India football team
-
Football: ఫైనల్లో భారత్.. పెనాల్టీ షూటౌట్లో లెబనాన్‌పై గెలుపు
బెంగళూరు: దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)లో భారత జట్టు తొమ్మిదో టైటిల్‌కు విజయం దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సునీల్ ఛెత్రి కెప్టెన్సీలోని టీమిండియా ‘పెనాల్టీ షూటౌట్’లో 4–2తో లెబనాన్ జట్టును ఓడించింది. మంగళవారం జరిగే ఫైనల్లో కువైట్ జట్టుతో భారత్ తలపడుతుంది. మరో సెమీఫైనల్లో కువైట్ 1–0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. లెబనాన్‌తో జరిగిన సెమీఫైనల్లో నిర్ణీత సమయం వరకు రెండు జట్లు ఖాతా తెరువలేకపోయాయి. అదనపు సమయంలోనూ గోల్స్ నమోదు కాలేదు. దాంతో విజేతను నిర్ణయించడానికి ‘షూటౌట్’ను నిర్వహించారు. ‘షూటౌట్’లో భారత్ తరఫున వరుసగా సునీల్ ఛెత్రి, అన్వర్ అలీ, మహేశ్ సింగ్, ఉదాంత సింగ్ గోల్స్ చేశారు. లెబనాన్ తరఫున మాతూక్ తొలి షాట్‌ను భారత గోల్‌కీపర్ గుర్ప్రీత్ సింగ్ సంధూ నిలువరించాడు. ఆ తర్వాత వాలిద్, సాదిక్ గోల్స్ చేయగా... బదర్ కొట్టిన నాలుగో షాట్ బయటకు వెళ్లడంతో భారత విజయం ఖరారైంది. గతంలో భారత్ 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లలో విజేతగా నిలిచింది. -
Intercontinental Cup: భారత్‌ను గెలిపించిన ఛెత్రి
భువనేశ్వర్: ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1–0 గోల్ తేడాతో వనుతూను ఓడించింది. భారత్ తరఫున ఏకైక గోల్‌ను కెప్టెన్ సునీల్ ఛెత్రి 81వ నిమిషంలో సాధించాడు. తొలి మ్యాచ్‌లో శుక్రవారం మంగోలియాను 2–0తో ఓడించిన భారత్ తమకంటే చాలా తక్కువ ర్యాంక్‌లో ఉన్న వనుతూపై విజయం సాధించేందుకు కూడా శ్రమించాల్సి వచ్చింది. తొలి అర్ధభాగంలో చాలా వరకు బంతిని తమ ఆదీనంలోనే ఉంచుకున్నా...గోల్ చేసేందుకు భారత్ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. మైదానంలో తన భార్య సోనమ్ మ్యాచ్‌ను తిలకిస్తుండగా...త్వరలో తండ్రి కాబోతున్న సంకేతాన్ని ఛెత్రి తన గోల్ సంబరంలో ప్రదర్శించాడు. రెండు విజయాల తర్వాత 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న భారత్ తమ చివరి పోరులో గురువారం లెబనాన్‌తో తలపడుతుంది. చదవండి: IND vs WI: టీమిండియా విండీస్ టూర్ షెడ్యూల్ ఖరారు.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే? -
FIFA WC: 1950లో బంగారం లాంటి అవకాశం వదిలేసిన భారత్
లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 106వ స్థానంలో ఉంది. క్రికెట్ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్‌లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్‌బాల్‌లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. 1950లో ఏమైందంటే... ఫుట్‌బాల్ ప్రపంచకప్ వచ్చిన ప్రతిసారీ అయ్యో మన జట్టూ ఉంటే బాగుండేదని సగటు క్రీడాభిమాని ఆశపడతాడు. అయితే 72 ఏళ్ల క్రితం 1950 ప్రపంచకప్‌లో తొలిసారి భారత్‌కు ఆడే అవకాశం దక్కింది. కానీ మన టీమ్ మాత్రం టోర్నీలో పాల్గొనలేకపోయింది. దీనికి సంబంధించి అనేక కారణాలు ప్రచారంలో ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1950లో ప్రపంచ కప్‌ను బ్రెజిల్లో నిర్వహించారు. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు ఎక్కువ దేశాలు ఆసక్తి చూపించలేదు. క్వాలిఫయింగ్‌లో 33 జట్లే పోటీ పడ్డాయి. దాంతో మన జట్టు క్వాలిఫయింగ్‌లో బర్మా, ఫిలిప్పీన్స్‌ల గ్రూప్‌లో నిలిచింది. ఆ రెండు జట్లు తప్పుకోవడంతో భారత్ ఆటోమెటిక్‌గా అర్హత సాధించింది. కానీ చివరి నిమిషంలో టోర్నీ నుంచి భారత్ తప్పుకుంది. ఏఐఎఫ్ఎఫ్ అధికారిక వివరణ ప్రకారం... జట్టు ఎంపికపై భేదాభిప్రాయాలు, తగినంత ప్రాక్టీస్ సమయం లేకపోవడం దీనికి కారణాలు. సుదీర్ఘ విరామం తర్వాత 1986లో భారత జట్టు ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ మ్యాచ్‌లు ఆడటం ప్రారంభించింది. అప్పటి నుంచి అన్ని సార్లూ బరిలోకి దిగినా... ఒక్కసారి కూడా ప్రధాన టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. 2026 ప్రపంచకప్ నుంచి 32 జట్లకు కాకుండా 48 జట్లకు ప్రధాన టోర్నీలో ఆడే అవకాశం కల్పించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. ఆసియా నుంచి ఎనిమిది లేదా తొమ్మిది దేశాలకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రానుంది. దాంతో ఇప్పటి నుంచే అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య 2026 ప్రపంచకప్‌లో బెర్త్ సంపాదించాలనే లక్ష్యంతో సన్నాహాలు మొదలుపెట్టాలి. -
ఆశలు గల్లంతు!
మస్కట్: భారత ఫుట్‌బాల్ జట్టు ప్రపంచ కప్ ఆశలకు దాదాపుగా తెరపడింది. 2022 ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్‌లో మూడో రౌండ్‌కు చేరాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. మంగళవారం ఇక్కడ జరిగిన గ్రూప్ ‘ఇ’ మ్యాచ్‌లో భారత్ 0–1తో ఒమన్ చేతిలో కంగుతింది. దీంతో రెండో రౌండ్ క్వాలిఫయింగ్ పోటీల్లో మరో మూడు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే భారత్ తన ప్రపంచకప్ పోరాటాన్ని దాదాపు ముగించేసింది. సొంత ప్రేక్షకుల మధ్య ఆడిన ఒమన్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. పదే పదే భారత ‘డి’ బాక్స్‌లోకి చొచ్చుకువచ్చి ఒత్తిడి పెంచింది. ఆట 33వ నిమిషంలో ఒమన్ ఆటగాడు మోసిన్ అల్ ఖాల్ది అద్భుతమైన పాస్‌ను గోల్‌గా మలిచిన ముసెన్ అల్ ఘసాని తన జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. మ్యాచ్‌లో గోల్ కోసం భారత్ చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో భారత ఓటమి ఖాయమైంది. ఒకవేళ భారత్ అర్హత పోటీల్లో ముందంజ వేయాలంటే మాత్రం మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో భారీ గోల్స్‌తో గెలవాలి. ఆ తర్వాత ఇతర గ్రూప్‌ల సమీకరణాలపై ఆధారపడాలి. ఆసియా జోన్ రెండో రౌండ్లో ఎనిమిది గ్రూప్‌ల్లో (ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి) అగ్రస్థానంలో నిలిచిన ఎనిమిది జట్లు నేరుగా మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. రెండో రౌండ్లో రెండో స్థానంలో నిలిచిన మిగతా నాలుగు అత్యుత్తమ జట్లకు కూడా మూడో రౌండ్‌కు చేరుకునే అవకాశం ఉంది. ఐదు జట్లున్న గ్రూప్ ‘ఇ’లో ప్రస్తుతం ఖతర్ (13 పాయింట్లు), ఒమన్ (12 పాయింట్లు), అఫ్గానిస్తాన్ (4 పాయింట్లు), భారత్ (3 పాయింట్లు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ మిగిలిన తమ మూడు మ్యాచ్‌లను వచ్చే ఏడాది మార్చి 26న ఖతర్‌తో; జూన్ 4న బంగ్లాదేశ్‌తో; జూన్ 9న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది. -
