
10 ఓవర్లు.. 3 మెయిడెన్లు.. 4 వికెట్లు
విశాఖపట్నం: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల జట్టు 2-0 గెల్చుకుంది. ఇక్కడి వైఎస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 47.1 ఓవర్లలో 140 పరుగులు చేసింది.
హైదరాబాద్ అమ్మాయి గౌహర్ సుల్తానా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేసింది. 10 ఓవర్లలో 3 మెయిడెన్లు వేసి 15 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టింది. తొలి వన్డేలో 8 ఓవర్లలో 4 మెయిడెన్లు వేసి 4 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకోవడం విశేషం.
లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 39.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. మంధన 51, రౌత్ 38, కెప్టెన్ మిథాలీ రాజ్ 31 పరుగులతో రాణించారు. ఇదే వేదికపై ఆదివారం జరిగిన తొలి వన్డేలోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది.