కొనసాగుతోంది.

గబ్బా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన రోహిత్‌ సేనకు చేదు అనుభవం ఎదురైంది. తొలి రోజు నుంచే మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... రెండోరోజు ఆట పూర్తయ్యేసరికి ఏడు వికెట్ల నష్టానికి 405 పరుగులు చేసింది.

మొదటి ఇన్నింగ్స్‌లో 445
ఈ క్రమంలో 405/7(101 ఓవర్లు) ఓవర్‌నైట్‌ స్కోరుతో సోమవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టి.. మరో 40 పరుగులు జతచేసింది. ఫలితంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మొత్తంగా 445 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో సోమవారం 114వ ఓవర్లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఆకాశ్‌ దీప్‌ చేతికి బంతినిచ్చాడు. అయితే, 28 ఏళ్ల ఈ పేసర్‌.. ఆసీస్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ క్రీజులో ఉన్న సమయంలో వైడ్‌ బాల్‌ వేశాడు.

సర్‌ మే కుచ్‌ హై?
వేగంగా వచ్చిన ఈ బంతిని ఆపేందుకు టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ చేసిన ప్రయత్నం వృథాగా పోయింది ఫలితంగా ఆసీస్‌ ఖాతాలో అదనపు పరుగులు(2) చేరగా.. సహనం కోల్పోయిన రోహిత్‌ శర్మ.. ఆకాశ్‌ను ఉద్దేశించి..‘‘అబ్బే సర్‌ మే కుచ్‌ హై?(బుర్రలో ఏమైనా ఉందా?)’’ అంటూ కామెంట్స్‌ చేయగా.. స్టంప్‌ మైకులో రికార్డయ్యాయి.

ఇక మూడో రోజు ఆటలో భాగంగా బుమ్రా మరో వికెట్‌ తీయగా.. ఆకాశ్‌ దీప్‌(క్యారీ వికెట్‌), మహ్మద్‌ సిరాజ్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు. మొత్తంగా ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రాకు ఆరు, సిరాజ్‌కు రెండు, ఆకాశ్‌ దీప్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలకు ఒక్కో వికెట్‌ దక్కింది. 

వర్షం వల్ల మూడో రోజు ఆటకు అంతరాయం
కాగా ఆకాశ్‌కు విదేశీ గడ్డపై ఇదే తొలి మ్యాచ్‌. అడిలైడ్‌లో ఆడిన హర్షిత్‌ రాణాపై వేటు పడగా.. అతడి స్థానాన్ని బ్రిస్బేన్‌లో ఆకాశ్‌ భర్తీ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. 

వర్షం వల్ల మూడో రోజు ఆట అర్ధంతరంగా ముగిసిపోయింది. అప్పటికి భారత్‌ 17 ఓవర్లు ఆడి నాలుగు వికెట్ల నష్టానికి 51 పరుగులు చేసింది. ఆసీస్‌ కంటే తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 394 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: ‘రోహిత్‌ శర్మ వెంటనే తప్పుకోవాలి.. అతడిని కెప్టెన్‌ చేయండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement