దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టీమిండియా టెస్టు బరిలో దిగనుంది. సొంతగడ్డపై సెప్టెంబరు 19 నుంచి బంగ్లాదేశ్‌తో సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్‌కు చెన్నైలోని ఎంఏ చిదంబరం(చెపాక్) స్టేడియం వేదిక. ఈ నేపథ్యంలో ఇప్పటికే తమిళనాడుకు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్ మొదలుపెట్టింది.
సీనియర్లంతా వచ్చేశారు
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా శుక్రవారం నాటి నెట్ సెషన్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసిన కోహ్లి
కాగా శ్రీలంక పర్యటన ముగిసిన తర్వాత లండన్ వెళ్లిపోయిన విరాట్ కోహ్లి.. నెల రోజుల తర్వాత మళ్లీ ఇప్పుడే మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. వచ్చీ రాగానే యాక్షన్‌లో దిగాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ సమక్షంలో కోహ్లి తొలి రోజు దాదాపుగా 45 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసినట్లు సమాచారం.
మూడేళ్ల తర్వాత తాను తొలిసారిగా చెన్నైలో తొలి టెస్టు ఆడనున్న నేపథ్యంలో.. అభిమానులను ఆకట్టుకోవాలనే ఉద్దేశంతో కోహ్లి ఇలా తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా చెపాక్ స్టేడియంలో కోహ్లికి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు టెస్టులు ఆడిన ఈ ఢిల్లీ బ్యాటర్... ఒక సెంచరీ సాయంతో 267 పరుగులు చేశాడు.
టీమిండియాతో చేరిన మోర్నీ మోర్కెల్
నూతన బౌలింగ్ కోచ్, సౌతాఫ్రికా మాజీ పేసర్ మోర్నీ మోర్కెల్ టీమిండియాతో చేరాడు. హెడ్‌కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్‌లు అభిషేక్ నాయర్, డష్కాటేలతో కలిసి రోహిత్ సేన ప్రాక్టీస్‌ను గమనించాడు. కాగా స్వదేశంలో ఓ సిరీస్‌కు ముందు భారత జట్టు వారం రోజుల పాటు ట్రెయినింగ్ క్యాంపులో పాల్గొనడం ఇదే తొలిసారి.
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, జస్‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.
బంగ్లాదేశ్ టెస్టు జట్టు:
నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్‌మన్ ఇస్లామ్, జాకీర్ హసన్, మోమినుల్, ముష్ఫికర్, షకీబుల్ హసన్, లిటన్ దాస్, మెహదీ హసన్ మిరాజ్, జాకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, నహిద్ రాణా, తైజుల్ ఇస్లామ్, మెహమూదుల్ హసన్, నయీమ్, ఖాలిద్ అహ్మద్.
చదవండి: నా కుమారుడికి అవకాశాలు ఇస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment