నాకంటే నీకే బాగా తెలుసు: కోహ్లికి షాకిచ్చిన గంభీర్‌! | Virat Kohli Asks Gambhir About On Field Altercations Left Stumped Video Viral | Sakshi
Sakshi News home page

నాకంటే నీకే బాగా తెలుసు కదా: కోహ్లికి షాకిచ్చిన గంభీర్‌!

Published Wed, Sep 18 2024 3:22 PM | Last Updated on Wed, Sep 18 2024 4:13 PM

Virat Kohli Asks Gambhir About On Field Altercations Left Stumped Video Viral

‘గౌతం గంభీర్‌కు.. విరాట్‌ కోహ్లికి అస్సలు పడదు. ఇక ముందు ముందు ఎలాంటి గొడవలు చూడాల్సి వస్తుందో!?.. కోహ్లికి చెక్‌ పెట్టేందుకు గౌతీ కచ్చితంగా ప్రయత్నాలు చేస్తాడు. కోహ్లి కూడా అందుకు గట్టిగానే బదులిస్తాడు’’... మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ను టీమిండియా హెడ్‌కోచ్‌గా ప్రకటించగానే ఇలాంటి వదంతులు ఎన్నో పుట్టుకొచ్చాయి. 

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లలో గౌతీ- కోహ్లి గొడవపడ్డ ఘటనలు ఇందుకు కారణం. ఆటలో ఇవన్నీ సహజమని.. తాము వాటి గురించి ఎప్పుడో మర్చిపోయామని చెప్పినా రూమర్లు మాత్రం ఆగలేదు. అయితే, ఇలాంటి ప్రచారానికి పూర్తిగా చెక్‌ పెట్టేందుకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఓ వీడియోను షేర్‌ చేసింది. 

ఇందులో గంభీర్‌- కోహ్లి తమ అనుబంధాన్ని చాటేలా ఎన్నో సరదా విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి టీమిండియాకు ఆడిన జ్ఞాపకాలతో పాటు మైదానంలో గొడవపడ్డ సందర్భాలనూ గుర్తు చేసుకున్నారు. వన్డే ప్రపంచకప్‌-2011 ఫైనల్లో ఈ ఇద్దరు ఢిల్లీ బ్యాటర్లు కలిసి బ్యాటింగ్‌ దృశ్యాలతో మొదలైన వీడియో.. వారి మధ్య సంభాషణతో ముగిసింది.

గౌతం గంభీర్‌: ఆస్ట్రేలియాలో నాటి సిరీస్‌(2014-15)లో నువ్వు పరుగులు రాబడుతూనే ఉన్నావు. అంతేకాదు.. ప్రతి డెలివరీకి ముందు ఓం నమఃశివాయ అని స్మరించుకుంటున్నావని నాతో చెప్పావు. ఆరోజు నువ్వలా బ్యాట్‌తో చెలరేగడానికి కారణం అదేనేమో!

నాకు కూడా నేపియర్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో నేను రెండున్నర రోజుల పాటు బ్యాటింగ్‌ చేశాను. అప్పుడంతా హనుమాన్‌ చాలిసా వింటూనే ఉన్నా..

విరాట్‌ కోహ్లి: మీరు చెప్పండి.. బ్యాటింగ్‌ చేస్తున్నపుడు.. ప్రత్యర్థి జట్లు ఆటగాళ్లతో అప్పుడప్పుడూ మాట్లాడేవారు. దాని వల్ల మీ ఏకాగ్రత దెబ్బతినేదా? మీరు అవుటయ్యే వారా?  లేదంటే.. ఎదుటి వారి కవ్వింపు చర్యల వల్ల మీరు మరింత స్ఫూర్తి పొందేవారా?

గౌతం గంభీర్‌: నాకంటే నువ్వే ఎక్కువసార్లు గొడవలు పెట్టుకున్నావు కదా!.. ఈ ప్రశ్నకు నా కంటే నువ్వే సరైన సమాధానం చెప్పగలవు.

విరాట్‌ కోహ్లి(నవ్వుతూ): నేను చెప్పే విషయాలతో ఏకీభవించే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నా. అలా చేయడం(ప్రత్యర్థి రెచ్చగొడితే స్పందించడం) తప్పేమీ కాదు. అయితే, ఆటలో ఇవన్నీ సహజమే అని చెప్పేవారు కనీసం ఒక్కరైనా ఉండాలి(గంభీర్‌ను ఉద్దేశించి).

స్లెడ్జింగ్‌ కారణంగా లాభమే చేకూరింది
కొన్నిసార్లు నేనైతే కావాలనే గొడవలకు దిగేవాడిని. ఆటను రసవత్తరంగా మార్చేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి. అయితే, నన్ను మార్చే అవకాశం ఎవరికీ ఇవ్వను. నిజానికి స్లెడ్జింగ్‌ కారణంగా నాకు నష్టం కంటే లాభమే ఎక్కువ వచ్చింది. అనుకున్న దానికంటే ఎక్కువ పరుగులు స్కోరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మసాలాకు చెక్‌ 
ఇక ఆఖర్లో విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. మేము చాలా దూరమే వచ్చాము. మసాలాకు చెక్‌ పెట్టామనే అనుకుంటున్నాము’’ అని పేర్కొనడం విశేషం. కాగా శ్రీలంకలో వన్డే సిరీస్‌ సందర్భంగా గంభీర్‌ మార్గదర్శనంలో తొలిసారి బరిలో దిగిన కోహ్లి.. సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో మొదలుకానున్న టెస్టు సిరీస్‌లో పాల్గొనున్నాడు. గంభీర్‌కు హెడ్‌కోచ్‌గా ఇదే తొలి టెస్టు సిరీస్‌ కావడం విశేషం.

చదవండి: పాక్‌లో ఐసీసీ బృందం పర్యటన.. టీమిండియా మ్యాచ్‌లు అక్కడేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement