Sunil chetri
-
థ్రిల్లింగ్ మ్యాచ్ అనంతరం తన్నుకున్న భారత్, అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు
ఏఎఫ్సీ ఆసియాకప్ క్వాలిఫయింగ్‌లో భాగంగా భారత్, అఫ్గానిస్తాన్ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ యుద్ద వాతావరణాన్ని తలపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరినొకరు తోసుకుంటూ.. తిట్టుకుంటూ కొట్టుకునే స్థాయికి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. కోల్‌కతాలోని వీఐబీకే స్టేడియంలో శనివారం రాత్రి భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో సునీల్ చెత్రీ సేన(టీమిండియా) 2-1 తేడాతో అఫ్గానిస్తాన్‌పై విజయం సాధించింది. ఆఖరి వరకు డ్రా దిశగా సాగిన ఈ మ్యాచ్‌లో 85వ నిమిషంలో భారత్‌కు వచ్చిన ఫ్రీకిక్ గోల్ అవకాశాన్ని సునీల్ చెత్రీ చక్కగా ఉపయోగించుకున్నాడు. తన మ్యాజిక్‌తో మ్యాచ్‌లో భారత్ తొలి గోల్ చేసి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే అఫ్గన్స్ కూడా ధీటుగా బదులిచ్చారు. ఆట 88వ నిమిషంలో అఫ్గన్ మిడ్ ఫీల్డర్ జుబైర్ అమిరి హెడర్ గోల్ చేశాడు. దీంతో నిర్ణీత సమయం ముగిసేసరికి ఇరుజట్లు 1-1తో ఉన్నాయి. అదనపు సమయంలో భారత్ స్ట్రైకర్ సాహల్ అబ్దుల్ సమద్ సూపర్ గోల్ కొట్టడంతో భారత్ 2-1తో ఆధిక్యంలో వెళ్లడంతో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓడిపోయామన్న బాధను అఫ్గన్ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోయారు. పెవిలియన్ వెళ్తున్న ఇద్దరు భారత ఆటగాళ్ల వైపు దూసుకొచ్చిన అఫ్గన్ ఆటగాళ్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. చీటింగ్ చేసి మ్యాచ్ గెలిచారంటూ అసహనం వ్యక్తం చేశారు. దీనికి భారత్ ఆటగాళ్లు కూడా కౌంటర్ ఇవ్వడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన భారత్ గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సర్ది చెప్పాలని చూడగా అతన్ని కూడా తోసేశారు. ఇలా చూస్తుండగానే పెద్దదిగా మారిన గొడవ పతాక స్థాయికి చేరుకుంది. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిని ఒకరు తోసుకుంటూ కొట్టుకున్నంత పని చేశారు. ఈ క్రమంలో ఇదంతా గమనించిన ఆసియన్ ఫుట్‌బాల్ కాన్ఫిడరేషన్(ఏఎఫ్సీ) అధికారులు గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చి ఆటగాళ్లను విడదీసి అక్కడి నుంచి పంపించేశారు. అయితే ఏఎఫ్సీ గొడవకు కారణమేంటి.. ఇందులో తప్పెవరిది.. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం కొసమెరుపు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోపై అత్యాచారం కేసు.. కోర్టు కీలక తీర్పు ఓవైపు భారత్, సౌతాఫ్రికా మ్యాచ్.. స్టేడియంలో కొట్టుకు చచ్చిన అభిమానులు -
బెంగళూరును గెలిపించిన ఛెత్రి
బంబోలిమ్ (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) తొలి విజయం నమోదు చేసింది. చెనైయిన్ ఎఫ్‌సీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 56వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి గోల్‌గా మలిచి బెంగళూరును 1–0తో ఆధిక్యంలో నిలిపాడు. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు గెలుపు బోణీ కొట్టింది. నేడు జరిగే మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునైటెడ్‌తో ఈస్ట్ బెంగాల్ తలపడతుంది. -
‘ఆ ఇన్నింగ్స్’ ఆడాలనుంది!
క్రికెటర్‌గా కెరీర్‌ను ఎంచుకోవడం, తనపై తండ్రి ప్రభావం, ఫిట్నెస్, పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోపై అభిమానం, సీనియర్లు సచిన్, వార్న్‌ల గురించి...ఇలా పలు అంశాలపై భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రితో విరాట్ కోహ్లి తన మనసు విప్పి మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే... నాన్న చేసిన పని... నేను క్రికెట్ ఆడటం ప్రారంభించిన కొత్తలో ఒక జట్టులో చోటు దక్కలేదు. ప్రతిభకు లోటు లేదు కానీ లంచం ఇస్తేనే జట్టులోకి తీసుకుంటానని కోచ్ చెప్పాడు. మా అబ్బాయి సత్తా ఉంటే ఆడతాడు లేదంటే తప్పుకుంటాడు తప్ప నేను అలాంటి తప్పుడు పని చేయను అంటూ నాన్న కోచ్ ప్రతిపాదనను తిరస్కరించాడు. చోటు దక్కనందుకు ఆ రోజు చాలా బాధపడ్డాను కానీ తర్వాత వాస్తవం తెలిసింది. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన నాన్న తర్వాత లాయర్‌గా మారారు. ఆయన నేర్పిన పాఠాలే నేను జీవితంలో ఎదిగేందుకు పనికొచ్చాయి. ఇప్పటికీ నాటి ఘటనను నేను సానుకూలంగానే చూస్తాను. నా 18 ఏళ్ల వయసులో ఆయన అకస్మాత్తుగా చనిపోయారు. బతికుంటే ఆయనను చాలా బాగా చూసుకునేవాడినని మాత్రం అనిపిస్తుంది. నేను పశ్చిమ ఢిల్లీలో పుట్టి పెరిగాను. ఎప్పుడూ మూలాలు మరచిపోను. అక్కడి మిత్రులు కలిస్తే అప్పుడు ఎలా మాట్లాడుకునేవాళ్లమో అదే భాషతో వారితో మాట్లాడతాను తప్ప గొప్పలు ప్రదర్శించను. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంపై... నేను ఆటను మొదలు పెట్టినప్పుడు సీరియస్‌గా లేను. నాకు క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఆడతానని మాత్రమే చెప్పాను. సన్నిహితులు కూడా నాకు కోచింగ్ ఇప్పిస్తే బాగుంటుందని నాన్నకు చెప్పారు. జూనియర్ స్థాయిలో టీమ్‌లకు ఆడుతూ వచ్చినప్పుడు కొంత ధైర్యం వచ్చింది. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు అండర్–19 జట్టు సభ్యుడిగా తొలిసారి ఇంగ్లండ్ పర్యటించాను. అక్కడి ప్రదర్శన నాకు స్ఫూర్తినిచ్చింది. ఇకపై సమయం వృథా చేయదల్చుకోలేదు. ముందుకెళ్లాలని నిశ్చయించుకున్నాను. వైఫల్యాల గురించి భయపడలేదు. ఫిట్నెస్ కీలకం... నేను ఇప్పుడు ఇంత ఫిట్‌గా ఉన్నానంటే ఒకే ఒక్కడు కారణం. భారత జట్టుకు స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా పని చేసిన శంకర్ బసు నన్ను పూర్తిగా మార్చేశారు. ఇప్పుడు నాకు సంబంధించి అన్నింటికంటే ఫిట్‌నెస్సే కీలకం. నా కెరీర్ ఒక్కసారిగా మారిపోవడానికి ఇది కూడా కారణం. ఆయన నాకు కొత్త తరహా ఎక్సర్సైజ్లు నేర్పించారు. వెన్నునొప్పితో అలాంటివేమీ నేను చేయలేనని అనుకునేవాడిని. కానీ అన్నీ సాధ్యమయ్యాయి. జాతీయ జట్టు తరఫున ఆడినంత కాలం ఇంతే బలిష్టంగా ఉండాలి. అందుకోసం కష్టపడాలి. లేదంటే పక్కకు తప్పుకోవాలి. రొనాల్డోను అభిమానించడంపై... మైదానంలో క్రిస్టియానో రొనాల్డో చూపించే దూకుడంటే నాకు చాలా ఇష్టం. ఒంటి చేత్తో అతను మ్యాచ్ ఫలితాన్ని మార్చగల తీరు అద్భుతం. చాంపియన్స్ లీగ్‌లో అతను యువెంటస్ తరఫున ఆడుతున్నప్పుడు ఆ జట్టు 0–2తో ఒక మ్యాచ్‌లో ఓడిపోయింది. అట్లెటికో మాడ్రిడ్‌తో జరిగిన తర్వాతి మ్యాచ్‌కు ముందు అతను తన కుటుంబ సభ్యులను అందరినీ మ్యాచ్‌కు రమ్మని చెప్పి మీరో అద్భుతం చూడబోతున్నారని ముందే చెప్పేశాడు. ఆ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి హ్యాట్రిక్‌తో జట్టును గెలిపించాడు. ఆ తరహా దూకుడు నాకు స్ఫూర్తినిస్తుంది. సచిన్ ఇన్నింగ్స్... అంతర్జాతీయ క్రికెట్లో నేను కూడా అలాంటి ఇన్నింగ్స్ ఒకటి ఆడితే బాగుండేది అనిపించే మ్యాచ్ సచిన్ టెండూల్కర్ ‘ఇసుక తుఫాన్’. ఫైనల్‌కు అర్హత సాధించే క్రమంలో 1998లో షార్జాలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతని సెంచరీ అత్యద్భుతం. చివరి బంతికి షేన్ వార్న్ లేదా వకార్ యూనిస్‌లలో ఒకరిని ఎదుర్కోవాల్సి వస్తే... మ్యాచ్ ఆఖరి బంతిని మూడు పరుగులు చేస్తే గెలవాల్సిన స్థితి ఉంటే వీరిలో వకార్‌నే ఎంచుకుంటా. యార్కర్లను బాగా ఆడటంలో నా సామర్థ్యంపై నాకు నమ్మకముంది. అలా అని వార్న్ అంటే భయమేమీ లేదు. అతను ఎప్పుడూ డెత్ ఓవర్లలో పెద్దగా బౌలింగ్ చేసింది లేదు. ఐపీఎల్లో అతడిని ఎదుర్కొన్నప్పుడు కూడా అనూహ్యమేమీ జరగలేదు. వార్న్ నన్ను అవుట్ చేయలేదు. నేను అతడి బౌలింగ్‌ను చితక్కొట్టలేదు కూడా. ఒకసారి మ్యాచ్ ముగిసిన తర్వాత నా వద్దకు బౌలర్‌కు ఎప్పుడూ మాటల్లో జవాబివ్వవద్దని అతను చెప్పాడు. కానీ నేనేమీ ఆ సూచనను పట్టించుకోలేదు. -
బెంగళూరును గెలిపించిన సునీల్ చెత్రి
బెంగళూరు: ఎఫ్‌సీ గోవాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్‌తో (59వ, 84వ నిమిషాల్లో) మెరిశాడు. దీంతో ఇండియన్ సూపర్ లీగ్ సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఎఫ్‌సీ 2–1 గోల్స్ తేడాతో గోవాపై నెగ్గింది. గోవా తరఫున హ్యూగో (61వ నిమిషంలో) గోల్ సాధించాడు. నేటి మ్యాచ్‌లో ముంబై సిటీ ఎఫ్‌సీతో అట్లెటికో డి కోల్‌కతా తలపడుతుంది. -
ప్రియమైన భారత్... ఇది నా జట్టు...
న్యూఢిల్లీ: ‘ఫిఫా’ 2022 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఖతర్‌ను నిలువరించడం పట్ల భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. దోహాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్ 0–0తో డ్రాగా ముగిసింది. భారత్‌కు ఒక పాయింట్ లభించింది. జ్వరం కారణంగా ఛెత్రి ఈ మ్యాచ్ ఆడకున్నా మన జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో మెరుగైన, ఆసియా చాంపియన్ ఖతర్‌ను నిలువరించింది. దీనిపై ఛెత్రి స్పందిస్తూ... ‘ప్రియమైన భారత్, ఇది నా జట్టు, వీళ్లు నా కుర్రాళ్లు. గర్వకారణ ఈ క్షణాలను మాటల్లో వరి్ణంచలేను. పాయింట్ల పట్టిక ప్రకారం ఇది పెద్ద ఫలితం కాకపోవచ్చు. పోరాటంలో దేనికీ తీసిపోదు. జట్టు, కోచింగ్ సిబ్బందిదే ఈ ఘనతంతా’ అని ట్వీట్ చేశాడు. ఖతర్‌తో మ్యాచ్‌లో భారత్‌కు గోల్ కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధు సారథ్యం వహించాడు. ప్రత్యర్థి గోల్ ప్రయత్నాలను అతడు సమర్థంగా అడ్డుకున్నాడు. కోచ్ ఇగర్ స్టిమాక్ సైతం ఈ ఫలితంతో పట్టరాని సంతోషంతో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఆడాలని కుర్రాళ్లకు సూచించాడు. -
9 నిమిషాల్లో...ఆధిక్యంనుంచి ఓటమికి...
గువాహటి: చివరి నిమిషాల్లో అలసత్వం ప్రదర్శించిన భారత డిఫెండర్లు భారత్‌కు అద్భుత విజయాన్ని దూరం చేశారు. 81వ నిమిషం వరకు 1–0తో ఆధిక్యంలో ఉన్న భారత్ చివరి 9 నిమిషాల్లో ప్రత్యర్థి ముందు తలవంచింది. దీంతో ఇక్కడి ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గురువారం జరిగిన ‘ఫిఫా’ వరల్డ్ కప్–2022 రెండో అంచె అర్హత మ్యాచ్‌లో భారత్ 1–2తో ఒమన్ చేతిలో ఓడింది. ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ రెండు గోల్స్ (82, 90వ నిమిషాల్లో) చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. భారత్ తరఫున సారథి సునీల్ ఛెత్రీ 24వ నిమిషంలో గోల్ చేశాడు. ఆరంభంలో మెరిశారు... చివర్లోతలవంచారు ర్యాంకింగ్స్‌లో తన కంటే మెరుగైన దేశంతో ఆడుతున్నా భారత్ అది ఎక్కడా కనిపించకుండా ఆడింది. మొదటి నిమిషం నుంచే బంతిపై పూర్తి నియంత్రణతో... ప్రత్యర్థికి బంతిని చిక్కనివ్వకుండా కళాత్మక పాస్‌లతో అదరగొట్టింది. 15వ నిమిషంలో గోల్ చేసే అవకాశాన్ని భారత ఆటగాడు ఉదంత సింగ్ జారవిడిచాడు. సునీల్ ఛెత్రీ అందించిన పాస్‌ను అందుకున్న అతను ప్రత్యర్థి రక్షణశ్రేణిని, కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ బంతిని గోల్‌పోస్టులోకి కొట్టాడు. కానీ అది గోల్‌పోస్టు బార్‌ను తగిలి దూరంగా పడటంతో భారత్ ఖాతా తెరవలేదు. అయితే 24వ నిమిషంలో ఫ్రీ కిక్ ద్వారా బ్రెండన్ ఫెర్నాండెజ్ అందించిన పాస్‌ను అందుకున్న ఛెత్రీ ఎటువంటి పొరపాటు చేయకుండా ప్రత్యర్థి గోల్ పోస్టులోకి పంపి భారత్‌కు 1–0 ఆధిక్యాన్ని అందించాడు. దీంతో 22 వేల మంది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. అనంతరం దూకుడు పెంచిన ఒమన్ భారత గోల్ పోస్టుపైకి పదేపదే దాడులు చేసింది. 43వ నిమిషంలో ఒమన్ ఆటగాడు అహ్మద్ కనో కొట్టిన హెడర్‌ను భారత గోల్ కీపర్ అద్భుతంగా అడ్డుకున్నాడు. రెండో అర్ధభాగం చివర్లో భారత ఢిపెండర్ల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకున్న ఒమన్ మిడ్‌ఫీల్డర్ రబియా అల్వై అల్ మందర్ 82వ నిమిషంలో గోల్ చేసి స్కోర్‌ను సమం చేశాడు. మరో 7 నిమిషాల అనంతరం రబియా భారత గోల్ కీపర్‌కు దొరక్కుండా కళ్లు చెదిరే షాట్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి ఒమన్‌కు విజయాన్ని ఖరారు చేశాడు. -
55 ఏళ్ల తర్వాత...
అబుదాబి: స్టార్ స్ట్రయికర్ సునీల్ చెత్రి (27వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలో భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ 1964 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ చెత్రి రెండు గోల్స్ చేయగా... అనిరుధ్ థాపా (68వ ని.లో), జెజె లాల్‌పెఖుల (80వ ని.లో) చెరో గోల్ చేశారు. థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా (33వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని చెత్రి గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. మరో ఆరు నిమిషాల్లోనే థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా గోల్ కొట్టడంతో స్కోరు 1–1తో సమం అయింది. రెండో అర్ధభాగం ప్రారంభ నిమిషంలోనే సునీల్ చెత్రి మెరుపు వేగంతో ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అనిరుధ్, జెజె లాల్‌పెఖుల గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యంతో భారత్ మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సునీల్ చెత్రి (66 గోల్స్) అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్రస్తుత క్రీడాకారుల జాబితాలో లియోనెల్ మెస్సీని (అర్జెంటీనా–65 గోల్స్) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–85 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ 10న ఆతిథ్య యూఏఈతో... 14న బహ్రెయిన్‌తో ఆడనుంది. ఈ రెండింటిలో ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నా భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఆసీస్‌కు షాక్... మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఆసియా కప్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్ 0–1తో అనామక జోర్డాన్ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను అనస్ బనీ యాసీన్ (26వ ని.లో) చేశాడు. -
సునీల్ చెత్రికి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు
అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ప్రకటించిన 2017 వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్, సాకర్ స్టార్ సునీల్ చెత్రి ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. బైచుంగ్ భూటియా తర్వాత వంద అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాడిగా ఈ స్ట్రయికర్ ఘనత వహించిన సంగతి తెలిసిందే. మహిళల కేటగిరీలో ఈ అవార్డు మణిపూర్‌కు చెందిన కమలా దేవికి దక్కింది. ఇటీవల జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో రాణించిన అనిరుధ్ థాపా ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డుకు ఎంపికయ్యాడు. -
భారత్ ప్రతీకార పోరు
నేడు అఫ్ఘానిస్తాన్‌తో ఫైనల్ * శాఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ * సాయంత్రం గం. 6.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నమెంట్ తుది పోరులో నేడు (ఆదివారం) భారత జట్టు అఫ్ఘానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమి లేకుండా కొనసాగుతున్న తమ జోరును తుది పోరులోనూ సాగించాలనే ఆలోచనలో భారత్ ఉంది. అయితే అఫ్ఘాన్ రూపంలో భారత్ ఈ మ్యాచ్‌లో గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది. నేపాల్‌లో జరిగిన చివరి(2013) ఎడిషన్‌లో తమను ఓడించి చాంపియన్‌గా అవతరించిన అఫ్ఘాన్‌పై బదులు తీర్చుకునేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ పోటీల్లో తీవ్రంగా నిరుత్సాహపరిచిన సునీల్ చెత్రి సేన ఈ విజయంతో అభిమానులను ఊరట పరచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత జట్టును ఆసియాలో రోజురోజుకూ పుంజుకుంటున్న అఫ్ఘాన్ జట్టు ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి. స్వదేశంలో జరిగిన 2011 టోర్నీ ఫైనల్లో భారత్ 4-0తో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఇందులో సునీల్ చెత్రి హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. అయితే రెండేళ్ల అనంతరం ఖాట్మండూలో జరిగిన శాఫ్ కప్ ఫైనల్లో అఫ్ఘాన్ జట్టు 2-0తో బదులు తీర్చుకుంది. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో చెత్రి, జేజే, రాబిన్ సింగ్, అర్నాబ్, సుబ్రతా పాల్ మాత్రమే ఇప్పుడున్నారు. చెత్రి, జేజే ఫామ్‌తో పాటు 18 ఏళ్ల చాంగ్టే ప్రదర్శన లాభిస్తోంది. మిడ్ ఫీల్డ్‌లో రౌలిన్ బోర్గెస్, లింగ్డో కీలకంగా ఉన్నారు. ఇదిలావుండగా అఫ్ఘాన్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కోచ్ స్టీఫెన్ కాన్స్టాంటైన్ ఇప్పటికే ఆ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టులోని 15 మంది ఆటగాళ్లలో చాలా మంది యూరప్‌లో ఆడినవారే. ఆసియా, యూరప్ ఆటగాళ్ల మధ్య చాలా తేడా ఉంటుందని, ఇది ఫలితంపై ప్రభావం చూపిస్తుందని కోచ్ భావిస్తున్నారు. -
ముంబైని గెలిపించిన చెత్రి
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ముంబై ఫుట్‌బాల్ క్లబ్ (ఎఫ్‌సీ) జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సొంతగడ్డపై స్థానిక డీవై పాటిల్ స్టేడియంలో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముంబై 2-0 గోల్స్ తేడాతో ఢిల్లీ డైనమోస్ జట్టును ఓడించింది. భారత కెప్టెన్ సునీల్ చెత్రి రెండు గోల్స్ చేసి ముంబై విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఆట 13వ నిమిషంలో తొలి గోల్ చేసిన చెత్రి, 74వ నిమిషంలో రెండో గోల్ అందించాడు. నాలుగు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ముంబై ఒక మ్యాచ్‌లో నెగ్గి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని, రెండింటిలో ఓడిపోయింది. గురువారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో గోవా ఎఫ్‌సీ తలపడుతుంది. -
క్రీడా వాతావరణం పెరగాలి
♦ ఆటగాళ్లను విమర్శించడం మానండి ♦ సునీల్ ఛెత్రి సూచన సాక్షి, హైదరాబాద్ : మన దేశంలో ఒక ఆటగాడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదని, మన వద్ద అలాంటి పక్కా వ్యవస్థ లేదని భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అభిప్రాయ పడ్డాడు. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఎంత మందికి సరైన శిక్షణ లభిస్తోందని అతను ప్రశ్నించాడు. యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘ఇండియాస్ పొటెన్షియల్ యాజ్ ఎ స్పోర్టింగ్ నేషన్’ అనే అంశంపై బుధవారం జరిగిన చర్చా కార్యక్రమంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ కార్యక్రమంలో ఛెత్రితో పాటు గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప, మిథాలీరాజ్ పాల్గొన్నారు. మాజీ రంజీ క్రికెటర్ విజయ్ మోహన్ రాజ్ దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. మనోళ్లు ఓడిపోయారా...ఒలింపిక్స్‌లో మూడే పతకాలా అనే విమర్శించేవారు వాస్తవాలు గుర్తించాలని ఛెత్రి అన్నాడు. తమ తల్లిదండ్రులు పిల్లల జీవితంలో ఆటలు భాగంగా చేయనంత కాలం ఇలాంటి ఫలితాలే వస్తాయని అన్నాడు. మిగతా ఆటగాళ్లు కూడా తాము ఎదిగేందుకు పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. తాను ఆటను ఆరంభించినప్పుడు తన తల్లిదండ్రులు మినహా ఎవరూ ప్రోత్సహించలేదని, ఇప్పటికీ ఆటల పట్ల చాలా మందిలో చులకనభావం ఉందని జ్వాల ఆవేదన వ్యక్తం చేసింది. భారత్ మరిన్ని పతకాలు సాధించాలంటే వ్యవస్థ ఇంకా పక్కాగా ఉండాలని అశ్విని సూచించింది. మిథాలీరాజ్ మాట్లాడుతూ... బీసీసీఐ మహిళా క్రికెట్‌ను తీసుకోక ముందే తాను ఎన్నో ఘనతలు సాధించానని, చిన్నప్పటినుంచి ఆటపై దృష్టి పెట్టడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తు చేసుకుంది. తాము ఆడినప్పుడు బాలికల ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నీలు ఉండేవని, ఇప్పుడు బోర్డు చేతుల్లోకి వచ్చినా అమ్మాయిలకు తగినన్ని మ్యాచ్‌లు లేకపోవడం దురదృష్టకరమన్నారు. చాంపియన్ ఆటగాళ్లను గౌరవించాలని, వారు పడిన శ్రమను గుర్తించాలని ఈ సందర్భంగా ఆటగాళ్లు విజ్ఞప్తి చేశారు. శాప్ ఎండీ రేఖారాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఆగస్టు 3న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునిల్ ఛెత్రి (పుట్‌బాల్ క్రీడాకారుడు), వాణిశ్రీ (నటి) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 1. ఇది సూర్యునికి సంబంధించిన సంఖ్య. దీనివల్ల ధైర్యం, సహనం, కొత్త ఆలోచనలు, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల అంకిత భావం కలిగి ఉండటం వంటి లక్షణాలుంటాయి. పుట్టిన తేదీ 3 దేవగురువైన బృహస్పతికి సంబంధించింది కావడం వల్ల నిశిత పరిశీలన, కుశాగ్రబుద్ధి, సృజనాత్మకత కలిగి ఉండి, మేధావిగా గుర్తింపబడతారు. మీ సంవత్సర సంఖ్య 1. ఇది పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి చిహ్నం. అందువల్ల అనుకున్న లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆస్తులు సమకూర్చుకుంటారు. ప్రేమికులు జాగ్రత్తగా వ్యవహరించవలసిన సమయమిది. కోర్టుకేసులు, న్యాయసంబంధమైన వివాదాలు ఉన్న వారు కొంచెం సంయమనం పాటించాలి. లక్కీ నంబర్స్: 1,3,5,9; లక్కీ కలర్స్: ఎల్లో, రోజ్, పర్పుల్, గోల్డెన్, శాండల్. లక్కీ డేస్: మంగళ, గురు, ఆదివారాలు; సూచనలు: సాయిబాబాను, దత్తాత్రేయిడిని ఆరాదించడం, దక్షిణామూర్తి స్తోత్రం, ఆదిత్యహృదయపారాయణం చేయడం, తోబుట్టువులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్