భారత్ ‘డ్రా’తో సరి
దుశంబే (తజికిస్తాన్): పేలవమైన ఆటతీరుతో భారత ఫుట్‌బాల్ జట్టు మరోసారి ప్రపంచకప్–2022 క్వాలిఫయర్స్‌లో గెలుపు బోణీ చేయలేకపోయింది. తన కంటే తక్కువ ర్యాంకు జట్టుతో ఆడుతున్నా... ఓటమి అంచుల వరకు వెళ్లిన భారత్ చివర్లో గోల్ చేసి ఊపిరి పీల్చుకుంది. ఇక్కడ గురువారం భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో ‘డ్రా’గా ముగిసింది. ఆట ఆరంభం నుంచే అఫ్గాన్ జట్టు దూకుడును ప్రదర్శించింది. నజారి (45+1వ ని.) గోల్ చేసి అఫ్గాన్‌కు ఆధిక్యాన్నిచ్చాడు. ఆట ఇంజూరి సమయం (90+2వ ని.)లో భారత్‌కు లభించిన కార్నర్‌ను ఫెర్నాండెస్ కొట్టగా... ‘డి’ బాక్స్‌లో ఉన్న సెమిలెన్ డౌన్‌గెల్ హెడర్ ద్వారా గోల్ పోస్టులోకి నెట్టి స్కోర్‌ను సమం చేశాడు. -
‘నిద్రపోతున్న దిగ్గజం’ లేచేది ఎప్పుడు?
సాక్షి, న్యూఢిల్లీ : కేవలం నలభై లక్షల జనాభా కలిగిన, అందులోనూ 1991లో స్వాతంత్య్రం సాధించిన క్రొయేషియా మొట్ట మొదటిసారి వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఫైనల్‌కు చేరుకోవడం అసాధారణ విషయం. కేవలం 34 లక్షల జనాభా కలిగిన ఉరుగ్వే, నాలుగు లక్షల లోపు జనాభా కలిగిన ఐస్లాండ్ క్రీడాకారులతో పోటాపోటీగా రాణించి ప్రపంచ ప్రజల ప్రశంసలు అందుకోవడం క్రొయేషియా క్రీడాకారులకే దక్కిన అరుదైన గౌరవం. ఇంతటి చిన్న దేశాలు అంతటి ఘనకీర్తిని దక్కించుకుంటున్నప్పుడు 130 కోట్ల జనాభా కలిగిన భారత దేశం ఇంతటి చిన్న దేశాలతోని ఎందుకు పోటీపడలేకపోతోందని, ఎందుకు ఫుట్‌బాల్ క్రీడారంగంలో రాణించలేక పోతోందన్న ప్రశ్న తలెత్తక మానదు. ‘భారత్ నిద్రపోతున్న దిగ్గజం’ అని 2012లో జరిగిన సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ వ్యాఖ్యానించారు. ‘భారత్‌లో 130 కోట్ల జనాభా ఉంది. వారిలో 130 కోట్ల మంది ఫుట్‌బాల్ ఆడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ నిద్రపోతున్న దిగ్గజం. ఈ దిగ్గజం నిద్రలేపడానికి ఒక అలారం క్లాక్ సరిపోక పోవచ్చు. రకరకాల అలారం క్లాక్‌లను ఏర్పాటు చేయాల్సి రావచ్చు. ఆ మాటకొస్తే భారత్ ఇప్పటికీ నిద్రపోతోందని చెప్పడం సబబు కాదు. అది మెల్లగా మేల్కొనే ప్రక్రియ ప్రారంభమైంది’ అని బ్లాటర్ వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారో తెలియదుగానీ ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఆరేళ్లు అవుతున్నా ‘నిద్రపోతున్న దిగ్గజం’ ఇంకా కదలిక లేదు. నిద్ర లేస్తున్న సూచనలు కూడా లేవు. భారత్‌లో జనాభా ఎక్కువగా ఉంది కనుక ఫుట్‌బాల్‌లో (ఆ మాటకోస్తే ఏ ఆటలోనైనాసరే) రాణించే సామర్థ్యం భారత్‌కు ఎక్కువగా ఉంటుందని భావించడం అర్థరహితం. ఒలింపిక్స్, సాకర్ వరల్డ్‌కప్ పోటీలు వచ్చినప్పుడల్లా అనివార్యంగా భారత్ ప్రస్తావన వస్తోంది. రాజకీయ నాయకులు, క్రీడా బోర్డులు చీఫ్‌లు అప్పటికప్పుడు నాలుగు మాటలు మాట్లాడి మళ్లీ నిద్రలోకి జారుకుంటున్నారు. ఎంతమంది ఉన్నారంటూ తలలు లెక్క పెట్టడం ద్వారా మంచి జాతీయ క్రీడాకారులను తయారు చేయలేం. దేశంలోని క్రీడా సంస్కృతిపైనే అది ఆధారపడి ఉంటుంది. భారత క్రీడాకారులు రాటుదేలి రాణించాలంటే సహజ నైపుణ్యంకన్నా మంచి వ్యవస్థలు ఎక్కువ అవసరం. ఆకర్షణీయమైన పథకాలకన్నా అకుంఠిత దీక్షతో కఠోర శ్రమ చేయడం ఎక్కువ అవసరం. 2017, అక్టోబర్ నెలలో అండర్–17 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహించింది. అలాంటి అవకాశం దొరకడం ఒక అదృష్టం. ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని దేశంలోని యువతలో క్రీడా స్ఫూర్తిని రగిలించి క్రీడా సంస్కృతి పరిఢవిల్లేందుకు అందమైన బాటలు వేసి ఉంటే ఎంతో బాగుండేది. టోర్నమెంట్ వచ్చిందీ వెళ్లింది. భారత్ నిద్రలేవలేదు. బలమైన పునాదులు లేకుండా ఫుట్‌బాల్‌లో రాణించలేం. అట్టడుగు స్థాయి క్రియాశీలత, అందుకు ప్రోత్సాహక వ్యవస్థలు అవసరం. ఈ విషయంలో భారత్ ఇప్పటికీ వెనకబడే ఉంది. పేరుకు భారత్‌లో అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య ఉంది. దీని దృక్పథమే తలకిందులు. క్రీడాకారుల కోసం పైనుంచి కిందకు చూస్తోంది. అట్టడుగు లేదా గ్రామీణ స్థాయి క్రీడా కార్యక్రమాలను నిర్వహించకుండా డబ్బు ఖర్చుతో కూడిన అతిపెద్ద లీగ్‌ల నిర్వహణపైనే దృష్టిని కేంద్రీకరిస్తోంది. క్రీడా సంస్కృతి లేకుండా ఎన్ని మౌలిక సౌకర్యాలున్నా లాభం లేదు. గ్రామీణ స్థాయి నుంచి క్రీడలను ప్రోత్యహించే వ్యవస్థలు ఉన్నప్పుడు, అవి సవ్యంగా పనిచేసినప్పుడు క్రీడా సంస్కృతి పెరుగుతుంది. క్రొయేషియా క్రీడాకారులు భలే రాణించారబ్బా! అంటూ అబ్బురపడితే మనకా క్రీడ అబ్బదు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఏదోరోజు వారివలే మనమూ రాణిస్తామన్న ఆత్మవిశ్వాసంతో అడుగులేయాలనుకుంటే నిద్రమత్తు దానంతట అదే తొలగిపోతుంది. దిగ్గజం ఘీంకారం వినిపిస్తుంది. -
ఆరు స్థానాలు ఎగబాకిన భారత్
జురిచ్ : ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లో భారత ఫుట్‌బాల్ జట్టు ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకింది. గతంలో 172 వ ర్యాంకులో ఉన్న భారత్ గురువారం అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రకటించిన ర్యాంకుల్లో 166వ స్థానాన్ని ఆక్రమించింది. స్విట్జర్లాండ్ లోని జురిచ్ నగరంలో ఫిఫా ఈ ర్యాంకులు విడుదలచేసింది. గత నెలలో ఫస్ట్ ర్యాంకు సాధించిన బెల్జియం తాజా ర్యాంకింగ్స్‌లోనూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గతనెలలో 2018 ప్రపంచకప్ అర్హత కోసం నిర్వహించిన మ్యాచ్‌ల్లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్ 172వ ర్యాంకుకు పడిపోయింది. ఆ తర్వాత నిలకడ ఆటతీరు ప్రదర్శించి ఆరు స్థానాలు మెరుగు పరుచుకుంది. బెల్జియం అగ్రస్థానాన్ని ఆక్రమించగా.. అర్జెంటైనా, స్పెయిన్, జర్మనీలు వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంకులను దక్కించుకున్నాయి.