బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు.
దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ గోల్స్ చేశారు. లెబనాన్ తరఫున మాతూక్ తొలి షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్‌ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్ గోల్స్ చేయగా... బదర్ కొట్టిన నాలుగో షాట్ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment