అబుదాబి: స్టార్ స్ట్రయికర్ సునీల్ చెత్రి (27వ, 46వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగడంతో ఆసియా కప్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 4–1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. గోల్స్ పరంగా ఆసియా కప్ చరిత్రలో భారత్‌కిదే అతి పెద్ద విజయం. ఎనిమిదేళ్ల తర్వాత ఈ టోర్నీలో అడుగుపెట్టిన భారత్ 1964 తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ చెత్రి రెండు గోల్స్ చేయగా... అనిరుధ్ థాపా (68వ ని.లో), జెజె లాల్‌పెఖుల (80వ ని.లో) చెరో గోల్ చేశారు. థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా (33వ ని.లో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్ధభాగంలో లభించిన పెనాల్టీని చెత్రి గోల్‌గా మలచడంతో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అయితే ఈ సంబరం ఎక్కువ సేపు నిలవలేదు. మరో ఆరు నిమిషాల్లోనే థాయ్‌లాండ్ తరఫున తీరాసిల్ దంగ్డా గోల్ కొట్టడంతో స్కోరు 1–1తో సమం అయింది. రెండో అర్ధభాగం ప్రారంభ నిమిషంలోనే సునీల్ చెత్రి మెరుపు వేగంతో ఫీల్డ్ గోల్ చేసి భారత్‌కు 2–1తో ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత అనిరుధ్, జెజె లాల్‌పెఖుల గోల్స్‌తో తిరుగులేని ఆధిక్యంతో భారత్ మ్యాచ్‌ను ముగించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సునీల్ చెత్రి (66 గోల్స్) అంతర్జాతీయస్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ప్రస్తుత క్రీడాకారుల జాబితాలో లియోనెల్ మెస్సీని (అర్జెంటీనా–65 గోల్స్) వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్–85 గోల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో భారత్ 10న ఆతిథ్య యూఏఈతో... 14న బహ్రెయిన్‌తో ఆడనుంది. ఈ రెండింటిలో ఒక దానిని ‘డ్రా’ చేసుకున్నా భారత్ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.
ఆసీస్‌కు షాక్...
మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఆసియా కప్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గ్రూప్ ‘బి’ తొలి మ్యాచ్‌లో పటిష్ట ఆసీస్ 0–1తో అనామక జోర్డాన్ చేతిలో ఓటమి పాలైంది. మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను అనస్ బనీ యాసీన్ (26వ ని.లో) చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment