నువ్వా నేనా..? | England Women face Australia in womens tri series final | Sakshi
Sakshi News home page

నువ్వా నేనా..?

Published Fri, Mar 30 2018 10:46 PM | Last Updated on Fri, Mar 30 2018 10:54 PM

England Women face Australia in womens tri series final - Sakshi

ముంబై: భారతగడ్డపై వారంరోజులపాటు జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్‌ మహిళాజట్టుతో ఆస్ట్రేలియా తలపడనుంది. లీగ్‌దశలో తాను ఆడిన చివరిరెండు మ్యాచ్‌ల్లో దూకుడు ప్రదర్శించిన ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఈ టోర్నీలో ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ స్థిరంగానే రాణించింది. బేత్‌ మూనీ, అలీసా హీలీ, కెప్టెన్‌ మెగ్‌ ల్యానింగ్, ఎలీసా విలానీ, ఎలీసా పెర్రీలు బ్యాట్‌తో ఆకట్టుకున్నారు. 

తమదైన రోజున ఏ బౌలింగ్‌ విభాగాన్నైనా వీరు సమర్థంగా ఎదుర్కొనగలరు. ముఖ్యంగా లీగ్‌ తొలిగేమ్‌లో విఫలమైన ల్యానింగ్‌ ప్రస్తుతం మంచి టచ్‌లో ఉంది. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే మెగన్‌ ష్కట్‌ అద్భుతంగా రాణిస్తోంది. ఇంగ్లండ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపాలంటే ష్కట్‌ స్థాయికి తగ్గట్లుగా రాణించాల్సి ఉంది. తనకు పేసర్‌ దిలీసా కిమిన్స్, స్పిన్నర్లు ఆష్లే గార్డెనర్, జోనాసెన్‌ల నుంచి సహకారం లభించాల్సి ఉంది. మరోవైపు ఫీల్డింగ్‌ విభాగం మెరుగుపడాలి. టోర్నీలో ఆసీస్‌ ప్లేయర్లు చాలా క్యాచ్‌ల్ని జారవిడిచారు.  

ఇక ఇంగ్లండ్‌ విషయానికొస్తే రెండు వరుస విజయాలతో టోర్నీలో శుభారంభం చేసింది. ఇందులో భారత్‌పై చేసిన 199 పరుగుల ఛేదన అద్భుతమనడంలో సందేహంలేదు. అయితే అనంతరం జోరు కొనసాగించడంలో ఇంగ్లిష్‌జట్టు విఫలమైంది. చివరిరెండు మ్యాచ్‌ల్లో ఆసీస్, భారత్‌ చేతిలో ఘోర పరాజయాలు పాలైంది. ముఖ్యంగా 97, 107 పరుగులకే ఇంగ్లిష్‌ జట్టు బోల్తాపడడం ఆ జట్టు యాజమాన్యానికి ఆందోళన కలిగిస్తోంది. 

ఈక్రమంలో ఈ మ్యాచ్‌లో సత్తాచాటి విజేతగా నిలివాలని ఇంగ్లండ్‌ కోరుకుంటోంది. ఓపెనర్‌ డేనియెలి వ్యాట్‌పైనే బ్యాటింగ్‌ భారం ఉంది. తను ఈ మ్యాచ్‌లో సత్తాచాటాల్సిన అవసరముంది. తనతోపాటు నటాఈ స్కివర్, తమ్సిమ్‌ బీమంట్, కెప్టెన్‌ హీథర్‌ నైట్‌లు ఆకట్టుకోవాలి. కేటీ జార్జ్, టాష్‌ ఫర్రంట్, జేనీ గన్‌లపై ఇంగ్లండ్‌ బౌలింగ్‌ విభాగం ఆధారపడి ఉంది.  

జట్లు 
ఆస్ట్రేలియా: ల్యానింగ్‌ (కెప్టెన్‌), రేచల్‌ హేన్స్, నికోలా కారే, గార్డెనర్, హీలీ, జోనాసెసన్, కిమిన్స్, సోఫీ మోలినెక్స్, మూనీ, పెర్రీ, ష్కట్, స్టేల్‌బర్గ్, విలానీ, వెల్లింగ్టన్‌. 
ఇంగ్లండ్‌: నైట్‌ (కెప్టెన్‌), బీమంట్, డేవిడ్సన్, ఎకిల్‌స్టోన్, ఫర్రంట్, కేటీ, గన్, హర్ట్‌లీ, హెల్, అమీ జోన్స్, ఆన్య ష్రబ్‌సోల్, స్కివర్, విల్సన్, వాయ్‌ట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement