టీమిండియా క్రికెటర్లు ఎవరైనా సరే తమ సహజ శైలిలో చెలరేగుతుంటే... జట్టు వ్యూహాల పేరుతో వారి దూకుడుకు హద్దులు పెట్టబోమని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశాడు. ‘బ్యాటింగ్ కింగ్’ విరాట్ కోహ్లి ఫామ్‌పై తమకెలాంటి ఆందోళనా లేదని, అతని పరుగుల దాహం ఎప్పటికీ తీరదని గంభీర్ తెలిపాడు. అయితే, బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియాకు కఠిన సవాళ్లు తప్పవన్నాడు.
ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్ సిరీస్ సహ కివీస్‌తో టెస్టులు, ఆస్ట్రేలియా పర్యటనలపై గంభీర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. భవిష్యత్తులో జరిగే సిరీస్‌లకంటే ప్రస్తుత సిరీస్‌పైనే తమ దృష్టి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా ఏమన్నాడంటే...
అడ్డు ఎందుకు?
‘‘భారత బ్యాటింగ్‌కు నిర్దిష్టమైన శైలి ఇదని, ఇలాగే ఆడాలనే కచ్చితమైన ప్రణాళికలేమీ లేవు. ఆటగాళ్లు దూకుడుగా ఆడితే ఆడని... చెలరేగితే చెలరేగని ఇందులో అడ్డుకట్టలెందుకు పెట్టాలి. వారి సహజశైలిని వారు కొనసాగించే స్వేచ్ఛ ఇవ్వాలి కదా! గట్టిగా చెప్పాలంటే... మేం ఒక రోజులో 400–500 పరుగులైనా చేయాలనుకుంటాం. తప్పదు అవసరమనుకుంటే రెండు రోజుల పాటు జిడ్డుగా ఆడి ‘డ్రా’ అయినా చేసుకోగలుగుతాం.
ఎందుకంటే కొన్నిసార్లు 100 పరుగులకే ఆలౌటయ్యే ప్రమాదం రావొచ్చు. అప్పుడు క్రీజులో నిలబడే ఓపిక, గంటల తరబడి ఆడే సామర్థ్యం కూడా అవసరం. టీమిండియా ఇలా తయారుకావడమే ముఖ్యం. అప్పుడే దూకుడైన ఆటతో అభిమానులకు మజా దక్కుతుంది.
పరిస్థితులను బట్టే నిర్ణయాలు
ఈ సిరీస్‌లో ఇలా ఆడాలని, ఆ ప్రత్యర్థిని అలా ఎదుర్కోవాలనే ముందస్తు ప్రణాళికలపైనే ఆధారపడటం కుదరదు. వీలును బట్టి, అప్పటి పరిస్థితులు, పిచ్‌లో ఎదురయ్యే సవాళ్లు దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలుంటాయి. దీనికి పక్కా ప్రణాళికంటూ అమలు కాదు... అప్పటి పరిస్థితులే ప్రామాణికం. దాన్నిబట్టే ఆటతీరు మారుతుంది. ఆడే శైలి మరో దశకు చేరుకుంటుంది.
కివీస్‌తో గట్టిపోటీ
న్యూజిలాండ్ సాదాసీదా ప్రత్యర్థి కానేకాదు. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా షాక్‌లు తప్పవు. సొంతగడ్డ అనే అనుకూలతలు, గత సిరీస్ గెలిచాం... ఇదీ గెలుస్తామనే ధీమా తప్పు. బంగ్లాదేశ్‌తో పోల్చితే కివీస్ పూర్తిగా భిన్నమైన ప్రత్యర్థి. ఆ జట్టు గట్టి పోటీ ఇస్తుంది. నాణ్యమైన ఆటగాళ్లు, అనుభవజ్ఞులైన ప్లేయర్లు అందుబాటులో ఉన్నారు.
కాబట్టి ప్రతీ మ్యాచ్‌లోనూ మాకు సవాళ్లు తప్పవు. అయితే ప్రత్యర్థి కివీసా లేదంటే ఆసీసా అని చూడం. జట్టు గెలుపొందడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. వచ్చే నెలలో మొదలయ్యే ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ గురించి ఇప్పుడెందుకు ఆలోచిస్తాం. ఇప్పుడు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్ బెర్తే లక్ష్యంగా కివీస్‌ను ఓడించేపనిలో ఉంటాం .
వరల్డ్‌క్లాస్ ప్లేయర్
కోహ్లిపై నా ఆలోచనలు సుస్పష్టం. అతనో విశ్వవిఖ్యాత క్రికెటర్. సుదీర్ఘకాలంగా గొప్పగా రాణిస్తున్న బ్యాటర్. కోహ్లి అరంగేట్రం చేసినపుడు ఎలాంటి పరుగుల దాహంతో ఉన్నాడో... ఇన్నేళ్లుగా ఆడుతున్నా ఇప్పటికి అలాంటి ఆకలితోనే ఉన్నాడు. కివీస్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో తప్పకుండా రాణిస్తాడనే ఆశిస్తున్నాను.
ఇకపైనా అదే ఆటతీరును ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగిస్తాడనే నమ్మకంతో ఉన్నాను. వరుసగా కొన్ని మ్యాచ్‌ల్లో... లేదంటే ఒకట్రెండు సిరీస్‌లలోనే విఫలమైనంత మాత్రాన అతడిబ్యాటింగ్‌లో సత్తా లేదని కాదు. ఆటగాళ్లు కదా... ఎవరికైనా వైఫల్యాలు సహజం. అలాగే వాటిని అధిగమించడం కూడా జరుగుతుంది’’ అని గంభీర్ పేర్కొన్నాడు.
చదవండి: మళ్లీ శతక్కొట్టాడు: ఆసీస్‌తో టెస్టులకు టీమిండియా ఓపెనర్‌గా వస్తే!
Comments
Please login to add a commentAdd a comment