టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పేరు ఖరారైందని గత కొద్ది రోజులుగా సోషల్‌మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగిన విషయం విధితమే. అయితే ఈ ప్రచారంలో వాస్తవం కొంతమాత్రమే ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తాజా స్టేట్‌మెంట్‌ను బట్టి తెలుస్తుంది.
భారత్ హెడ్ కోచ్ రేసులో ఇద్దరు ఉన్నట్లు షా పేర్కొన్నాడు. షా చెప్పిన మాటల ప్రకారం గంభీర్‌తో పాటు మరో వ్యక్తి (డబ్ల్యూవీ రామన్) భారత హెడ్ కోచ్ పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తుంది.
కొత్త హెడ్ కోచ్ అంశంపై మాట్లాడుతూ షా మరిన్ని విషయాలను కూడా రివీల్ చేశాడు. కొత్తగా ఎంపిక కాబోయే కోచ్ ఈ నెల (జులై) చివర్లో ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్ నుంచి బాధ్యతలు చేపడతాడని తెలిపాడు. అలాగే ఈనెల (జులై) 6 నుంచి ప్రారంభం కాబోయే జింబాబ్వే టీ20 సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరిస్తాడని షా పేర్కొన్నాడు.
కాగా, ప్రస్తుత టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్‌తో ముగిసిన విషయం తెలిసిందే. ద్రవిడ్‌కు హెడ్ కోచ్ పదవిలో కొనసాగే ఇష్టం లేకపోవడంతో బీసీసీఐ కొత్త అభ్యర్దుల వేటలో పడింది. ఐపీఎల్ పెర్పార్మెన్స్ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో గంభీర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) కూడా గంభీర్‌వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
మరోవైపు ఈ నెల 6వ తేదీ నుంచి టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని టీమిండియాను ఇదివరకే ఎంపిక చేశారు. జింబాబ్వే పర్యటన అనంతరం భారత జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో 3 టీ20లు, 3 వన్డేలు జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment