భారత్ ప్రతీకార పోరు
నేడు అఫ్ఘానిస్తాన్‌తో ఫైనల్
* శాఫ్ కప్ ఫుట్‌బాల్ టోర్నీ
* సాయంత్రం గం. 6.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం
తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (శాఫ్) టోర్నమెంట్ తుది పోరులో నేడు (ఆదివారం) భారత జట్టు అఫ్ఘానిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఓటమి లేకుండా కొనసాగుతున్న తమ జోరును తుది పోరులోనూ సాగించాలనే ఆలోచనలో భారత్ ఉంది. అయితే అఫ్ఘాన్ రూపంలో భారత్ ఈ మ్యాచ్‌లో గట్టి పోటీనే ఎదుర్కోబోతోంది.
నేపాల్‌లో జరిగిన చివరి(2013) ఎడిషన్‌లో తమను ఓడించి చాంపియన్‌గా అవతరించిన అఫ్ఘాన్‌పై బదులు తీర్చుకునేందుకు ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రపంచకప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ పోటీల్లో తీవ్రంగా నిరుత్సాహపరిచిన సునీల్ చెత్రి సేన ఈ విజయంతో అభిమానులను ఊరట పరచాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆరుసార్లు విజేతగా నిలిచిన భారత జట్టును ఆసియాలో రోజురోజుకూ పుంజుకుంటున్న అఫ్ఘాన్ జట్టు ఏమేరకు నిలువరిస్తుందో వేచి చూడాలి.
స్వదేశంలో జరిగిన 2011 టోర్నీ ఫైనల్లో భారత్ 4-0తో అఫ్ఘాన్‌ను చిత్తు చేసింది. ఇందులో సునీల్ చెత్రి హ్యాట్రిక్‌తో రెచ్చిపోయాడు. అయితే రెండేళ్ల అనంతరం ఖాట్మండూలో జరిగిన శాఫ్ కప్ ఫైనల్లో అఫ్ఘాన్ జట్టు 2-0తో బదులు తీర్చుకుంది. అప్పటి జట్టులో ఉన్న ఆటగాళ్లలో చెత్రి, జేజే, రాబిన్ సింగ్, అర్నాబ్, సుబ్రతా పాల్ మాత్రమే ఇప్పుడున్నారు. చెత్రి, జేజే ఫామ్‌తో పాటు 18 ఏళ్ల చాంగ్టే ప్రదర్శన లాభిస్తోంది.
మిడ్ ఫీల్డ్‌లో రౌలిన్ బోర్గెస్, లింగ్డో కీలకంగా ఉన్నారు. ఇదిలావుండగా అఫ్ఘాన్ జట్టును భారత్ తేలిగ్గా తీసుకుంటే మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కోచ్ స్టీఫెన్ కాన్‌స్టాంటైన్ ఇప్పటికే ఆ జట్టును ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఆ జట్టులోని 15 మంది ఆటగాళ్లలో చాలా మంది యూరప్‌లో ఆడినవారే. ఆసియా, యూరప్ ఆటగాళ్ల మధ్య చాలా తేడా ఉంటుందని, ఇది ఫలితంపై ప్రభావం చూపిస్తుందని కోచ్ భావిస్తున్నారు.