♦ ఆటగాళ్లను విమర్శించడం మానండి
♦ సునీల్ ఛెత్రి సూచన
సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదని, మన వద్ద అలాంటి పక్కా వ్యవస్థ లేదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అభిప్రాయ పడ్డాడు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎంత మందికి సరైన శిక్షణ లభిస్తోందని అతను ప్రశ్నించాడు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియాస్ పొటెన్షియల్ యాజ్ ఎ స్పోర్టింగ్ నేషన్’ అనే అంశంపై బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో ఛెత్రితో పాటు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, మిథాలీరాజ్ పాల్గొన్నారు. మాజీ రంజీ క్రికెటర్ విజయ్ మోహన్ రాజ్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
మనోళ్లు ఓడిపోయారా...ఒలింపిక్స్‌లో మూడే పతకాలా అనే విమర్శించేవారు వాస్తవాలు గుర్తించాలని ఛెత్రి అన్నాడు. తమ తల్లిదండ్రులు పిల్లల జీవితంలో ఆటలు భాగంగా చేయనంత కాలం ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా తాము ఎదిగేందుకు పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. తాను ఆటను ఆరంభించినప్పుడు తన తల్లిదండ్రులు మినహా ఎవరూ ప్రోత్సహించలేదని, ఇప్పటికీ ఆటల పట్ల చాలా మందిలో చులకనభావం ఉందని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ మరిన్ని పతకాలు సాధించాలంటే వ్యవస్థ ఇంకా పక్కాగా ఉండాలని అశ్విని సూచించింది.
మిథాలీరాజ్ మాట్లాడుతూ... బీసీసీఐ మహిళా క్రికెట్‌ను తీసుకోక ముందే తాను ఎన్నో ఘనతలు సాధించానని, చిన్నప్పటినుంచి ఆటపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తు చేసుకుంది. తాము ఆడినప్పుడు బాలికల ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలు ఉండేవని, ఇప్పుడు బోర్డు చేతుల్లోకి వచ్చినా అమ్మాయిలకు తగినన్ని మ్యాచ్‌లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. చాంపియన్ ఆటగాళ్లను గౌరవించాలని, వారు పడిన శ్రమను గుర్తించాలని ఈ సందర్భంగా ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. శాప్ ఎండీ రేఖారాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
క్రీడా వాతావరణం పెరగాలి
Published Thu, Aug 6 2015 1:47 AM | Last Updated on Sun, Sep 3 2017 6:50 AM
Advertisement